Afghanistans Mohammad Nabi Becomes No1 ODI All Rounder: వన్డేల్లో అఫ్గానిస్థాన్‌(Afghanistan)  అల్‌రౌండర్‌ మహ్మద్‌ నబీ(Mohammad Nabi) చరిత్ర సృష్టించాడు. 1739 రోజుల పాటు వన్డేల్లో నెంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌గా ఉన్న బంగ్లాదేశ్‌ స్టార్‌ క్రికెటర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌(Shakib Al Hasan)ను వెనక్కినెట్టి అతని స్థానంలో నబీ వన్డేల్లో నెంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. 2019 మే 7న రషీద్‌ ఖాన్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానం దక్కించుకున్న షకిబ్‌.. ఫిబ్రవరి 9 వరకు ఆ స్థానంలోనే కొనసాగాడు. ఐసీసీ వన్డే ఆల్‌రౌండర్ల జాబితాలో సుదీర్ఘకాలం నంబర్‌వన్‌గా ఉన్న ఆటగాడిగా కూడా హసన్ రికార్డు సృష్టించాడు. అయితే ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్న మహ్మద్‌ నబి అతడిని కిందకు దింపి నంబర్‌వన్‌ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. 39 ఏళ్ల ఒక నెల వయసులో ఈ ఘనత సాధించిన అతడు.. నంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌గా నిలిచిన పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. దిల్షాన్‌ 38 ఏళ్ల 8 నెలలు  పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. శ్రీలంకతో సిరీస్‌లో సెంచరీ సాధించిన నబి ర్యాంకింగ్స్‌లో ఎగబాకాడు. షకిబ్‌ రెండో స్థానంలో ఉన్నాడు. 


నెంబర్‌ వన్‌గా బుమ్రా
వైజాగ్‌ (Vizag) వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో తొమ్మిది వికెట్లతో సత్తా చాటిన టీమిండియా పేసు గుర్రం జస్ర్పీత్‌ బుమ్రా(Jasprit Bumrah)... ఐసీసీ ర్యాంకింగ్స్‌(ICC Rankings)లో సత్తా చాటాడు. ఐసీసీ టెస్టు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌(ICC Test  bowler Rankings) లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తొలిసారి ఈ ఘనత అందుకున్నాడు. భారత్‌ నుంచి ఓ ఫాస్ట్‌ బౌలర్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానం సాధించడం ఇదే మొదటిసారి. ఐసీసీ బౌలర్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న నాలుగో భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. బిషన్‌ సింగ్‌ బేడి, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా తర్వాత బుమ్రా ఈ ఘనత అందుకున్నాడు. బుమ్రా మినహా మిగిలిన ముగ్గురు స్పిన్నర్లే కావడం గమనార్హం. బుమ్రా.. ప్యాట్‌ కమిన్స్‌, కాగిసో రబాడ, అశ్విన్‌లను అధిగమించి బౌలర్ల జాబితాలో అగ్రస్థానానికి ఎగబాకాడు. అశ్విన్‌ 11 నెలల తర్వాత అగ్రస్థానం కోల్పోవాల్సి వచ్చింది. రెండు స్థానాలు కిందకు పడ్డ అతడు ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. రబాడ రెండో స్థానం దక్కించుకున్నాడు.


టాప్‌ టెన్‌లో విరాట్ ఒక్కడే
టెస్ట్‌ బ్యాటర్లలో దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసిన కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ నంబర్‌వన్‌ స్థానంలో ఉన్నాడు. స్టీవ్‌ స్మిత్‌ రెండో స్థానంలో నిలవగా... భారత్‌ నుంచి విరాట్‌ కోహ్లీ ఏడో స్థానంలో ఉన్నాడు. టాప్‌ టెన్‌లో విరాట్‌ ఒక్కడే ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో ద్విశతకం అందుకున్న యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ 37 స్థానాలు ఎగబాకి బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో 29వ స్థానానికి చేరాడు. 14 స్థానాలు మెరుగుపరుచుకున్న శుభ్‌మన్‌ గిల్‌ 38వ స్థానంలో నిలిచాడు.