PM Mementos :   ప్రధానమంత్రి ఎక్కడికి వెళ్లినా... లేదా ఆయనను ఎవరు కలవడానికి వచ్చినా మర్యాద పూర్వకంగా ఓ జ్ఞాపికను తీసుకు వస్తూ ఉంటారు. అలా జ్ఞాపికలు ఇస్తున్న... మోదీ తీసుకుంటున్న ఫోటోలు దాదాపుగా ప్రతీ రోజూ ట్విట్టర్‌లో కనిపిస్తూనే ఉంటాయి. ఇలాంటి వాటిని ఏం చేస్తారనే డౌట్ చాలా కాలంగా ఉంది. గతంలో అలా అట్టి పెట్టేవారేమో కానీ ఇప్పుడు మాత్రం ప్రజలకు అమ్మేస్తున్నారు. ఆసక్తి ఉన్న వాళ్లు వేలంలో పాడుకునే ఏర్పాట్లను కేంద్రం చేస్తోంది. 


సెప్టెంబర్ 17 నుంచే వేలం ప్రారంభం


ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివిధ సందర్భాల్లో కానుకలుగా వచ్చిన జ్ఞాపికలను కేంద్ర ప్రభుత్వం వేలానికి సిద్ధం చేసింది. న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ మోడ్రన్ ఆర్ట్ ( ఎన్జీఎంఏ)లో  ఉంచిన నరేంద్ర మోదీకి విదేశీ, రాష్ట్ర, ప్రాంత పర్యటనల్లో ప్రముఖులు అందజేసిన జ్ఞాపికలు, క్రీడాకారులు ఇచ్చిన వస్తువులను వేలం వేస్తున్నారు. https://pmmementos.gov.in/ ఈ వెబ్‌సైట్‌లో వేలం ప్రక్రియం శనివారం నుంచే అంటే సెప్టెంబర్ 17వ తేదీ నుంచే ప్రారంభమయింది.  అక్టోబర్ 2వ తేదీ వరకు ఈా వేలం నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఓపెన్ బిడ్డింగ్ ద్వారా ఎవరైనా కానుకలను వేలంలో దక్కించుకోవచ్చు . 2019 నుంచి మూడేళ్లుగా కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రధానమంత్రికి వచ్చిన జ్ఞాపికలను వేలం వేస్తోంది.  అత్యధికంగా గతేడాది 15 కోట్ల రూపాయలు వేలం ద్వారా వచ్చాయి. ఈ జ్ఞాపికలను వేలం వేయగా  వచ్చిన నిధులను స్వచ్ఛ భారత్, నమామి గంగే వంటి కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లుగా కేంద్రం చెబుతోంది. 


ఈ ఏడాది 1,222 జ్ఞాపికల వేలం


ఈ ఏడాది 1,222 జ్ఞాపికలను వేలానికి సిద్ధంగా ఉంచారు.  ప్రతి వస్తువుకు దాని మార్కెట్ రేటును బట్టి వంద రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు కనీస ధరగా నిర్ణయించారు.  ఈ బిడ్డింగ్ ద్వారా  గత ఏడాది కన్నా ఎక్కువ వస్తాయని అంచనా వేస్తున్నట్లుగా చెబుతున్నారు.  ఈ సారి అయోధ్య రామ మందిరం, కాశీ విశ్వనాథ ఆలయం, కామన్వెల్త్, పారా ఒలంపిక్ గేమ్స్‌కు సంబంధించిన క్రీడాకారుల వస్తువులు ప్రత్యేక ఆకర్షణగా వేలంలో ఉన్నాయి.  క్రీడాకారుల టీ షర్టులు, బ్యాడ్మింటన్ బ్యాట్, నేతాజీ ప్రతిమకు అత్యధికంగా రూ. 5 లక్షల కనీస ధర నిర్ణయించారు. 


ఏపీ సీఎం ఇచ్చిన వెంకేటేశ్వర స్వామి జ్ఞాపికలు కూడా కొనుక్కోవచ్చు.!. 


మహిళ, పురుష హాకీ టీంలు సంతకాలు పెట్టిన టీషర్ట్‌లు, బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ సంతకం చేసిన బ్యాట్, ఇటీవల బాక్సింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించిన  నిక్కత్ జరీన్ గ్లౌజ్‌లతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ ప్రధానికి అందజేసిన శ్రీవేంకటేశ్వర స్వామి ప్రతిమలూ వేలంలో ఉన్నాయి. పెద్దసంఖ్యలో ఔత్సాహికులు ఈ వేలంలో పాల్గొనాలని జ్ఞాపికలను కొనుగోలు చేసి జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని  కేంద్రం ప్రజలకు పిలుపునిస్తోంది.