ICC ODI WC 2023: భారత్-ఆస్ట్రేలియా(, India vs Australia )మధ్య జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్(World Cup) మ్యాచ్‌ని డిస్నీ హాట్‌స్టార్( Disney +Hotstar) OTT వేదికలో రికార్డు స్థాయిలో ఏకకాలంలో 5 కోట్ల 90 లక్షల మంది వీక్షించారని ఆ సంస్థ తెలిపింది. ఇంతకంటే ముందు 5 కోట్ల 30 లక్షల వీక్షణలతో ఇండియా-న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ అత్యధిక వ్యువర్‌షిప్‌ను సొంతం చేసుకుంది. ఏకకాలంలో 5 కోట్లు 90 లక్షల మంది ఫైనల్ మ్యాచ్ వీక్షించినట్లు డిస్నీహాట్‌స్టార్ ఇంఛార్జ్ సజిత్ శివానందన్ తెలిపారు. భారత క్రికెట్ అభిమానుల తిరుగులేని మద్దతుతో అత్యున్నత శిఖరాలకు లైవ్ స్ట్రీమింగ్ చేరిందన్నారు. డిస్నీ హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారం చేసిన ఫైనల్ మ్యాచ్ గురించి పూర్తి వ్యూవర్‌షిప్ సమాచారాన్ని బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసర్చ్ కౌన్సిల్-బార్క్ మరో వారంలో వెల్లడించనున్నట్లు సజిత్ శివానందన్ తెలిపారు.
భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్... పలు రికార్డులకు వేదికగా మారింది. ఇప్పటివరకూ జరిగిన ఏ దేశంలో జరిగిన ప్రపంచకప్ టోర్నీకి దక్కని రికార్డు భారత్ వేదికగా జరిగిన ఎడిషన్‌కు దక్కింది. ఈసారి వన్డే ప్రపంచకప్‌లో స్టేడియానికి వచ్చి మ్యాచ్ చూసిన వీక్షకుల సంఖ్య 11 లక్షలు దాటింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ICC ఈవెంట్ చరిత్రలో ఇలా 11 లక్షల మంది కంటే ఎక్కువ అభిమానులు స్టేడియానికి తరలివచ్చి మ్యాచ్‌ను చూడడం ఇదే తొలిసారి. అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికా-అఫ్గానిస్థాన్ మ్యాచ్‌తో స్టేడియానికి వచ్చి మ్యాచ్ చూసే వారి సంఖ్య పది లక్షలు దాటింది. పది లక్షల మందికి పైగా అభిమానులు స్టేడియానికి వచ్చి మ్యాచ్‌లను చూడడం వన్డే ఫార్మాట్‌కు ఆదరణ తగ్గలేదని నిరూపిస్తోందని, ప్రపంచ కప్ విలువ ఏంటో తెలియజేస్తోందని ఐసీసీ ఈవెంట్స్ అధిపతి క్రిస్ టెట్లీ చెప్పాడు.
మరోవైపు క్రికెట్ ప్రేమికులు కేవలం భారత్ ఆడే మ్యాచ్‌లనే కాకుండా వేరే జట్ల మ్యాచ్‌లను కూడా టీవీలకు అతుక్కుపోయి మరీ వీక్షించారు. ప్రపంచకప్‌ను టీవీల్లో వీక్షించే వారి సంఖ్య గత ప్రపంచకప్‌తో పోలిస్తే 43 శాతం వృద్ధి చెందిందని గతంలో జై షా ట్వీట్ చేశాడు. టీవీ వీక్షకుల సంఖ్య అనూహ్యంగా భారీగా పెరిగిందని వెల్లడించారు. 2019లో ప్రపంచకప్‌తో పోలిస్తే వీక్షణ నిమిషాల్లో 43 శాతం వృద్ధి ఉందని జై షా తెలిపాడు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లను టీవీలో 36.42 కోట్ల మంది వీక్షించారని వివరించాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇదో కొత్త రికార్డు అని జైషా ట్వీట్‌లో పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ ఇండియా ఛానెల్‌ను వీక్షించే వారి సంఖ్య 43 శాతం పెరిగిందని తెలిపాడు. దీన్ని బట్టి చూస్తే.. అభిమానులు గతంలో కంటే ఈసారి టీవీకి ఎక్కువగా అతుక్కుపోయారని.. ఇది భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణకు, భారత క్రికెట్ అభిమానుల శక్తికి నిదర్శనమని జై షా ట్వీట్ చేశాడు.
ఈ ప్రపంచకప్‌లో మొదటి 18 మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని 364.2 మిలియన్ల మంది చూశారని ఐసీసీ తెలిపింది. భారత్-పాక్ మ్యాచ్‌ను టీవీల్లో 76 మిలియన్ల మంది, డిజిటల్‌లో 35 మిలియన్ల మంది వీక్షించారని వెల్లడించింది. అక్టోబరు 22న ధర్మశాలలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ప్రపంచ కప్ 21వ మ్యాచ్‌ను డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో 43 మిలియన్ల మంది చూశారు. అంటే భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌ను అత్యధికంగా 4.3 కోట్ల మంది వీక్షించారన్న మాట.