LSG Head Coach: రెండేండ్ల క్రితం ఐపీఎల్‌కు ఎంట్రీ ఇచ్చి వరుసగా రెండు సీజన్ల పాటు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన జట్టు లక్నో సూపర్ జెయింట్స్. కెఎల్ రాహుల్ సారథ్యంలో నిలకడగా రాణిస్తున్న లక్నోకు హెడ్ కోచ్ మారాడు. రెండేండ్ల పాటు ఆ టీమ్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన జింబాబ్వే మాజీ వికెట్ కీపర్ ఆండీ ఫ్లవర్ కాంట్రాక్టు ముగియడంతో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్, అదే జట్టుకు కోచ్‌గా పనిచేసిన జస్టిన్ లాంగర్‌ను హెడ్ కోచ్‌గా నియమించుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
‘ఆస్ట్రేలియా లెజెండరీ ఆటగాడు, మాజీ కోచ్ జస్టిన్ లాంగర్.. లక్నో సూపర్ జెయింట్స్‌గా నియమితుడయ్యాడు. ఆండీ ఫ్లవర్ రెండేండ్ల కాంట్రాక్టు ముగిసింది. లక్నో జట్టుకు ఆయన సేవలకు ధన్యవాదాలు..’అని ప్రకటనలో పేర్కొంది.
52 ఏండ్ల లాంగర్.. 1993 నుంచి 2007 వరకూ ఆసీస్ తరఫున 105 టెస్టులు, 8 వన్డేలు ఆడాడు. టెస్టులలో 7,696 పరుగులు చేసిన అతడు.. రిటైర్మెంట్ తర్వాత పదేండ్లకు ఆస్ట్రేలియా జట్టుకు హెడ్‌కోచ్‌గా పనిచేశాడు. సుమారు నాలుగేండ్ల పాటు ఆసీస్ టీమ్‌ను విజయవంతంగా నడిపించాడు. లాంగర్ హయాంలోనే ఆస్ట్రేలియా.. 2021లో టీ20 వరల్డ్ కప్ గెలిచింది. అదే ఏడాది ఆసీస్‌లో జరిగిన యాషెస్ సిరీస్‌లో 4-0 తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్ లో లాంగర్.. పెర్త్ స్కాచర్స్‌కు హెడ్ కోచ్‌గా ఉండి ఆ జట్టుకు మూడు టైటిల్స్ అందజేశాడు.
నాలుగేండ్ల పాటు ఆసీస్ జట్టుకు హెడ్‌కోచ్‌గా ఉన్న లాంగర్.. విధుల నుంచి తప్పుకునేప్పుడు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తనకు క్రికెట్ ఆస్ట్రేలియా, ఆటగాళ్లు సహకరించలేదని, తన ఒప్పందాన్ని బోర్డు పొడిగించలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
ఇక లాంగర్ హెడ్‌కోచ్ గా రావడంతో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ కోచింగ్ స్టాఫ్‌లో ఏదైనా మార్పులు జరుగుతాయా..? లేక పాత టీమే కొనసాగుతుందా..? అన్నది ఆసక్తికరంగా మారింది. లక్నో టీమ్‌కు రెండేండ్ల పాటు మెంటార్‌గా పనిచేసిన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్.. వచ్చే సీజన్ నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున కోచింగ్ లేదా మెంటార్ బాధ్యతలు స్వీకరించనున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. లాంగర్ నియామకం పట్ల గంభీర్ ఎటువంటి కామెంట్ చేయలేదు. లాంగర్‌తో గంభీర్ కలిసి పనిచేస్తాడా..? లేదా..? అన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై త్వరలోనే స్పష్టత రానున్నది.
లక్నో సూపర్ జెయింట్స్ కోచింగ్ స్టాఫ్ :
- హెడ్ కోచ్ : జస్టిన్ లాంగర్
- టీమ్ మెంటార్ : గౌతం గంభీర్
- అసిస్టెంట్ కోచ్ : విజయ్ దహియా
- స్పిన్ బౌలింగ్ కోచ్ : ప్రవీణ్ తాంబె
- ఫాస్ట్ బౌలింగ్ కోచ్ : మోర్నీ మొర్కెల్
- ఫీల్డింగ్ కోచ్ : జాంటీ రోడ్స్