Match Preview - India vs England:  రాజ్‌కోట్‌(Rajkot) వేదికగా ఇంగ్లాండ్‌(England)తో కీలకమైన మూడో టెస్ట్‌కు టీమిండియా(Team India)  సిద్ధమైంది. అయిదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమఉజ్జీలుగా నిలిచిన వేళ.. ఈ మ్యాచ్‌లో గెలిచి ముందంజ వేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్‌కు ఇంగ్లాండ్‌ షాక్‌ ఇవ్వగా,.... వైజాగ్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో అద్భుతంగా పుంజుకున్న టీమిండియా సిరీస్‌ను సమం చేసింది. యశస్వి జైస్వాల్ 321 పరుగులు... జస్ప్రీత్ బుమ్రా 15 వికెట్లతో చెలరేగి మంచి ఫామ్‌లో ఉండడం టీమిండియాకు కలిసి రానుంది. అయితే మిడిల్ ఆర్డర్‌ వరుసగా విఫలమవుతుండడం భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ సహా టాపార్డర్‌ బ్యాటర్లు భారీ స్కోర్లు చేసి సత్తా చాటాల్సిన అవసరం ఉంది. KL రాహుల్, విరాట్ కోహ్లీ సిరీస్‌ మొత్తానికి దూరం కావడంతో టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌పై భారం పడింది. సారధి రోహిత్ శర్మ... దూకుడు విధానం భారీ స్కోర్లను అందించడం లేదు. కాబట్టి ఈ మ్యాచ్‌లో హిట్‌ మ్యాన్‌ గేరు మార్చి... తన సహజ శైలికి భిన్నంగా నిదానంగా ఏమైనా ఆడతాడేమో చూడాలి.




 

సర్ఫరాజ్ ఖాన్‌ అరంగేట్రం!

ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) ఈ మ్యాచ్‌తో సుదీర్ఘమైన ఫార్మాట్‌లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. రజత్ పాటిదార్‌(Rajat Patidar) కూడా జట్టులో చోటు లభించవచ్చు. వికెట్ కీపర్ కెఎస్ భరత్(Ks Bharat) బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమవుతుండడంతో అతని స్థానంలోఉత్తరప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల ధ్రువ్ జురెల్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. జురెల్‌ 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 46.47 సగటుతో పరుగులు రాబట్టాడు. రాజ్‌కోట్‌లోని పిచ్...స్పిన్‌కు అనుకూలంగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ఎదురుదాడికి దిగే జురెల్‌కు జట్టులో చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌తో లోకల్ హీరో రవీంద్ర జడేజా తిరిగి బరిలోకి దిగుతాడని  తెలుస్తోంది. భారత్‌లో స్పిన్నర్లు రాజ్యమేలుతారని.. పాస్ట్‌ ఫాస్ట్ బౌలర్లు కేవలం అలంకార ప్రాయమేనన్న వాదనలను బుమ్రా తప్పని నిరూపించాడు. ఈ సిరీస్‌లో అత్యుత్తమంగా బౌలింగ్‌ చేస్తున్న బుమ్రా... మరోసారి భారత్‌కు కీలకమైన ఆటగాడిగా మారాడు. మొదటి రెండు టెస్టుల్లో బుమ్రా అద్భుతంగా బౌలింగ్‌ చేసి టాప్‌ వన్‌ బౌలర్‌గా కూడా నిలిచాడు. రాజ్‌కోట్‌లోని పిచ్ సాంప్రదాయకంగా బ్యాటర్‌లకు స్నేహపూర్వకంగా ఉండటంతో, చైనామాన్ కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లలో ఒకరికే జట్టులో స్ధానం దక్కనుంది. ఇప్పటివరకూ టెస్టుల్లో 499 వికెట్లు తీసుకున్న రవిచంద్రన్‌ అశ్విన్‌... ఈ మ్యాచ్‌లో 500 వికెట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. 

 

పట్టుదలగా ఇంగ్లాండ్‌

రెండో టెస్ట్‌ తర్వాత అబుదాబి వెళ్లి విశ్రాంతి తీసుకున్న ఇంగ్లాండ్‌ ఆటగాళ్ళు... మళ్లీ భారత్‌లో అడుగుపెట్టి ప్రాక్టీస్‌లో తీవ్రంగా శ్రమించారు. హార్ట్‌ లీ భీకర ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు సానుకూలంగా మారింది. జో రూట్‌ బ్యాట్‌తో పాటు బౌలర్‌ పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. 100వ టెస్టులో బెన్ స్టోక్స్ రాణించాలని పట్టుదలగా ఉన్నాడు. 

 

భారత జట్టు: రోహిత్ శర్మ (సి), జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, కెఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్, దేవదత్ పడిక్కల్.

 

ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్, రెహాన్ అహ్మద్, జేమ్స్ ఆండర్సన్, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో), షోయబ్ బషీర్, డాన్ లారెన్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, ఆలీ పోప్, ఆలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్.