Shubman Gill on Dhoni:  శుభ్ మన్ గిల్.... మూడేళ్ల కిందట వన్డేల్లోకి, రెండేళ్ల కింద టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. అప్పటినుంచి నిలకడగా రాణిస్తూ  ఆ రెండు ఫార్మాట్లలో జట్టులో కీలకంగా మారాడు. అయితే టీ20ల్లో మాత్రం ఇంకా గిల్ కు అవకాశం రాలేదు. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న సిరీస్ లోనైనా అరంగేట్రం చేస్తాడని భావించినా తుది జట్టులో స్థానం దక్కలేదు. మంగళవారం చివరిదైన మూడో టీ20 జరగనుంది. అందులోనైనా అవకాశం వస్తుందేమా చూడాలి. 


ఈ క్రమంలో తాను వన్డేల్లోకి అరంగేట్రం చేసిన రోజును గుర్తుచేసుకున్నాడు శుభ్ మన్ గిల్. న్యూజిలాండ్ తో 2019 లో వన్డే సిరీస్ లో భారత్ కు ఘోర ఓటమి ఎదురైంది. టీమిండియా 92 పరుగులకే కుప్పకూలింది. అదే గిల్ కు మొదటి మ్యాచ్. అందులో 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో తీవ్ర నిరాశకు గురైన తనను అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఓదార్చాడని గిల్ అన్నాడు. అప్పుడు తను చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయని పేర్కొన్నాడు.  


ఆ మాటలు నన్ను ఓదార్చాయి


'ఆ రోజు చాలా నిరుత్సాహపడ్డాను. అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. అరంగేట్ర మ్యాచ్ ఇలా అయ్యిందని చాలా బాధపడ్డాను. అప్పుడు కెప్టెన్ ధోనీ నా దగ్గరకు వచ్చాడు. 'బాధపడకు. నా కంటే నీ అరంగేట్రమే నయం.' అని అన్నాడు. ఎందుకంటే బంగ్లాదేశ్ తో తొలి మ్యాచులో ధోనీ కేవలం ఒక్క బంతి మాత్రమే ఎదుర్కొని రనౌట్ రూపంలో డకౌట్ గా వెనుదిరిగాడు. ఎంతో సరదాగా మాట్లాడాడు. దీంతో నా మూడ్ కొంచెం మారింది.' అని గిల్ అన్నాడు. 'గొప్ప స్థాయిలో ఉన్న ఆటగాడు ఇలా అండగా నిలుస్తారని నేను ఆశించలేదు. అది నాకెంతో నచ్చింది. నేను కూడా అతడిలా ఉండాలని అనుకున్నా' అని గిల్ గుర్తుచేసుకున్నాడు. 



న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ అనంతరం టీమిండియా వన్డే సిరీస్ ఆడనుంది. ఆ సిరీస్ కు గిల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. శిఖర్ ధావన్ వన్డే జట్టును నడిపించనున్నాడు.