Rishabh Pant:

  భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ గా పేరు ఉన్న బ్యాట్స్ మెన్ రిషభ్ పంత్ టీ20 ఫార్మాట్ లో విఫలమవుతూనే ఉన్నాడు. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20లో మరోసారి పరుగులు చేయడంలో తడబడ్డాడు. ఓపెనర్ గా ప్రమోషన్ అందుకుని ఇన్నింగ్స్ ప్రారంభించిన పంత్ 13 బంతుల్లో కేవలం 6 పరుగలు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. స్ట్రైక్ రేట్ 46.15. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ కుదురుకుని మంచి షాట్లు ఆడినప్పటికీ పంత్ మాత్రం తడబడ్డాడు. 


ఎన్ని అవకాశాలిచ్చినా..


ఇప్పటికి రిషభ్ పంత్ కు పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో చాలా అవకాశాలు వచ్చాయి. అయితే అతను మాత్రం వరుసగా విఫలమవుతున్నాడు. టెస్టుల్లో రాణిస్తున్నప్పటికీ టీ20ల్లో ఇప్పటివరకు పంత్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. పంత్ ఫాం బాలేదు కాబట్టే టీ20 ప్రపంచకప్ లో పంత్ ను కాదని కీపర్ గా దినేశ్ కార్తీక్ ను తీసుకున్నారు. మెగా టోర్నీ అనంతరం న్యూజిలాండ్ సిరీస్ కు వైస్ కెప్టెన్ గా కూడా ఎంపిక చేశారు. పంత్ హార్డ్ హిట్టర్ కాబట్టి పవర్ ప్లే లో బాగా ఆడతాడనే అంచనాలతో కివీస్ తో రెండో టీ20 లో ఓపెనర్ గా పంపించారు. అయినప్పటికీ పవర్ ప్లే అవకాశాలను వినియోగించుకోలేదు. ఉన్నంతసేపు తీవ్రంగా తడబడి లాకీ ఫెర్గూసనే బౌలింగ్ లో ఔటయ్యాడు. 






ఇలానే ఉంటే ఉద్వాసనే!


అసలే ఇప్పుడు టీమిండియాలో చోటు కోసం విపరీతమైన పోటీ ఉంది. ఒక్కో స్థానానికి ఇద్దరు ముగ్గురు రెడీగా ఉన్నారు. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లాంటి వాళ్లు వికెట్ కీపర్లుగా సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో వరుస వైఫల్యాలు పంత్ టీ20 కెరీర్ కు మంచివి కావనే చెప్పుకోవాలి. ఇప్పటికే సెలెక్టర్లు పంత్ కు చాలినన్ని అవకాశాలు ఇచ్చారు. ఇప్పటినుంచైనా రిషభ్ పంత్ తన ఆటతీరు మార్చుకుని రాణించకపోతే అతనికి ఉద్వాసన తప్పదనే వార్తలు వస్తున్నాయి. 


వరుసగా విఫలమవుతున్న పంత్ స్థానంలో సంజూ శాంసన్ ను తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మాజీలు, అభిమానులు సెలెక్టర్లకు ఇదే సూచిస్తున్నారు. అయినప్పటికీ జట్టు యాజమాన్యం పంత్ కు అండగా నిలబడుతోంది. అవకాశాలు ఇస్తూనే ఉంది. అయితే అయితే ఆటగాళ్లపై నమ్మకం ఉంచడం మంచిదే కానీ.. వరుసగా విఫలమవుతున్న పంత్ ను కొనసాగిస్తే అది జట్టుకు మంచిది కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  పంత్ వైఫల్యం ఇలానే కొనసాగితే వేటు మాత్రం తప్పదు.