Hardik Pandya Replacement Raj Angad Bawa: న్యూజిలాండ్‌-ఏ వన్డే సిరీసుకు భారత్‌-ఏ జట్టును ప్రకటించాక రెండు విషయాలు ఆశ్చర్యంగా అనిపించాయి. మొదటిది సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా ప్రకటించడం. రెండోది రాజ్‌ అంగద్‌ బవాను ఎంపిక చేయడం. సంజూ గురించి తెలిసిందే. మరి రెండో ఆటగాడి ప్రత్యేకత ఏంటి? అతడిని తీసుకోవడం వెనక వ్యూహం ఏంటి?


రాజ్‌ అంగద్‌ బవా! పేరు ఎక్కడో విన్నట్టు అనిపిస్తోందా! అవునండీ.. ఇంతకు ముందు విన్నదే. అండర్‌-19 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్‌గా టీమ్‌ఇండియాకు తిరుగులేని విజయాలు అందించిన ఆటగాడు. అటు బంతి ఇటు బ్యాటుతో చెలరేగాడు. వెంటనే ఐపీఎల్‌ మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్నాడు. పంజాబ్‌ కింగ్స్‌ తరఫున రెండు మ్యాచులూ ఆడేశాడు.


టీమ్‌ఇండియా భవిష్యత్తుకు రాజ్‌ అంగద్‌ బవాను ఆశాకిరణంగా భావిస్తున్నారు. ఎందుకంటే అతడు పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కావడమే ఇందుకు కారణం. కుడిచేత్తో మీడియా పేస్‌ బౌలింగ్‌ చేస్తున్నాడు. ఎడమ చేత్తో బ్యాటింగ్‌ చేస్తాడు. ఈ వైవిధ్యమే అతడిని మిగతా వారితో పోలిస్తే ప్రత్యేకంగా నిలిపింది. చురకత్తుల్లాంటి బంతులు సంధించడంలో అతడు మేటి! అతడు విసిరే బౌన్సర్లకు ఒక్కోసారి ప్రత్యర్థి దగ్గర సమాధానం ఉండదు. అంత పక్కాగా సరైన ప్రాంతాల్లో బంతి వేస్తాడు. ఇక నాలుగో స్థానం నుంచి డౌన్ ఆర్డర్‌ వరకు ఆడతాడు. మెరుపు సిక్సర్లు బాదేస్తాడు. ప్రస్తుతం టీమ్‌ఇండియా సెటప్‌లో ఇలాంటి ఆటగాడి అవసరం ఉంది. అందుకే అతడిని సెలక్టర్లు పరీక్షిస్తున్నారు.


భారత్‌కు ఎంతో మంది స్పిన్ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు ఉన్నారు. రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా సేవలు అందిస్తున్నారు. వీరే కాకుండా దేశవాళీ, ఐపీఎల్‌ వ్యవస్థల్లో మరికొందరు ఉన్నారు. అయితే పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ జట్టుకు అత్యంత ముఖ్యం. తక్కువ మంది పేసర్లు ఉన్నప్పుడు అతడి అవసరం ఎంతగానో ఉంటుంది. ప్రస్తుతం హార్దిక్‌ పాండ్య ఈ బాధ్యతలు తీసుకున్నాడు. అయితే వరుసగా మ్యాచులు ఆడితే అతడిపై పనిభారం పెరుగుతుంది.


దేహంపై ఒత్తిడి ఎక్కువైతే గాయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే పాండ్యకు బ్యాకప్‌గా విజయ్ శంకర్‌, శివమ్‌ దూబెను సెలక్టర్లు ప్రయత్నించారు. కానీ అంతర్జాతీయ స్థాయిలో వారు ఆకట్టుకోలేకపోయారు. దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ అడపా దడపా బ్యాటింగ్‌ చేస్తున్నా నిలకడగా వారికి చోటు దక్కడం లేదు. దాంతో రాజ్‌ అంగద్‌ బవాను ఇప్పుడు తీసుకున్నారు. అత్యున్నత స్థాయి ఒత్తిడిని తట్టుకొని అతడు నిలబడితే పాండ్యకు బ్యాకప్‌గా మారతాడు. అవసరమైతే రెండో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడు.


మరికొన్ని రోజుల్లో న్యూజిలాండ్‌-ఏ భారత్‌లో పర్యటిస్తోంది. టీమ్‌ఇండియాతో మూడు వన్డేలు ఆడనుంది. సెప్టెంబర్‌ 22 నుంచి ఈ సిరీస్‌ మొదలవుతుంది. 22, 25, 27న మ్యాచులు జరుగుతాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం ఇందుకు వేదిక.


భారత్‌ ఏ జట్టు: పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, రాహుల్‌ త్రిపాఠి, రజత్‌ పాటిదార్‌, సంజు శాంసన్ (కెప్టెన్‌), కేఎస్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌), కుల్‌దీప్ యాదవ్‌, షాబాజ్‌ అహ్మద్‌, రాహుల్‌ చాహర్‌, తిలక్‌ వర్మ, కుల్దీప్‌ సేన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, నవదీప్‌ సైని, రాజ్‌ అంగద్‌ బవా