టీమ్‌ఇండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్... క్రికెట్ అభిమానులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పాడు. అలాగే గతేడాది తాను ఏం సాధించాలని అనుకున్నానో తెలుపుతూ ఓ జాబితాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ జాబితా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఓ పేపర్ ముక్కపై గిల్ 2023లో తాను ఏం సాధించాలని అనుకున్నాడో రాశాడు.
2023లో గిల్ రాసుకున్న జాబితా ఇది
ఈ ఏడాది(2023) భారత్ తరఫున అత్యధిక సెంచరీలు బాదడం..
కుటుంబ భ్యులను ఆనందంగా ఉంచడం
అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి మంచి ఫలితాలు సాధించడం
వరల్డ్ కప్‌లో ఆడటం..
ఇలా జాబితా పోస్ట్ చేయడంతోపాటు నూతన సంవత్సర శుభాకాంక్షలూ చెప్పాడు. 2023 ఏడాదికి ముగింపు పలికేశామని... తనకు గత ఏడాది ఎన్నో అనుభవాలు, మరెన్నో పాఠాలు నేర్చిందని అన్నాడు. ఏడాది చివర్లో అనుకున్నంత సాఫీగా సాగలేదని అంగీకరించాడు. కొత్త ఏడాదిలో ఎదురయ్యే కొత్త సవాళ్లను తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు గిల్ వెల్లడించాడు. 2024లో మన లక్ష్యాలను సాధించి అభిమానులకు మరింత ప్రేమ, సంతోషం పంచుతామని హామీనిచ్చాడు. ఇటీవలే గిల్ గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా నియమితుడైన సంగతి తెలిసిందే.
2023లో రికార్డులే రికార్డులు
గత ఏడాది అద్భుత ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్.. అరుదైన రికార్డును తన పేర లిఖించుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్, కోహ్లీల రికార్డులను బద్దలు కొట్టాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ చేశాడు. గిల్ కేవలం 32 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఈ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్‌తో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వన్డే పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా గిల్ ఐదో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులను బద్దలు కొట్టాడు.
భారత్ తరఫున ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వన్డే పరుగులు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. 1998లో క్రికెట్ గాడ్ సచిన్ 1894 పరుగులు చేశాడు. సౌరవ్ గంగూలీ రెండో స్థానంలో ఉన్నాడు. గంగూలీ 1999లో 1767 పరుగులు చేశాడు. రాహుల్ ద్రవిడ్ మూడో స్థానంలో ఉండగా ది వాల్ 1761 పరుగులు చేశాడు. సచిన్ మళ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతను 1996లో మరోసారి మాస్టర్ బ్లాస్టర్ 1611 పరుగులు చేశాడు. శుభ్‌మన్ ఈ ఏడాది వన్డేల్లో 1500 పరుగులు చేశాడు. ఈ విషయంలో రోహిత్, కోహ్లిలను గిల్ వెనక్కినెట్టాడు. 2019లో రోహిత్ 1490 పరుగులు చేయగా.. 2017లో కోహ్లీ 1460 పరుగులు చేశాడు. వీరిద్దరిని అధిగమించి గిల్ 1500 పరుగులు చేసి సత్తా చాటాడు.
మరోవైపు దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో గిల్ వైఫల్యంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar ) స్పందించాడు. టెస్టు క్రికెట్లో(Test Cricket) బ్యాటింగ్ చేస్తున్నప్పుడు భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తన దూకుడు తగ్గించుకోవాలని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ సూచించాడు.