Gujarat Former CM: వర్తమాన జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరం అని గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ జాతీయ నాయకుడు శంకర్ సింగ్ వాఘేలా తెలిపారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడం ద్వారా ప్రస్తుతం కొనసాగుతున్న బీజేపీ దుర్మార్గ రాజకీయాలను తిప్పికొట్టగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందు కోసం దేశంలోని తమలాంటి అనేక మంది సీనియర్ రాజకీయ నాయకుల సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నట్లు శంకర్ సింఘ్ వాఘలా తెలిపారు. శుక్రవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో సుమారు ఐదు గంటల పాటు ఈయన చర్చించారు. ఈ సమావేశంలో పలు జాతీయ స్థాయి కీలక అంశాలపై ఇరువురు నేతలు సుధీర్ఘంగా చర్చించారు. దేశానికి ఆదర్శంగా అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతితోపాటు దేశంలో నెలకొన్న వర్తమాన రాజకీయ పరిస్థితులు జాతీయ అంశాలపై చర్చసాగింది.
దాదాపు ఐదు గంటల పాటు చర్చ..
చర్చలో ముఖ్యంగా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపరీత పోకడలతో అనుసరిస్తున్న విధానాలు, స్వార్థ రాజకీయాల పర్యవసానాలపై ఇరువురు నేతలు దృష్టి సారించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, జాతి అభివృద్ధే ధ్యేయంగా రాజకీయాల్లో కొనసాగుతున్న తమ లాంటి సీనియర్ నేతలంతా.. బీజేపీ రాజకీయాల పట్ల ఆందోళనతో ఉన్నారని వాఘేలా తెలిపారు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న విచ్ఛిన్నకర పాలనా, రాజకీయ విధానాలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం అవుతుందని.. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ నేతలు మౌనం వహించడం ప్రజాస్వామిక వాదులకు, దేశ ప్రగతి కాములకు తగదన్నారు.
"రావు సాబ్.. దేశంలోని ప్రజాస్వామిక ఫెడరల్ స్పూర్తిని మంటగలుపుతూ ప్రస్తుతం కేంద్రంలో ఒక నియంతృత్వ ధోరణి ప్రబలుతుంది. దీన్ని ఇలాగే చూస్తూ ఊరుకోలేక, నిలువరించే దిశగా సరైన వేదిక దొరక్క, మాలాంటి సీనయర్లను ముందుండి నడిపించే నాయకత్వం లేక కొంత ఆందోళనతో ఉన్నాం. ఈ సందర్భంలో చీకట్లో చిరు దీపమై, మీరు కేంద్ర విధానాలను ప్రతిఘటిస్తున్న తీరు మావంటి సీనియర్ నాయకులను ప్రభావితం చేసింది. అనుకున్నదాన్ని సాధించేదాక పట్టిన పట్టు విడవని నాయకుడుగా, మిమ్మల్ని ఇప్పటికే దేశం గుర్తించింది. అసాధ్యమనుకున్న తెలంగాణను ఎన్నో కష్టాలకు నష్టాలకోర్చి శాంతియుత పంథాలో పార్లమెంటరీ రాజకీయ పంథా ద్వారా సాధించడం దేశ చరిత్రలో గొప్ప విషయం. సాధించిన రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తూ అనతి కాలంలోనే అప్రతిహతంగా ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్ర దేశంలో ఇంతటి ఘన చరిత్ర మీది మాత్రమే". - శంకర్ సింగ్ వాఘలే
విపక్ష రాష్ట్రాలన్నింటిని భయపెడ్తోంది..!
విభజనానంతరం తెలంగాణకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ.. తెలంగాణను అడుగడుగునా ఇబ్బందులకు గురిచేస్తున్నా మొక్కవోని ధైర్యంతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని శంకర్ సింగ్ వాఘలే తెలిపారు. ఈ తెగువ నిజంగా మహోన్నతమైనదంటూ కామెంట్లు చేశారు. ఒక్క తెలంగాణనే కాకుండా దేశంలోని ప్రతీ విపక్ష రాష్ట్రాన్ని.. కేంద్ర ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. కుల, మతాల చిచ్చుపెడుతూ విధ్వంసాలు సృష్టించే బీజేపీకి చరమగీతం పాడాలన్నారు. మీ పాలనను ఒక్క తెలంగాణకే పరిమితం చేయకుండా భారత దేశానికి విస్తవరించాల్సిన అవసరం ఉందని, అందుకు సమయం కూడా ఆసన్నమైందని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రత్యామ్నాంగా ఉందనుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతోందని చెప్పారు. అలాగే బీజేపీ దుర్మార్గాలను ఎదుర్కునేందుకు కావాల్సిన రాజకీయ వ్యూహాన్ని ఎత్తుగడలను అమలు చేస్తూ అందరినీ కలుపుకుపోవడంలో ఆ పార్టీ విఫలం అవుతుందని శంకర్ సింగ్ వాఘలే చెప్పుకొచ్చారు.
నా వంతు కృషి చేస్తాను - సీఎం కేసీఆర్
ఈ క్రమంలోనే దేశంలోని భావసారూప్య విపక్షాలను కలుపుకుపోయేందుకు సీఎం కేసీఆర్ వంటి నాయకత్వ అవసరం ఎంతో ఉందని వివరించారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి తామంతా సంసిద్ధంగా ఉన్నామన్నారు. తామంతా కలిసి నిర్ణయించుకున్న తర్వాతే.. సీఎం కేసీఆర్‌తో సమావేశం కావడానికి హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు శంకర్ సింగ్ వాఘలే. ఈ సందర్భంగా వాఘేలా ఆహ్వానానికి ధన్యవాదాలు తెలిపిన సీఎం కేసీఆర్, తెలంగాణను ముఖ్యమంత్రిగా ముందుకు నడిపిస్తూనే, దేశ రాజకీయాల్లో, పాలనలో గుణాత్మక మార్పును తేవడానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వాఘేలా వంటి సీనియర్ జాతీయ నాయకులు తనకు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తన నాయకత్వాన్ని సమర్థించడం పట్ల వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నానని సీఎం అన్నారు. దాదాపు ఐదు గంటల పాటు సాగిన చర్చలు సుహృద్భావ వాతావరణంలో విజయవంతం అయ్యాయి.