IND vs NZ 2nd T20I:

  న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20లో భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 51 బంతుల్లోనే 111 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ పై కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పొగడ్తల వర్షం కురిపించాడు. 'సూర్య ఇన్నింగ్స్ అద్భుతం. నేను చూసిన ఉత్తమ ఇన్నింగ్సుల్లో ఇది ఒకటి. అతనాడిన కొన్ని షాట్లు నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. అతని ఇన్నింగ్స్ చాలా ప్రత్యేకం.' అని అన్నాడు. 


తమ ఓటమిపైనా కేన్ స్పందించాడు. 'మేం మా ఉత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయాం. గెలుపు కోసం మరింత కృషి చేయాల్సింది. మేం బంతితోనూ, బ్యాటుతోనూ విఫలమయ్యాం.' అని అన్నాడు. 


ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 191 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 126 పరుగులకు ఆలౌటై అయ్యి 65 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. భారత్ విజయంలో సూర్య సుడిగాలి ఇన్నింగ్స్ కీలకపాత్ర పోషించింది. 



ఆకాశమే హద్దు


న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లో అజేయ ఇన్నింగ్స్‌ (111*: 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఆడిన సూర్యకుమార్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తన ఆటతో జట్టును భారీ స్కోరు వైపు నడిపించిన సూర్య టీమ్‌ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. రోహిత్‌ శర్మ తర్వాత ఈ ఏడాది టీ20ల్లో రెండు సెంచరీలు చేసిన ఆటగాడిగా సూర్య నిలిచాడు. మిస్టర్‌ 360 సెంచరీపై సామాజిక మాధ్యమాల వేదికగా మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కింగ్ కోహ్లీ ట్వీట్‌ చేస్తూ ఈ మ్యాచ్‌ను లైవ్‌లో చూడలేకపోయానని తెలిపాడు. ఈ అసాధారణ ఆటగాడు కచ్చితంగా మరో వీడియో గేమ్‌ను పోలిన షాట్లతో విరుచుకుపడి ఉంటాడంటూ కొనియాడాడు. 


‘‘అతడు ప్రపంచంలోనే ఉత్తమమైన ఆటగాడు ఎందుకయ్యాడో తన ప్రదర్శనతో నిరూపిస్తున్నాడు. మ్యాచ్‌ను చూడలేదు. కానీ కచ్చితంగా అది మరో వీడియో గేమ్‌లాంటి ప్రదర్శనే అయ్యుంటుంది’’  -విరాట్‌ కోహ్లీ 


‘‘ఈ మధ్యన సూర్యుడు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు’’  -వీరేంద్ర సెహ్వాగ్‌


‘‘సూర్య.. ఏ గ్రహం మీదైనా బ్యాటింగ్ చేయగలడు’’  -ఇర్ఫాన్‌ పఠాన్‌