Shikhar Dhawan Announced Retirement : శిఖర్‌ ధావన్‌(Shikhar Dhawan).. టీమిండియా(Team india ) గబ్బర్‌. మైదానంలో బౌలర్లపై ఎదురుదాడికి దిగినా... సొగసైన కవర్‌ డ్రైవ్‌లు ఆడినా... భారీ షాట్లతో విరుచుకుపడినా... క్యాచ్‌ పట్టిన తర్వాత తొడగొట్టినా... అది శిఖర్‌కే చెల్లింది. మైదానం బయట వ్యక్తిగత జీవితం తనను వేధించినా...భార్య విడిపోయినా.. కొడుకు దూరమై కుంగిపోయినా... ఇవేమీ ఆటలో కనిపించకుండా ఎప్పుడు హీరోలా నవ్వుతూనే ఉన్నాడు శిఖర్ ధావన్‌.. అందుకే అతడు భారత క్రికెట్‌లో రియల్‌ హీరో. మరి మైదానం బయట యువ ఆటగాళ్లతో కలిసి రీల్స్‌ చేసినా... బాలీవుడ్‌ పాటలకు పృధ్వీ షా వంటి యువ ఆటగాళ్లతో స్టెప్పులేసినా.. అశ్వీన్‌తో రీల్స్‌ చేసినా అదీ ధావన్‌కే చెల్లింది. 





 

సున్నా నుంచి ఆరంభమై...

శిఖర్ తన కెరీర్‌ను సున్నా నుంచి ఆరంభించాడు. సున్నా నుంచి ఆరంభమై ఆ తర్వాత టీమిండియాలో కీలక ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 2010 అక్టోబర్‌లో విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా తొలి మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు శిఖర్‌ ధావన్‌. ఆ మ్యాచ్‌లో రెండే బంతులు ఎదుర్కొన్న ధావన్‌ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా వైఫల్యాలు వెంటాడడంతో జట్టుకు దూరమయ్యాడు. మూడేళ్లపాటు ధావన్‌కు మళ్లీ జట్టులో స్థానం దక్కలేదు. మూడేళ్లు జట్టుకు దూరమైనా ధావన్‌ కుంగిపోలేదు. మరింత పట్టుదలతో రాటుదేలాడు. 2013లో ధావన్‌ మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఈసారి వచ్చిన అవకాశాన్ని వదలలేదు. మంచి ఇన్నింగ్స్‌లు ఆడి జట్టులో ఓపెనర్‌ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 2013లోన ఛాంపియన్స్‌ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసి గోల్డెన్‌ బ్యాట్‌ను కూడా అందుకుని తన ప్రతిభకు తిరుగులేదని నిరూపించాడు. 2013లోనే టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన ధావన్‌ అంతర్జాతీయ క్రికెట్‌ చూపును తన వైపునకు తిప్పుకున్నాడు. ఆడిన తొలి టెస్ట్‌లోనే కేవలం 85 బంతుల్లో శతకం బాదేశాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా ధావన్‌ రేపిన ప్రకంపనలు చాలా రోజులు కొనసాగాయి. ఇప్పుడు 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ఈ స్టార్ లెఫ్టాండర్‌ వీడ్కోలు పలికాడు. ఇక ఐపీఎల్‌లో మాత్రం ధావన్‌ కొనసాగుతాడు. ధావన్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా ఆతని ఇన్నింగ్స్‌లు మాత్రం అతడిని గుర్తు చేస్తూనే ఉంటాయి.

 


భావోద్వేగ ప్రకటన

" దేశం కోసం ఆడాలన్న నా కల నెరవేరింది. ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది.. నాకు మద్దతుగా నిలిచిన కుటుంబానికి, చిన్ననాటి కోచ్‌లకు, బీసీసీఐకి, డీడీసీఏకి కృతజ్ఞతలు" అని శిఖర్ ధావన్ తన రిటైర్‌మెంట్‌ ప్రకటనలో పేర్కొన్నాడు. చిన్ననాటి కోచ్ తారక్ సిన్హా, మదన్ శర్మ తనను వేలు పట్టుకుని క్రికెట్‌లో నడిపించాడని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. క్రికెట్ ప్రయాణానికి వీడ్కోలు పలికే ఈ సందర్భంలో దేశం కోసం చాలా క్రికెట్‌ ఆడానన్న సంతృప్తి తనకు ఉందని ధావన్‌ తెలిపాడు. ఈ అవకాశాన్ని ఇచ్చిన బీసీసీఐకి ధావన్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. తన క్రికెట్ ప్రయాణంలో ఈ అధ్యాయాన్ని ముగిస్తున్న వేళ.. లెక్కలేనన్ని జ్ఞాపకాలను తనతో తీసుకెళ్తున్నానని ధావన్‌ అన్నాడు.