Shikhar Dhawan: భారత క్రికెట్‌లో మరో శకం ముగిసింది. టీమ్‌ ఇండియా స్టార్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(Shikhar dhawan) అంతర్జాతీయ క్రికెట్‌ (International Cricket)కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఓపెనర్‌గా ధావన్‌ టీమిండియా(India) క్రికెట్‌లో చెరగని ముద్ర వేశాడు. ఎన్నో కీలక ఇ‌న్నింగ్స్‌లతో జట్టుకు విజయాన్ని అందించాడు. 2010లో అంతర్జాతీయ క్రికెట్‌ ప్రస్థానాన్ని ప్రారంభించిన శిఖర్ ధావన్... 2024లో రిటైర్‌ మెంట్ ప్రకటించాడు. ఈ 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ధావన్‌ ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి శకంలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. భారత బ్యాటింగ్‌కు మూలస్తంభంగా ఉన్నంత కాలం ధావన్‌ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ధావన్‌ ఆడిన కొన్ని కీలక ఇన్నింగ్స్‌లను ఓసారి నెమరు వేసుకుందాం..?

 

187 vs ఆస్ట్రేలియా, మొహాలి 2013 

భారత క్రికెట్‌ చరిత్రలో 17 మంది బ్యాటర్లు టెస్టు అరంగేట్రంలోనే సెంచరీ సాధించారు. అందులో ధావన్‌ ఒకడు. ధావన్ టెస్ట్ అరంగేట్రంలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ చేసి సత్తా చాటాడు. పటిష్టమైన ఆస్ట్రేలియా బౌలింగ్‌ను ఎదుర్కొని 85 బంతుల్లో శతకం చేసి క్రికెట్‌ ప్రపంచానికి హెచ్చరికలు పంపాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులతో పటిష్టంగా నిలిచిన దశలో క్రీజులోకి వచ్చిన ధావన్‌.. అద్భుత శతకంతో అలరించాడు. మోయిసెస్ హెన్రిక్స్, నాథన్ లియోన్, జేవియర్ డోహెర్టీల స్పిన్ త్రయాన్ని ఎదుర్కొంటూ శతకం చేశాడు. 33 ఫోర్లు, 2 సిక్సర్లతో 187 పరుగులు చేసి ధావన్‌ తన తొలి టెస్ట్‌ను చిరస్మరణీయంగా చేసుకున్నాడు. డబుల్ సెంచరీకి 13 తక్కువ దూరంలో ధావన్ ఇన్నింగ్స్‌ ముగిసింది. అయినా ధావన్ ఇన్నింగ్స్‌ భారత క్రికెట్‌ చరిత్రలో నిలిచిపోయింది. 

 

114 vs దక్షిణాఫ్రికా, కార్డిఫ్ 2013 

2013 జూన్ 6 ధావన్‌ చేసిన సెంచరీకి మరో ప్రత్యేకత ఉంది. రోహిత్ శర్మతో కలిసి ధావన్ తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. వన్డేలో ధావన్‌-రోహిత్ జోడీ విజయవంతమైన జంటగా గుర్తింపు పొందింది ఇక్కడి నుంచే. మూడేళ్ల తర్వాత ఈ మ్యాచ్‌తో మళ్లీ వన్డే ఆడిన ధావన్ సెంచరీ చేసి మెరిశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికాపై ధావన్ తన తొలి వన్డే శతకం చేశాడు. రోహిత్‌ శర్మతో కలిసి తొలి వికెట్‌కు 127 పరుగులు జోడించాడు. ఆ తర్వాత వీరిద్దరూ 18 సార్లు శతక భాగస్వామ్యం నెలకొల్పారు. 

 

98 vs న్యూజిలాండ్ వెల్లింగ్టన్ 2014

ధావన్ రెండు పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయినా ఈ ఇన్నింగ్స్‌ మాత్రం చాలా కీలకమైనది. ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ విధ్వంసంతో న్యూజిలాండ్ కేవలం 192 పరుగులకే ఆలౌట్ అయింది. తర్వాత భారత్‌ 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో ధావన్‌ ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. 14 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 98 పరుగులు చేశాడు. బ్రెండన్ మెకల్లమ్ ట్రిపుల్ సెంచరీతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 680 పరుగులకు ఆలౌటవుతున్నప్పటికీ, ధావన్ అద్భుత ప్రదర్శన అజింక్యా రహానే, క్లాస్ సెంచరీతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. 


137 vs దక్షిణాఫ్రికా, మెల్‌బోర్న్ 2015 

2015 ప్రపంచకప్‌లో ధోనీ భారత తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 137 పరుగులతో చెలరేగాడు. రోహిత్ ముందుగానే నిష్క్రమించడంతో ధావన్, కోహ్లీ జట్టును ఆదుకున్నారు. తొలి ప్రపంచకప్ సెంచరీతో సఫారీల పనిపట్టాడు.  ధావన్ 16 ఫోర్లు, రెండు సిక్సర్లతో మరో సెంచరీతో అదరగొట్టాడు. డేల్ స్టెయిన్, వెర్నాన్ ఫిలాండర్, మోర్నే మోర్కెల్ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ ధావన్‌ చెలరేగిపోయాడు. 

 

190 vs శ్రీలంక, గాలె 2017

2017లో గాలేలో శ్రీలంకకు ధావన్‌ చుక్కలు చూపించాడు. శ్రీలంక బౌలింగ్ దాడిని తుత్తునీయలు చేశాడు. మొదటి రోజే కేవలం 168 బంతుల్లోనే 190 పరుగులు చేశాడు. ఆ టెస్టులో ధావన్, ఛెతేశ్వర్ పుజారా 253 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 110 బంతుల్లో 16 బౌండరీలతో సెంచరీ చేసిన ధావన్‌ తర్వాత కూడా చెలరేగిపోయాడు. శిఖర్ ధావన్ తన డబుల్ సెంచరీని 10 పరుగుల తేడాతో కోల్పోయాడు.