Nehal Wadhera: ఐపీఎల్-16లో  ముంబై ఇండియన్స్ మిడిలార్డర్ బ్యాటర్  నెహల్ వధెరకు ఆ జట్టు మేనేజ్‌మెంట్ వెరైటీ శిక్ష వేసింది.  లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ ఆడేందుకు  గాను ముంబై నుంచి లక్నోకు వెళ్లే క్రమంలో టీమ్  హోటల్ నుంచి  ఎయిర్‌పోర్టు వరకూ  అతడు కాళ్లకు మ్యాచ్ ఆడేందుకు కట్టుకున్నట్టుగా  ప్యాడ్స్ కట్టుకుని  వచ్చాడు.  ఇదేదో ఫ్యాషన్ అనుకుంటే పొరపాటే. వధెర  ఆలస్యానికి ముంబై టీమ్ వేసిన శిక్ష.. 


ఏం  జరిగిందంటే.. 


లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ ఆడేందుకుగాను లక్నోకు పయనమయ్యేమేందు  ముంబై టీమ్ బ్యాటర్లతో ఓ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్‌కు  వధెర  ఆలస్యంగా వచ్చాడట. దీంతో  అతడు.. టీమ్ హోటల్ నుంచి  ఎయిర్‌పోర్టుకు చేరేదాకా  కాళ్లకు ప్యాడ్స్ కట్టుకోని రావాలని  శిక్ష వేసిందట. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్  తన ట్విటర్ ఖాతాలో పేర్కొంది.  ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.  


 






ఈ వీడియోపై  పలువురు ఆకతాయి నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఇదేం వెరైటీ శిక్ష బాబోయ్..! బహుశా మరోసారి కూడా వధెర  టీమ్ మీటింగ్ కు లేట్ గా వస్తే  రోహిత్ శర్మను ఎత్తుకుని ఎయిర్ పోర్టు వరకు రమ్మంటారేమో..’అని కామెంట్ చేశాడు.


Also Read: సీజన్ మొత్తం మీద 2 మ్యాచులే ఆడిన స్టోక్స్


ఈ సీజన్ లో  రూ. 20 లక్షల  బేస్ ప్రైస్ తో  వధెరను కొనుగోలు చేసిన ముంబైకి అతడు  పైసా వసూల్ పర్ఫార్మెన్స్ తో అండగా నిలుస్తున్నాడు. మిడిలార్డర్ లో సూర్యకుమార్ యాదవ్ తో పాటు ఆ జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు.   ఇప్పటివరకు ఈ సీజన్ లో 10 మ్యాచ్ లలో ఏడు ఇన్నింగ్స్ లు ఆడి 198 పరుగులు చేశాడు.   ఈ క్రమంలో అతడి సగటు  33 గా నమోదుకాగా  స్ట్రైక్ రేట్  151.55గా ఉంది.  ఈ సీజన్ లో వధెర   వంద మీటర్ల కంటే ఎక్కువ దూరం సిక్సర్ కొట్టిన తొలి ఆటగాడిగా నిలిచాడు. 


Also Read: గిల్ ఆన్ డ్యూటీ - లేనే లేదు పోటీ - ఫార్మాట్ ఏదైనా సెంచరీలు చేయడంలో మేటి


కాగా నేడు (మంగళవారం) రాత్రి 7.30 గంటలకు ముంబై ఇండియన్స్.. లక్నో సూపర్ జెయింట్స్ తో కీలక మ్యాచ్ ఆడనుంది. లక్నో వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ లో గెలిస్తేనే రోహిత్ సేన ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకునే అవకాశాలు మెరుగుపడతాయి. లేదంటే  మరో మ్యాచ్  ఫలితంతో పాటు ఇతర జట్ల ఫలితాల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఈ మ్యాచ్ లో  ముంబై గెలిస్తే అది టాప్ -2కు వెళ్లే అవకాశం ఉంది.   ప్రస్తుతం చెన్నైకి 15, ముంబైకి  14 పాయింట్లున్నాయి. ఇక లక్నో గెలిస్తే.. ముంబైని వెనక్కినెట్టి టాప్ -3కి వెళ్లడమే గాక ప్లేఆఫ్స్ బెర్త్ ను మరింత  ఖాయం చేసుకుంటుంది.  ఒకవేళ లక్నో ఓడితే మాత్రం  ఆ జట్టుకు  ఆర్సీబీ, రాజస్తాన్  తో  నాలుగో స్థానానికి పోటీ తప్పకపోవచ్చు.