Melbourne Test Updates: భారత్, ఆసీస్ జట్ల మధ్య జరుగుతున్న మెల్ బోర్న్ స్టేడియంలో గురువారం ఎమోషనల్ వాతావరణం కొంతసేపటివరకు నెలకొంది. దివంగత లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ కు నివాళీ అర్పించడంతో కాసేపు అక్కడ వెదర్ అంతా ఎమోషనల్ అయింది. ఈ సంఘటన మూడో సెషన్లో చోటు చేసుకుంది. ఆసీస్ కాలామానం ప్రకారం సాయంత్రం 3 గంటల 50 నిమిషాలకు అతని పిల్లలు జాక్సన్, బ్రూక్ వార్న్ తమ హ్యాట్లను తలపై నుంచి కిందికి తీసి, హ్యాట్సాఫ్ ప్రదర్శన చేశారు. దీంతో ఆటగాళ్లు, స్టేడియంలోని 83 వేల మంది పులకించి పోయారు. మార్చి 2022లో చనిపోయిన వార్న్ కు నివాళిగా ప్రతి ఏడాది బాక్సింగ్ డే టెస్టు సందర్భంగా తొలి రోజు ఇలా చేయడం ఆనవాయితీగా వస్తోంది. తొలిసారి 2022లో సౌతాఫ్రికా-ఆసీస్ జట్ల మధ్య జరిగినప్పుడు ప్లేయర్లు ఇలా ప్రవర్తించారు.
350 వార్న్ క్యాప్ నెంబర్..
ఆస్ట్రేలియా తరపు బరిలోకి దిగిన 350వ ఆటగాడు వార్న్ కావడం విశేషం. మరోవైపు ఎంసీజీ ఉన్న విక్టోరియా రాష్ట్రానికి చెందిన వాడే వార్న్ కావడం గమనార్హం. ఇదే మైదానంలో వార్న్ ఎన్నో ఘనతలను సాధించాడు. 56 వికెట్లు తీయడంతోపాటు 1994 యాషెస్ సందర్భంగా అతను హ్యాట్రిక్ కూడా నమోదు చేశాడు. సంబరాల్లో భాగంగా టోపీని తలపై నుంచి కిందికి దించే ఐకానిక్ హ్యాట్సాఫ్ ప్రదర్శనను వార్న్ చేశాడు. మరోవైపు అంతర్జాతీయంగా 700వ వికెట్ ను వార్న్ ఇదే మైదానంలో సాధించాడు. యాషెస్ సిరీస్ లో భాగంగా మాజీ క్రికెటర్ ఆండ్రూ స్ట్రాస్ ను ఔట్ చేశాడు. ఈ మైదానంలో ఒక స్టాండుకు వార్న్ పేరు కూడా పెట్టారు. అలాగే మైదానంలో వెలుపల అతని విగ్రహాన్ని కూడా నెలకొల్పారు. దీంతో గురువారం నాడు మరోసారి లెజెండరీ క్రికెటర్ ను క్రికెట్ ఆస్ట్రేలియా గుర్తు చేసుకుంది.
ఒక మార్పుతో బరిలోకి దిగిన భారత్..
ఇక బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న శుబ్మాన్ గిల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ని జట్టులోకి తీసుకుని కఠిన నిర్ణయం తీసుకుంది. దీంతో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు, ఒక పేస్ ఆల్ రౌండర్ ఈ బౌలింగ్ కాంబినేషన్ తో భారత్ బరిలోకి దిగింది. గిల్ ను పక్కన పెట్టడంతో భారత బ్యాటింగ్ లైనప్ ఆసక్తికరంగా మారింది. ఓపెనర్ గా ఎవరు బరిలోకి దిగుతారో ఇంటరెస్టింగ్ గా ఉంది. ఓపెనర్ గా రాణిస్తున్న కేఎల్ రాహుల్ అదే స్థానంలో బరిలోకి దిగినట్లయితే భారత కెప్టెన్ రోహిత్ శర్మ వన్ డౌన్ లో దిగుతాడని తెలుస్తోంది. లేకపోతే రాహుల్ తోపాటు తను ఓపెనర్ గా బరిలోకి దిగి, యశస్వి జైస్వాల్ ను వన్ డౌన్ లో పంపే అవకాశాలను కొట్టి పారేయడానికి లేదని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ఆసీస్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. యువ ఓపెనర్ శామ్ కొన్ స్టాస్, స్కాట్ బోలాండ్ లను జట్టులోకి తీసుకుంది. తొలి రోజు ఆటముగిసేసరికి ఆసీస్ 311/6 చేసింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు మూడు వికెట్లు దక్కాయి.