Ravichandran Ashwin Milestone: భారత్‌(India), ఇంగ్లాండ్‌(England) మధ్య రాజ్‌కోట్‌ వేదికగా జరిగే మూడో టెస్ట్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే రాజ్‌కోట్‌ చేరుకున్న రెండు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేశాయి. భారత్‌లో మరోసారి సిరీస్‌ విజయంపై కన్నేసిన ఇంగ్లాండ్‌ తీవ్ర కసరత్తుల్లో మునిగిపోయింది. 2012లో సిరీస్‌ను త‌న్నుకుపోయిన ఇంగ్లండ్‌ను ఈసారి గ‌ట్టి దెబ్బ కొట్టాల‌ని టీమిండియా ప‌ట్టుద‌లతో ఉంది. మూడో టెస్ట్‌ మ్యాచ్‌ ఆరంభం ముందు ఇరు జట్లు పైచేయి సాధించేందుకు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran Ashwin) సిద్ధమవుతున్నాడు. ఈ సిరీస్‌లో అశ్విన్‌ను అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి.


అశ్విన్‌ ఒక్క వికెట్‌ తీస్తే... 
అశ్విన్‌ ఒక్క వికెట్‌ తీస్తే ఐదు వందల వికెట్లు తీసిన ఘనత సాధిస్తాడు. ఈ జాబితాలో భారత్‌ నుంచి అనిల్‌ కుంబ్లే (619 వికెట్లు) తర్వాతి స్థానంలో అశ్విన్‌ నిలుస్తాడు. ప్రస్తుతం అశ్విన్‌ ఖాతాలో 499 వికెట్లున్నాయి. అశ్విన్‌ ఇంకో వికెట్‌ తీస్తే ఈ మైలురాయిని చేరుకున్న తొమ్మిదో ఆట‌గాడిగా రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. ప్రస్తుతం అశ్విన్  499 వికెట్లు తీశాడు. ఇందులో 5 వికెట్లు ప్రద‌ర్శన 34 సార్లు న‌మోదు చేశాడు. ఇప్పటికే వైజాగ్‌ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌ మ్యాచులో అశ్విన్‌(Ravichandran Ashwin )రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్‌గా అశ్విన్‌ కొత్త చరిత్ర లిఖించాడు. ఇప్పటి వ‌ర‌కు ఈ ఘ‌న‌త చంద్రశేఖ‌ర్ పేరిట ఉంది. చంద్రశేఖ‌ర్ 38 ఇన్నింగ్స్‌ల్లో 95 వికెట్లు ప‌డ‌గొట్టగా ఈ రికార్డును అశ్విన్‌ బద్దలుకొట్టాడు. అశ్విన్‌ 38 ఇన్నింగ్స్‌ల్లో 96 వికెట్లతో ఆ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వీరిద్దరి త‌రువాత మూడో స్థానంలో అనిల్ కుంబ్లే 92 వికెట్లతో ఉన్నాడు. ఇంగ్లాండ్ జ‌ట్టుపై ఇప్పటి వ‌ర‌కు ఏ టీమ్ఇండియా బౌల‌ర్ కూడా వంద వికెట్లు తీయ‌లేదు. అశ్విన్ ఇప్పటి వ‌ర‌కు ఇంగ్లాండ్ పై 97 వికెట్లు తీశాడు. అత‌డు మ‌రో 3 వికెట్లు గ‌నుక తీస్తే ఇంగ్లాండ్ పై వంద వికెట్లు తీసిన‌ మొద‌టి భార‌త బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టిస్తాడు. ఇక రెండు జ‌ట్ల మ‌ధ్య అత్యధిక వికెట్లు తీసిన ఆట‌గాడిగా జేమ్స్ అండ‌ర్స్‌న్ ఉన్నాడు. 66 ఇన్నింగ్స్‌ల్లో 139 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 


మూడో టెస్ట్‌కు సర్వం సిద్ధం
రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో కీలకమైన మూడో టెస్ట్‌కు టీమిండియా  సిద్ధమైంది. అయిదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమఉజ్జీలుగా నిలిచిన వేళ ఈ మ్యాచ్‌లో గెలిచి ముందంజ వేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. యశస్వి జైస్వాల్ 321 పరుగులు జస్ప్రీత్ బుమ్రా 15 వికెట్లతో చెలరేగి మంచి ఫామ్‌లో ఉండడం టీమిండియాకు కలిసి రానుంది. అయితే మిడిల్ ఆర్డర్‌ వరుసగా విఫలమవుతుండడం భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ సహా టాపార్డర్‌ బ్యాటర్లు భారీ స్కోర్లు చేసి సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఈ మ్యాచ్‌తో సుదీర్ఘమైన ఫార్మాట్‌లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. రజత్ పాటిదార్‌ కూడా జట్టులో చోటు లభించవచ్చు. వికెట్ కీపర్ కెఎస్ భరత్ వైఫల్యంతో అతని స్థానంలో ధ్రువ్ జురెల్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. రవీంద్ర జడేజా తిరిగి బరిలోకి దిగుతాడని  తెలుస్తోంది. ఇప్పటివరకూ టెస్టుల్లో 499 వికెట్లు తీసుకున్న రవిచంద్రన్‌ అశ్విన్‌... ఈ మ్యాచ్‌లో 500 వికెట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌తో వందో టెస్ట్‌ ఆడనున్న ఇంగ్లాండ్‌ సారధి బెన్‌ స్టోక్స్‌... ఈ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకోవాలని భావిస్తున్నాడు.