ODI World Cup 2023: స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో భారత్‌ (Bharat) తుది మెట్టుపై బోల్తాపడింది. అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ల ముందు తలవంచింది. ఫైనల్లో భారత్‌పై ఆస్ట్రేలియా (Austrelia) 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలోని ఆటగాళ్లతో పాటు అభిమానులు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఈ ఓటమి మైదానంలో ఉన్న లక్ష మందికిపైగా అభిమానులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల హృదయాలను కలచివేసింది.  మ్యాచ్ ముగిశాక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. రోహిత్ శర్మ పెవిలియన్‌కు తిరిగి వస్తుండగా అతని కళ్ల నుంచి నీళ్లు కనిపించాయి. అదే సమయంలో విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ కూడా చాలా ఎమోషనల్‌ అయినట్టు కనిపించారు. ఈ ఓటమి ఆటగాళ్ల వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం చూపుతోంది. టీమిండియా రన్ మెషిన్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli) వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఓటమి తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్నాడు. విరాట్ తన మేనేజర్‌ను తొలగించినట్లు తెలుస్తోంది. ఫైనల్‌లో భారత్ ఓడిపోయిన మరుసటి రోజే కోహ్లీ తన మేనేజర్ బంటీ సజ్‌దేహ్‌(Bunty Sajdeh) ను తొలిగించినట్లు సమాచారం. దశాబ్ద కాలంగా స్నేహితుడికి కంటే ఎక్కువగా ఉన్న వీరిద్దరి మధ్య దూరం హాట్‌ టాపిక్‌గా మారింది.

రన్‌ మెషిన్‌ విరాట్ కోహ్లి వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను కార్నర్‌స్టోన్ సంస్థ నిర్వహిస్తూ వస్తోంది. పదేళ్ల నుంచి కోహ్లీ కోసం ఈ సంస్థ పనిచేస్తోంది. కార్నర్‌స్టోన్ వ్యవస్థాపకుడే బంటీ సజ్దేహ్. ఇతడు విరాట్ కోహ్లీకి స్నేహితుడి కంటే ఎక్కువని చాలామంది చెబుతుంటారు. అలాంటి అనుబంధాన్ని కోహ్లి తెంచుకున్నాడు. అయితే విడిపోవడానికి స్పష్టమైన కారణాలు తెలియడం లేదు. అయితే కోహ్లినే సొంతంగా 100 కోట్ల రూపాయలతో ఓ కంపెనీ ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించినట్లు సమాచారం.

కార్మర్ స్టోన్ వ్యవస్థాపకుడు బంటి, విరాట్ కోహ్లి స్నేహం ఈ నాటిది కాదు. గత పదేళ్లుగా కోహ్లి వ్యాపారకార్యకలాపాలను బంటినే పర్యవేక్షిస్తున్నాడు. కోహ్లి వాణిజ్య ప్రయోజనాలు, బ్రాండ్ వాల్యూ వంటి అంశాలను బంటీ పర్యవేక్షిస్తుంటారు. మ్యాచ్‌ల సమయంలో కోహ్లితో కలిసి అనేకసార్లు కనిపించాడు . పుమా సంస్థతో కోహ్లి వందకోట్ల ఒప్పందంతో పాటు అనేక ఒప్పందాలు కుదర్చడంలో బంటీదే కీలకపాత్ర. కార్నర్‌స్టోన్ సంస్థ క్రీడాకారులతో పాటుగా బాలీవుడ్ ప్రముఖుల వ్యాపార కార్యకలాపాలను కూడా నిర్వహిస్తూ ఉంటుంది. కార్నర్ స్టోన్ నుంచి రోహిత్ శర్మ, కేఎల్ రాహల్, అజింక్యా రహానే, శుభ్‌మన్ గిల్ వంటి క్రీడాకారులు ఇప్పటికే బయటికి వచ్చేశారు. పీవీ సింధు, సానియా మీర్జా, ఉమేష్ యాదవ్, కుల్దీప్ యాదవ్, యశ్ ధుల్ వంటి ప్లేయర్లు ఆ సంస్థలోనే కొనసాగుతున్నారు. వీరి వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను సైతం కార్నర్‌స్టోన్ సంస్థ పర్యవేక్షిస్తూ వస్తోంది. సోహైల్ ఖాన్ మాజీ భార్య సీమా సోదరుడే బంటీ సజ్‌దేహ్‌. అలాగే స్టార్ ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మకు బావ. అతని సోదరి కార్నర్‌స్టోన్‌లో చేరడం తోపాటు, స్పోర్ట్స్ మేనేజర్‌గా పనిచేసింది. ఇది ఇలా ఉంటే బంటీ తన పాఠశాల విద్యను ముంబైలో పూర్తి చేశాడు.