T20 World Cup:


నెలరోజుల విరామం తర్వాత బ్యాట్ పట్టిన భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఆసియా కప్ లో అదరగొట్టాడు. ఆ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 5 ఇన్నింగ్స్ ల్లో 92 సగటుతో 276 పరుగులు చేశాడు. అంతేకాక అఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ లో 61 బంతుల్లోనే 122 పరుగులు చేసి దాదాపు 3 సంవత్సరాల తర్వాత సెంచరీని అందుకున్నాడు. టీ20ల్లో భారత బ్యాట్స్ మెన్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా అదే. 


టీ20 ప్రపంచకప్ కు ముందు సూపర్ ఫాం


విరాట్ ఫాంలోకి రావటంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. అదీ టీ20 ప్రపంచకప్ అతి సమీపంలో ఉన్న సమయంలో కోహ్లీ సూపర్ ఫాం టీమిండియాకు కలిసొచ్చేదే. అయితే అఫ్ఘాన్ తో మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చిన కోహ్లీ శతకంతో రాణించటంతో కొత్త చర్చ ప్రారంభమైంది. చాలామంది మాజీ ఆటగాళ్లు, అభిమానులు వచ్చే టీ20 ప్రపంచకప్ లో విరాట్ ఓపెనింగ్ చేయాలని అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అందులో భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కూడా ఉన్నాడు. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన గేమ్ ప్లాన్ షోలో గంభీర్ దీనిపై మాట్లాడాడు. 


కోహ్లీకి ఆ స్థానమే కరెక్ట్


విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ను ప్రారంభించడాన్ని తాను సమర్థించనని గౌతం గంభీర్ అన్నాడు. రోహిత్, రాహుల్ లు జట్టులో ఉంటే వారే ఓపెనింగ్ చేయాలని అభిప్రాయపడ్డాడు. ఓపెనింగ్ జంట 10 ఓవర్ల వరకు క్రీజులో ఉంటే నెం. 3 లో సూర్యకుమార్ యాదవ్ ను ఆడించాలని గంభీర్ అన్నాడు. అలా కాక ఓపెనర్లు త్వరగా ఔట్ అయితే మూడో స్థానంలో కోహ్లీ సరిపోతాడని అన్నాడు. అసలు దీనిపై చర్చ అనవసరమని వ్యాఖ్యానించాడు. 


విరాట్ నెం.3 లో ఆడడమే మంచిది


గంభీర్ అభిప్రాయాన్ని ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ సమర్థించాడు. కోహ్లీకి నెం. 3 స్థానమే సరిపోతుందని అన్నాడు. విరాట్ స్ట్రైక్ ను మెయిన్ టెయిన్ చేస్తాడని.. ఇన్నింగ్స్ ను నియంత్రించగలడని హేడెన్ వివరించాడు. స్పిన్ తో అప్పుడప్పుడు ఇబ్బంది పడినప్పటికీ.. ఫాస్ట్ బౌలింగ్ లో కోహ్లీ బాగా ఆడగలడని పేర్కొన్నాడు. అతను టాప్ 4 లో బ్యాటింగ్ చేయడమే ఉత్తమమని అభిప్రాయపడ్డాడు. 


గతంలో తాను కెప్టెన్ గా ఉన్నప్పుడు కోహ్లీ కొన్నిసార్లు ఓపెనింగ్ చేశాడు. గతేడాది స్వదేశంలో ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ లో, ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ తరఫున కొన్ని సందర్భాల్లో ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. అయితే రోహిత్, రాహుల్ అందుబాటులో ఉన్నప్పుడు కోహ్లీ ఓపెనింగ్ చేయడం అరుదే. మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేసినప్పుడే కోహ్లీ అత్యంత విజయవంతమయ్యాడు.