IND vs WI: నెల రోజుల క్రితం ఇంగ్లాండ్ లోని ‘ది ఓవల్’ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో స్థానం కోల్పోయిన అశ్విన్.. ఆ టెస్టులో భారత్ తనను పక్కనబెట్టి ఎంత పెద్ద తప్పు చేసిందో మరోసారి ఘనంగా చెప్పాడు. డొమినికా వేదికగా వెస్టిండీస్ వేదికగా నిన్న జరిగిన తొలి టెస్టులో అశ్విన్.. ఏకంగా 12 వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన ‘ఆష్ అన్న’.. రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లతో చెలరేగాడు. దీంతో విండీస్‌పై భారత్.. ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో అశ్విన్ పలు రికార్డులను బ్రేక్ చేశాడు.
హర్భజన్ రికార్డు ఖతం..
డొమినికా టెస్టులో 12 వికెట్లు తీయడం ద్వారా అశ్విన్ మొత్తం వికెట్ల సంఖ్య 709కు చేరింది. ఈ క్రమంలో అతడు భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో హర్భజన్ సింగ్‌ను అధిగమించాడు. భజ్జీ.. టెస్టులు, వన్డేలు, టీ20లలో కలిపి 707 వికెట్లు పడగొట్టాడు. తాజాగా అశ్విన్ ఈ రికార్డును బ్రేక్ చేసి రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో దిగ్గజ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే.. అందరికంటే మందున్నాడు. కుంబ్లే ఖాతాలో టెస్టులు, వన్డేలలో కలిపి 953 వికెట్లున్నాయి.
షేన్ వార్న్ రికార్డు కూడా..
వెస్టిండీస్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీయడం ద్వారా అశ్విన్.. ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసి జట్టును గెలిపించిన సందర్భాలలో ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్‌ను దాటాడు. వార్న్.. ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసినప్పుడు ఆసీస్‌ను 27 సార్లు గెలిపించాడు. అశ్విన్‌కు ఇలా గెలిపించడం 28వ సారి. ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్ (41 విజయాలలో) అగ్రస్థానంలో నిలిచాడు. టెస్టులలో ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం అశ్విన్‌కు ఇది 34వ సారి కావడం గమనార్హం.
వెస్టిండీస్‌పై అత్యుత్తమ ప్రదర్శన..
టెస్టులలో వెస్టిండీస్‌పై అత్యుత్తమ ప్రదర్శన చేసినవారిలో అశ్విన్ రెండో స్థానంలో (12-131) ఉన్నాడు. అంతకుముందు నరేంద్ర హిర్వాణి (16-126) ఈ ఘనత అందుకున్నాడు. అయితే ఆయన ఈ రికార్డు సాధించింది ఇండియాలో.. విండీస్‌లో ఒక భారత బౌలర్‌కు ఇదే (అశ్విన్‌ది) అత్యుత్తమ ప్రదర్శన. విదేశాలలో భారత్ తరఫున మూడో అత్యుత్తమ ప్రదర్శన. గతంలో భగవత్ చంద్రశేఖర్ (12-104), ఇర్ఫాన్ పఠాన్ (12-126) అశ్విన్ కంటే ముందున్నారు.
అంతేగాక ఒక టెస్టులో రెండుసార్లు ఫైఫర్స్ ప్లస్ వికెట్లు తీయడం అశ్విన్‌కు ఇది 6వ సారి. ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్ (11), రంగనా హెరాత్ (8) ముందున్నారు.