MS Dhoni: భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని జాతీయ జట్టులోకి రాకముందు స్పోర్ట్స్ కోటాలో టికెట్ కలెక్టర్‌గా పనిచేసేవాడన్న సంగతి తెలిసిందే. అయితే ధోని టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాక కూడా అతడికి ఓ జబర్దస్త్ జాబ్ ఆఫర్ వచ్చింది. అతడు సారథిగా వ్యవహరిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ అధినేత ఎన్. శ్రీనివాసన్ యజమానిగా ఉన్న ఇండియన్ సిమెంట్స్‌లో ధోనీకి వైస్ ప్రెసిడెంట్‌గా ఉద్యోగం వచ్చింది. ఇందుకు సంబంధించిన జాబ్ అపాయింట్‌మెంట్ లెటర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
భారత జట్టు 2007లో ఐసీసీ తొలిసారిగా నిర్వహించిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు ట్రోఫీ అందించిన తర్వాత.. ధోనీకి క్రేజ్ పెరిగింది. ఇక 2011లో వన్డే వరల్డ్ కప్ కూడా నెగ్గాక అది రెట్టింపయ్యింది. అప్పటికే ఐపీఎల్ ప్రారంభమై చెన్నై సూపర్ కింగ్స్ ఒకసారి ట్రోఫీ కూడా గెలిచిన నేపథ్యంలో సీఎస్కే అతడిని తమ సిమెంట్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్‌గా (మార్కెటింగ్ విభాగానికి) నియమించుకుంది. నాడు బీసీసీఐలో కీలకంగా ఉన్న ఎన్. శ్రీనివాసన్ ధోనీని తన సంస్థలో ధోనీని ఉపాధ్యక్షుడిగా నియమించాడు.
అపాయింట్‌మెంట్ లెటర్‌లో ధోనికి నెల జీతాన్ని రూ. 43 వేలుగా నిర్దారించారు. ఇందులో డీ.ఏ రూ. 21,790 కాగా స్పెషల్ పే కింద రూ. 20 వేలుగా నిర్దారించారు. ధోనీకి వచ్చిన జీతం కంటే స్పెషల్ అలవెన్స్ కిందే అతడికి రూ. 60 వేలు దక్కింది. అంటే నెల జీతం కంటే ప్రత్యేక అలవెన్స్ కిందే ధోనీకి ఎక్కువ వచ్చింది. స్పెషల్ అలవెన్స్‌తో కలుపుకుంటే ధోని జీతం నెలకు రూ. 1.7 లక్షలుగా ఉంది. వాస్తవానికి 2012లో ధోనీకి సీఎస్కే ఇచ్చిన వార్షిక వేతనం (ఐపీఎల్ ఆడినందుకు) రూ. 8.2 కోట్లుగా ఉంది.
వాస్తవానికి ఈ పోస్టును ఐపీఎల్ వ్యవస్థాపకుడు, భారత్‌లో బ్యాంకులను బురిడీ కొట్టించాడని ఆరోపణలు ఎదుర్కుంటూ ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న లలిత్ మోడీ 2017లో చేసిన పోస్ట్. అప్పుడు లలిత్ మోడీకి, శ్రీనివాసన్‌కు విభేదాలుండేవి. ఆయనను టార్గెట్‌గా చేసుకునే మోడీ.. ఈ పోస్ట్ పెట్టాడు. ‘బీసీసీఐలో ఉన్న పెద్దమనుషులు తమ పదవులను అడ్డుపెట్టుకుని పదే పదే ఈ తప్పులకు పాల్పడుతున్నారు. ధోని సంపాదన యేటా రూ. 100 కోట్లకు పైనే ఉంది. అలాంటప్పుడు మళ్లీ ఈ ఉద్యోగం దేనికి..?’అని ఆయన రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ కావడం గమనార్హం.
కాగా ఇటీవల కాలంలో వస్తున్న పలు రిపోర్టుల ప్రకారం ధోని ఆస్తుల విలువ సుమారు రూ. 1,050 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం. అలాంటి ధోని నెలకు రూ. 43 వేల జీతానికి ఇండియన్ సిమెంట్స్‌లో పనిచేశాడని ఈ పోస్ట్ వైరల్ అవుతుండటం నెటిజన్లను ఆకర్షిస్తున్నది. శ్రీనివాసన్‌తో ధోనీకి సత్సంబంధాలున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial