IND vs WI 1st Test: వెస్టిండీస్‌తో డొమినికా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ స్పష్టమైన ఆధిక్యం  సాధించి ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మూడో రోజు తొలి సెషన్‌లో రెండు కీలక వికెట్లు కోల్పోయినా  భారత్ ధాటిగా ఆడింది. కోహ్లీ (170 బంతుల్లో 72 నాటౌట్, 5 ఫోర్లు) అర్థ సెంచరీ పూర్తి చేసుకుని  శతకం దిశగా దూసుకుపోతుండగా..  యువ సంచలనం  యశస్వి జైస్వాల్ (387 బంతుల్లో 171, 16 ఫోర్లు, 1 సిక్స్)  డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. మూడో రోజు  తొలి సెషన్ ముగిసేసరికి  భారత్.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 142 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 400 పరుగులు చేసింది.  ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం.. 250 పరుగులకు చేరింది. 


జైస్వాల్ - కోహ్లీ ధాటిగా.. 


ఓవర్ నైట్ స్కోరు   312 - 2 వద్ద  మూడో రోజు ఆట ఆరంభించిన భారత్..  ధాటిగానే ఆడింది.   143 పరుగులతో  క్రీజులోకి వచ్చిన జైస్వాల్..  360 బంతుల్లో  150 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ కూడా గేర్ మార్చాడు. నిన్న మూడో సెషన్‌లో ఆచితూచి ఆడిన కోహ్లీ..  ఇవాళ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. అయితే  171 పరుగులు చేసిన యశస్విని అల్జారీ జోసెఫ్.. 126వ ఓవర్‌లో ఔట్ చేశాడు.  జైస్వాల్.. వికెట్ కీపర్ డ సిల్వకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  


జైస్వాల్ నిష్క్రమించిన తర్వాత క్రీజులోకి వచ్చిన  అజింక్యా రహానె  (11 బంతుల్లో 3) నిరాశపరిచాడు.  కీమర్ రోచ్ వేసిన 130వ ఓవర్లో మొదటి బంతికి  రహానె.. బ్లాక్‌వుడ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  వారికన్ వేసిన ఓవర్లో సింగిల్ తీసిన కోహ్లీ.. టెస్టులలో 29వ అర్థ  సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రహానె తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా (52 బంతుల్లో 21 నాటౌట్, 1 ఫోర్, 1 సిక్స్) తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు.  147 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ.. ఆ తర్వాత మాత్రం  22 పరుగులను 23 బంతుల్లోనే అందుకోవడం విశేషం.  జడేజాతో కలిసి భారత్‌కు కోహ్లీ భారీ ఆధిక్యాన్ని అందిస్తున్నాడు. క్రీజులో  కోహ్లీ - జడ్డూతో పాటు ఇషాన్ కిషన్, అశ్విన్, శార్దూల్ ఠాకూర్‌ల రూపంలో భారత్‌కు స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉండటంతో  టీమిండియా భారీ స్కోరుపై కన్నేసింది.  


 






జైస్వాల్ రికార్డులు.. 


టీమిండియా యువ సంచలనం  యశస్వి జైస్వాల్.. అరంగేట్ర మ్యాచ్‌లో  అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో మూడో స్థానంలో నిలిచాడు.  ఈ జాబితాలో శిఖర్ ధావన్ (187), రోహిత్ శర్మ (177)లు జైస్వాల్ (171) కంటే ముందున్నారు.  అయితే అరంగేట్ర టెస్టులో భారత్ తరఫున విదేశాలలో అత్యధిక పరుగులు చేసిన  బ్యాటర్ల జాబితాలో మాత్రం.. అతడు  మాజీ సారథి సౌరవ్ గంగూలీ రికార్డును బ్రేక్ చేశాడు.  దాదా.. 1996లో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన  టెస్టులో 131 పరుగులు చేశాడు.  అంతర్జాతీయంగా ఈ జాబితాలో యశస్వి.. ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితా కింది విధంగా ఉంది.. 


- టిప్ ఫాస్టర్ (ఇంగ్లాండ్) - ఆస్ట్రేలియాపై 287 పరుగులు 
- జాక్వస్ రొడాల్ఫ్ (సౌతాఫ్రికా) - బంగ్లాదేశ్‌పై 222 నాటౌట్ 
- కైల్ మేయర్స్ (వెస్టిండీస్) - బంగ్లాదేశ్‌పై 201 నాటౌట్ 
- డెవాన్ కాన్వే (న్యూజిలాండ్) - ఇంగ్లాండ్‌పై 200 
- యశస్వి జైస్వాల్ (ఇండియా) - వెస్టిండీస్‌పై 171 


































Join Us on Telegram: https://t.me/abpdesamofficial