వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌కు భారీ ఆధిక్యం లభించింది. తన మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసింది. అంతకు ముందు వెస్టిండీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు 271 పరుగుల ఆధిక్యం లభించింది.
భారత బ్యాటర్లలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (171: 387 బంతుల్లో, 16 ఫోర్లు, ఒక సిక్సర్), రోహిత్ శర్మ (103: 221 బంతుల్లో, 10 ఫోర్లు, రెండు సిక్సర్లు) సెంచరీలు సాధించారు. విరాట్ కోహ్లీ (76: 182 బంతుల్లో, ఐదు ఫోర్లు) అర్థ సెంచరీతో రాణించాడు.
ఓవర్ నైట్ స్కోరు 312/2 వద్ద మూడో రోజు ఆట ఆరంభించిన భారత బ్యాటర్లు సాధికారికతతో ఆడారు. 143 పరుగులతో క్రీజులోకి వచ్చిన యశస్వి జైస్వాల్ 360 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా గేర్ మార్చాడు.
రెండో రోజు మూడో సెషన్‌లో ఆచితూచి ఆడిన విరాట్ కోహ్లీ ఇవాళ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. అయితే 171 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్‌ను వెస్టిండీస్ పేస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ పెవిలియన్ బాట పట్టించాడు.
జైస్వాల్ నిష్క్రమించిన తర్వాత క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానే (3: 11 బంతుల్లో) నిరాశపరిచాడు. కీమర్ రోచ్ వేసిన 130వ ఓవర్లో మొదటి బంతికి రహానే.. బ్లాక్‌వుడ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వారికన్ వేసిన ఓవర్లో సింగిల్ తీసిన విరాట్ కోహ్లీ టెస్టుల్లో 29వ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అజింక్య రహానే తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా (37 నాటౌట్: 82 బంతుల్లో, మూడు ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. భారీ ఇన్నింగ్స్ దిశగా సాగుతున్న విరాట్‌ను అవుట్ చేసి కార్న్‌వాల్ వెస్టిండీస్‌కు మంచి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత కాసేపటికే భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.