MI Emirates: యూఏఈ ఇంటర్నేషనల్ లీగ్ టీ20 ప్రారంభ ఎడిషన్ కోసం ఎమ్ ఐ ఎమిరేట్స్  తన కోచింగ్ టీంను ప్రకటించింది. షేన్ బాండ్ ప్రధాన కోచ్ గా ఎంపికయ్యారు. అలాగే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ఆడిన పార్థివ్ పటేల్, వినయ్ కుమార్ లు కోచ్ లుగా అరంగేట్రం చేయనున్నారు. బ్యాటింగ్ కోచ్ గా పార్థివ్, బౌలింగ్ కోచ్ గా వినయ్ కుమార్, ఫీల్డింగ్ కోచ్ గా ఎమ్ ఐ మాజీ ఆల్ రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ నియమితులయ్యారు. జనరల్ మేనేజర్ గా రాబిన్ సింగ్ ను ఎంచుకున్నారు. 


షేన్ బాండ్ 2015లో ముంబై ఇండియన్స్‌లో చేరాడు. అతని హయాంలో ఎమ్ ఐ 4 ఐపీఎల్ టైటిళ్లు గెలిచింది.  రాబిన్ సింగ్ 2010లో ముంబై ఇండియన్స్ కోచింగ్ టీమ్‌లో చేరాడు. ఆయన 4 ఐపీఎల్, 2 ఛాంపియన్ లీగ్స్ ట్రోఫీల్లో భాగమయ్యాడు. అతను షేన్ బాండ్ తో కలిసి పనిచేశారు. అలాగే పార్థివ్ పటేల్, వినయ్ కుమార్ లు ఎమ్ ఐ జట్టులో భాగంగా ఉన్నారు. పార్థివ్ 2020లో, వినయ్ కుమార్ 2021 లో ఎమ్ ఐ శిక్షణ బృందంలో చేరారు. 


కోచింగ్ బృందానికి శుభాకాంక్షలు


రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ కోచ్ ల బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. షేన్ బాండ్, పార్థివ్ పటేల్, వినయ్ కుమార్, జేమ్స్ ఫ్రాంక్లిన్ ల బృందం ఎమ్ ఐ ఎమిరేట్స్ టీంను బాగా నిర్మిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఎమ్ ఐ విలువలు వారికి బాగా తెలుసని.. అందుకనుగుణంగా వారు నడుచుకుంటారని అన్నారు.  అభిమానుల ప్రేమను పొందే విధంగా ఎమ్ ఐ ఎమిరేట్స్ జట్టు తయారవుతుందని తెలిపారు. 



ముంబై ఇండియన్స్ గురించి


రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాజమాన్యంలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీ నడుస్తోంది. ఎమ్ ఐ త్వరలో మూడు దేశాలలో 3 టీ20 జట్లను తయారు చేస్తోంది. యూఏఈ ఇంటర్నేషనల్ లీగ్ టీ20 లీగ్ కోసం ఎమ్ ఐ ఎమిరేట్స్, దక్షిణాఫ్రికా లీగ్ కోసం ఎమ్ ఐ కేప్ టౌన్ ఈ ఫ్రాంచైజీలో చేరనున్నాయి. ఇప్పటికే బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ విజయవంతమైన జట్టుగా ఉంది. ఐపీఎల్ లో 5 ట్రోఫీలు గెలుచుకుంది. రెండు ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లు గెలుచుకుంది. 


ఎమ్ ఐ 31 మిలియన్లకు పైగా అభిమానులతో బలమైన డిజిటల్ ఉనికి కలిగిఉంది. బ్రాండ్ వాల్యుయేషన్ ఏజెన్సీ ఇటీవల ముంబైకి ఏఏ ప్లస్ రేటింగ్ ఇచ్చింది.