IND vs WI 1st Test: వెస్టిండిస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. డొమినికాలోని విండ్సర్ పార్క్‌లో జరిగిన ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేసింది. మూడో రోజు టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 421 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో విండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌ 130 పరుగులకే కుప్పకూలింది. భారత్ తరఫున రవిచంద్రన్ అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టాడు.


తొలి టెస్టులో టాస్ గెలిచిన విండీస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. ఈ ఇన్నింగ్స్‌లో అశ్విన్ 5 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత భారత జట్టు నుంచి బరిలోకి దిగిన కెప్టెన్ రోహిత్, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ జోడీ జట్టుకు శుభారంభం అందించేందుకు కృషి చేశారు.


రోహిత్, యశస్వి తొలి వికెట్కు 229 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 103 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ పెవిలియన్ చేరాడు. యశస్వి 171 పరుగుల చారిత్రాత్మక ఇన్నింగ్స్‌ ఆడాడు. విరాట్ కోహ్లీ కూడా 76 పరుగులు చేశాడు. అదే సమయంలో రవీంద్ర జడేజా 37 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసి డిక్లేర్ చేయడంతో ఆ జట్టుకు 271 పరుగుల ఆధిక్యం లభించింది.


అశ్విన్ స్పిన్ లో చిక్కుకున్న విండీస్ 


మూడో రోజు రెండో సెషన్‌లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో డిక్లర్‌ చేసే సమయానికి రోజు ఆటలో దాదాపు 50 ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత తన స్పిన్ మాయాజాలంతో విండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను క్లోజ్ చేయడానికి అశ్విన్‌కు పెద్దగా సమయం పట్టలేదు. 58 పరుగుల వద్ద విండీస్ జట్టులో సగం మంది పెవిలియన్ చేరారు. దీంతో జట్టు స్కోరు 130 పరుగులకే పరిమితమైంది. అశ్విన్ తన కెరీర్‌లో 34వసారి ఒకే ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీయగా, 8వసారి 10 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో 171 పరుగులు చేసిన యశస్వికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.


150 పరుగులు చేసిన పిన్న వయస్కుడిగా యశస్వి జైస్వాల్ రికార్డు


భారత్ తరఫున అరంగేట్ర టెస్టులోనే 150 పరుగులు చేసిన పిన్న వయస్కుడిగా యశస్వి జైస్వాల్ రికార్డు సృష్టించాడు. 21 ఏళ్ల 196 రోజుల వయసులో యశస్వి ఈ ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన 5వ పిన్న వయస్కుడిగా యశస్వి నిలిచాడు. టెస్టు చరిత్రలో అతి పిన్న వయసులోనే అరంగేట్ర మ్యాచ్‌లోనే 150 పరుగులు చేసిన రికార్డు పాకిస్థాన్ మాజీ దిగ్గజం జావేద్ మియాందాద్ పేరిట ఉంది.


అరంగేట్ర టెస్టులోనే 150 పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా యశస్వి జైస్వాల్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ లో యశస్వి ఇన్నింగ్స్ 171 పరుగుల వద్ద ముగిసింది. అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జాషువా డిసిల్వా చేతికి చిక్కి పెవిలియన్‌కు చేరాడు జైస్వాల్‌. 


అరంగేట్ర టెస్టులో సెంచరీ సాధించిన 17వ భారత ఆటగాడు


అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లో సెంచరీ పూర్తి చేసిన 17వ భారత ఆటగాడిగా యశస్వి జైస్వాల్ నిలిచాడు. మొహాలీ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యధిక పరుగులు చేసిన రికార్డు శిఖర్ ధావన్ పేరిట ఉంది. భారత్ తరఫున అరంగేట్ర టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతులు ఆడిన ఆటగాడిగా యశస్వి మొదటి స్థానంలో ఉన్నాడు. 171 పరుగుల ఇన్నింగ్స్‌లో యశస్వి మొత్తం 387 బంతులు ఎదుర్కొన్నాడు.