Bangladesh win first-ever Test match against Pakistan:  పాకిస్థాన్‌(Pakistan) గడ్డపై బంగ్లాదేశ్‌(Banglasesh) చరిత్ర సృష్టించింది. పసికూన ముద్ర చెరపేసేలా.. పాక్‌ దిమ్మ తిరిగేలా... క్రికెట్‌ ప్రపంచం ఉలిక్కిపడేలా బంగ్లా ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసిన తర్వాత కూడా పాకిస్థాన్‌ ఓడిపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. పాక్‌ను టెస్ట్ చరిత్రలో తొలిసారిగా ఓడించి రికార్డు సృష్టించింది. బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉన్న పాక్ జట్టును బంగ్లా ఆటగాళ్లు చిత్తుగా ఓడించడం విశేషం. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ సంబరాలు చేసుకుంటుండగా.... ఓటమితో పాక్‌ జట్టులో లుకలుకలు బయటపడ్డాయి. పాకిస్థాన్‌ జట్టుపై పది వికెట్ల తేడాతో నెగ్గి బంగ్లాదేశ్ జట్టు హిస్టరీ క్రియేట్ చేశారు. 


అతి విశ్వాసమే కొంపముంచిందా
బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్‌లో పాకిస్థాన్‌ అతి విశ్వాసమే కొంప ముంచినట్లు తెలుస్తోంది. పాక్ మొదటి ఇన్నింగ్స్‌లో డిక్లేర్ ఇవ్వడమే ఆ జట్టును ఓటమి అంచులకు చేర్చింది. అలాగే బంగ్లా ఆటగాళ్లు ఇటు బ్యాటింగ్, అటూ బౌలింగ్లోనూ రాణించి, సమిష్టి పట్టుదలతో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నారు.  రావల్పిండి వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో పాకిస్తాన్‌పై 10 వికెట్ల తేడాతో నెగ్గింది. సొంతగడ్డపై టెస్టుల్లో పాక్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించిన తొలి జట్టుగా కూడా రికార్డు నెలకొల్పింది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 448/6 స్కోర్ వద్ద డిక్లేర్డ్ ఇవ్వగా.. బంగ్లా 565 పరుగులు చేసి 117 పరుగుల ఆధిక్యం సాధించింది.


ఇక రెండో ఇన్నింగ్స్‌లో పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఓవర్ నైట్ స్కోరు 23/1‌తో చివరి రోజు ఆట కొనసాగించిన ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే అలౌట్ అయ్యింది. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ మిరాజ్(4/21), షకీబ్(3/44) బంతితో ప్రత్యర్థి పతనాన్ని చవిచూశారు. రిజ్వాన్(51) మినహా అందరూ పెవిలియన్కు క్యూ కట్టారు. పాక్.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని తీసివేయగా బంగ్లా ముందు 30 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 6.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా అలవోకగా సాధించింది. ముష్ఫికర్ రహీమ్ ఏకంగా 191  పరుగులు చేశాడు.  మెహిది హసన్ మిరాజ్ 77 పరుగులు చేసి , 5 వికెట్లు తీసి తన  ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో బంగ్లా జట్టు రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం పొందింది.






పాయింట్ల పట్టికలో ఎగబాకిన బంగ్లా
పాక్‌పై అద్భుత విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ జట్టు భారీ ఆధిక్యాన్ని అందుకుంది. దీంతో  10 వికెట్ల తేడాతో విజయం సాధించిన  బంగ్లాదేశ్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. అంతకుముందు బంగ్లాదేశ్ జట్టు ఎనిమిదో స్థానంలో ఉండేది. కాగా.. పాకిస్తాన్ ఈ ఓటమితో ఏడో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఇదిలా ఉంటే.. భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. భారత్  తర్వాత.. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా రెండవ స్థానంలో ,  న్యూజిలాండ్ మూడో స్థానంలో కొనసాగుతోంది.


బంగ్లాదేశ్ విజయం సాధించడంతో పాకిస్థాన్ జట్టుపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ జరుగుతోంది. ఒక నెటిజన్ ‘తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్‌ను దాని స్వంత ఇంటిలోనే ఓడించింది.’ అని రాసుకొచ్చాడు. తమ జట్టు ప్రదర్శన పట్ల పాక్ అభిమానులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. కొంతమంది నెటిజన్లు రావల్పిండి పిచ్‌పై ప్రశ్నలు లేవనెత్తారు. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం కూడా అభిమానుల నుంచి ట్రోల్ కి గురయ్యాడు.