ICC ODI WC 2023: భారత్‌ (Bharat) వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో టీమిండియా(Team India) స్టార్‌ పేసర్ మహ్మద్‌ షమీ(Mohammed Shami) ప్రదర్శన క్రికెట్‌(Cricket) అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుంది. ప్రతీ బంతికి వికెట్‌ తీసేలా.. బంతిబంతికి పరీక్ష పెట్టేలా..బుమ్రా(Bumrah), సిరాజ్‌(Siraj)లకు ఆత్మ విశ్వాసం పెరిగేలా షమీ చెలరేగిపోయాడు. బంతితో నిప్పులు చెరిగాడు. బాల్‌ అందుకుంటే వికెట్‌ పక్కా అనేంతలా అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రతీ బంతికి వికెట్‌ తప్పదేమో అని బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టాడు. తొలి నాలుగు మ్యాచుల్లో తుది జట్టులో ఆడే అవకాశమే దక్కని షమీ.. ఒక్కసారి అవకాశం దక్కిన తర్వాత తానేంటో నిరూపించుకున్నాడు. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఓటమితో షమీ సహా క్రికెటర్లు... కోట్లాది మంది అభిమానుల గుండె ముక్కలైంది. ఈ నేపథ్యంలో మహ్మద్ షమీ మాజీ భార్య హసీన్‌ జహాన్‌ మరోసారి భారత క్రికెట్‌ జట్టుపై నోరు పారేసుకుంది. అసలే వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ఓడిపోయి పీకల్లోతు బాధలో ఉన్న అభిమానులకు పుండుమీద కారం చల్లేలా వ్యాఖ్యలు చేసింది. దీంతో  అభిమానులు భగ్గుమంటున్నారు.


ఎవరెన్ని కుట్రలు చేసినా అంతిమ విజయం మాత్రం మంచి మనసున్నోళ్లదేనని షమీ మాజీ భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అంటే మంచి మనసున్న ఆస్ట్రేలియానే విజయం వరించిందని అర్థం వచ్చేలా షమీ మాజీ భార్య పోస్ట్‌ పెట్టింది. ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ ఫలితం అనంతరం హసీన్‌ జహాన్‌ ఈ పోస్ట్‌ చేసింది. షమీతో పాటు టీమిండియాను ఉద్దేశించే ఆమె ఇలా చేసిందని అభిమానులు మండిపడుతున్నారు. ఆమె కెమెరా వైపునకు చూస్తుండగా బ్యాక్‌గ్రౌండ్‌లో చివరికి విజయం వరించేది మంచి మనసున్నోళ్లకే అని ఆడియో వినిపించింది. ఈ వీడియోను షేర్‌ చేస్తూ ఆమె ‘అల్లాహు అక్బర్‌’ అని కూడా రాసుకొచ్చింది. దీనిపై క్రికెట్‌ అభిమానులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే చాలా బాధలో కూరుకుపోయిన సమయంలో ఇలాంటి పోస్ట్‌ అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 


ప్రపంచకప్‌లో మహ్మద్ షమీ ప్రదర్శనపైనా ఇటీవల హసిన్ జహాన్ మరోసారి విమర్శలు చేశారు. షమీ గురించి తరచుగా స్పందిస్తున్న జహాన్, తాజాగా తీవ్ర విమర్శలు చేశారు. మహమ్మద్ షమీ మంచి వ్యక్తే అయితే.. తాము మంచి జీవితాన్ని గడిపేవాళ్లమని జహాన్ అన్నారు. అతను మంచి వ్యక్తి అయితే తన కూతురు, తన భర్త, తాను సంతోషకరమైన జీవితాన్ని గడిపేవాళ్లమని పేర్కొన్నారు. షమీ మంచి ఆటగాడు మాత్రమే కాకుండా మంచి భర్త, మంచి తండ్రిగా కూడా ఉంటే అది మరింత గౌరవంగా ఉండేదని హసిన్ జహాన్ తెలిపారు. షమీ చేసిన తప్పులు, దురాశ, వ్యక్తిత్వం కారణంగా తాము ముగ్గురం పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చిందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా.. షమీ దగ్గర చాలా డబ్బు ఉందని, దాని ద్వారా తన ప్రతికూల అంశాలను బయటకు రాకుండా దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని వ్యాఖ్యలు చేశారు.


ఫైనల్‌లోనూ భారత్‌ విజయం సాధించాలని ప్రార్థిస్తున్నట్లు హసిన్ జహాన్  అప్పుడు చెప్పారు. అలాగే ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన పాయల్ ఘోష్ విషయంపై స్పందిస్తూ.. సెలబ్రిటీల విషయంలో ఇలాంటివి తరచు జరుగుతూనే ఉంటాయని, ఇది సాధారణమైనదని, దానిపై తాను వ్యాఖ్యానించదలుచుకోలేదని తెలిపారు. 


ఇద్దరి మధ్య విభేదాలు
షమీకి వివాహేతర సంబంధం ఉందంటూ హసీన్ జహాన్ ఆరోపించారు. 2018 మార్చి 7న ఆమె విడుదల చేసిన స్క్రీన్‌షాట్లు సంచలం అయ్యాయి. హసీన్ ఆరోపణలను షమీ ఖండించారు. కెరీర్ ను నాశనం చేయటానికే తన భార్య కుట్ర పన్నిందని ఆరోపించాడు. షమీపై అతడిపై లైంగిక వేధింపులు, గృహహింస ఆరోపణలు చేసింది. షమీకి నాన్ బెయిల్‌బుల్ ఛార్జీలను విధించారు. తనను షమీతో పాటు అతడి కుటుంబ సభ్యులు తీవ్రంగా వేధించారని ఆరోపించింది. తాను ఉత్తరప్రదేశ్‌లోని పుట్టింటికి ఎప్పుడు వెళ్లినా హింసించే వారని ఫిర్యాదులో పేర్కొంది. కావాలంటే షమీ ఇరుగుపొరుగువారినైనా అడగండని తెలిపింది. అలాగే షమీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో బీసీసీఐ షమీ కాంట్రాక్ట్‌ను పెండింగ్‌ పెట్టింది. మ్యాచ్‌ఫిక్సింగ్ ఆరోపణలు అబద్ధమని తేల్చి బీసీసీఐ కాంట్రాక్ట్‌ను తిరిగి కొనసాగించింది.