Shikhar Dhawan announces retirement: టీమ్ ఇండియా గబ్బర్ సింగ్ శిఖర్ ధావన్(Shikhar Dhawan) అంతర్జాతీయ క్రికెట్(International Cricket)కు వీడ్కోలు పలికాడు. ధావన్ అనూహ్య ప్రకటనతో క్రికెట్ ప్రపంచం విస్మయానికి గురైంది. టీమిండియా లెఫ్టాండ్ ఓపెనర్‌గా ధావన్ ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు అడాడు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా క్రికెట్‌లో తనదైన శైలిలో రాణించాడు. దిగ్గజ కెప్టెన్ల సారథ్యంలో ధావన్ కీలక ఆటగాడిగా ఎదిగాడు. బయట సందడిగా ఉండే ధావన్.. మైదానంలో దిగితే మాత్రం సీరియస్ క్రికెటర్‌గా మారిపోతాడు. ధావన్.... కొన్ని సిరీస్‌ల్లో టీమిండియాకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. దూకుడైన ఆటతీరుతో ధావన్ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌కు కూడా ధావన్ వీడ్కోలు పలికాడు. శుభ్‌మన్ గిల్ రాకతో టీమిండియా ఓపెనర్‌గా ధావన్ ఆశలు సన్నగిల్లాయి. జట్టులో స్థానం దక్కడం గగనంగా మారడంతో ధావన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
అనూహ్య నిర్ణయం
భారత క్రికెట్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ శకం ముగిసింది. లెఫ్టాండ్ ఓపెనర్‌గా టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన ధావన్.. తన కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ధావన్ చివరిసారిగా 2022 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ తరపున ఆడాడు. ఆ తర్వాత ధావన్‌కు జట్టులో స్థానం దక్కలేదు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ రాకతో ధావన్‌కు టీమిండియాలో స్థానం దక్కడం కష్టమైపోయింది. 38 ఏళ్ల ధావన్ తన రిటైర్ మెంట్ ప్రకటనను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఢిల్లీలో జన్మించిన ధావన్.. విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అయితే తొలి మ్యాచ్‌లోనే ధావన్ డకౌట్ అయ్యాడు. అయితే ప్రారంభ వైఫల్యాల తర్వాత, ధావన్ 2013లో భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. ఈసారి వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు. మంచి ఇన్నింగ్స్‌లతో జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
ధావన్ కెరీర్ ఇలా...
శిఖర్ ధావన్ 2013 మార్చి 16న టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే రికార్డు సృష్టించాడు. కేవలం 85 బంతుల్లోనే సెంచరీ చేసి టెస్టుల్లో అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2013, 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసి గోల్డెన్ బ్యాట్'ను అందుకున్నాడు. 2015 వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ ధావన్ నిలిచాడు. 167 వన్డేల్లో భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ధావన్ 44.11 సగటుతో 6793 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు చేశాడు. 68 టీ 20 మ్యాచుల్లో 27.92 సగటుతో 1759 పరుగులు చేశాడు. ఇందులో 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 34 టెస్టు మ్యాచ్‌ల్లో ధావన్ 40.61 సగటుతో ఏడు సెంచరీలు, ఐదు అర్ధసెంచరీలతో 2315 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా ఐపీఎల్‌లో ఆడతానని ధావన్ తెలిపాడు.