Melbourne Test: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ ఫర్వాలేదనిపించింది. బౌలర్లు రాణించడంతో గురువారం తొలిరోజు ఆటముగిసేసరికి ఆసీస్ 6 వికెట్లకు 311 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (111 బంతుల్లో 68 బ్యాటింగ్, 5 ఫోర్లు, 1 సిక్సర్) అజేయ అర్థ సెంచరీతో రాణించాడు. అతనితోపాటు, కెప్టెన్ పాట్ కమిన్స్ (17 బంతుల్లో 8 బ్యాటింగ్, 1 ఫోర్) ఆటముగిసేసరికి క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా (3/75) మూడు వికెట్లతో సత్తా చాటాడు. అతనికి ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తో సహకారం అందించారు. 


దుమ్మురేపిన కొన్ స్టాస్..
ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన ఆసీస్ ఓపెనర్ శామ్ కొనస్టాస్ సూపర్ అర్థసెంచరీ (65 బంతుల్లో 60, 6 ఫోర్లు, 2 సిక్సర్లు)తో సత్తా చాటాడు. ఆడుతున్నది తొలి టెస్టే అయినప్పటికీ, ఏమాత్రం భయం లేకుండా, వన్డే తరహాలో బంతికొక పరుగు చేసి ఆకట్టుకున్నాడు. బౌండరీలు, సిక్సర్లతో ఆదిలోనే భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి సత్ఫలితాన్ని అందించాడు. ముఖ్యంగా ఈ సిరీస్ లో సత్తా చాటుతున్న బుమ్రాను కూడా అలవోకగా ఎదుర్కొన్నాడు. అతని బౌలింగ్ రెండు సిక్సర్లు బాదడం విశేషం. 2021 తర్వాత టెస్టుల్లో బుమ్రా సిక్సర్ సమర్పించుకోవడం ఇదే ప్రథమం. కోన్ స్టాస్ జోరుతో తొలి వికెట్ మంచి పునాది ఏర్పాడింది. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (121 బంతుల్లో 57, 6 ఫోర్లు)తో కలిసి తొలి వికెట్ కు 89 పరుగులు జోడించారు. అయితే ప్రమాదకరంగా సాగుతున్న ఈ జోడీని రవీంద్ర జడేజా విడదీశాడు. కొన్ స్టాస్ ను ఎల్బీగా పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత కాసేపటికే ఖవాజాను బుమ్రా బోల్తా కొట్టించాడు. ఈ దశలో మార్నస్ లబుషేన్ (145 బంతుల్లో 72, 7 ఫోర్లు) తో కలసి స్మిత్ జట్టును ఆదుకున్నాడు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న వీరిద్దరూ.. మూడో వికెట్ కు 83 పరుగులు జోడించారు. అయితే డ్రింక్స్ విరామం తర్వాత లబుషేన్ ను వాషింగ్టన్ ఔట్ చేయడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది.


హెడ్ ను బోల్తా కొట్టించిన బుమ్రా..
సిరీస్ లో భారత్ కు కొరకరాని కొయ్యలాగా మారిన ట్రావిస్ హెడ్ ను బుమ్రా డకౌట్ చేశాడు. పథకం ప్రకారం ఫిల్డింగ్ సెట్ చేసి కుదురుకోకుండానే హెడ్ ను పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత కాసేపటికే మిషెల్ మార్ష్ (4), అలెక్స్ క్యారీ (31) వెనుదిరగడంతో ఆసీస్ ఒక దశలో 299/6తో నిలిచింది. ఈ దశలో స్మిత్-కమిన్స్ జంట మరో వికెట్ పడకుండా రోజును ముగించింది. నిజానికి తొలి రెండు సెషన్లలో ఆసీస్ ఆధిపత్యం ప్రదర్శించగా, మూడో సెషన్ నుంచి భారత్ డామినేషన్ మొదలైంది. ఈ సెషన్లో ఏకంగా నాలుగు వికెట్లు సాధించడం విశేషం. ఓ దశలో 237/2తో భారీ స్కోరుపై కన్నేసిన ఆసీస్ ను భారత బౌలర్లు సమర్థవంతంగా నియంత్రించారు. ఇక ఐదు టెస్టుల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. తొలి టెస్టును భారత్ గెలుచుకోగా, రెండో టెస్టును ఆసీస్ కైవసం చేసుకుంది. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో మూడో టెస్టు డ్రాగా ముగిసింది.


Also Read: Lookback 2024: ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు