Gautam Gambhir: కోల్‌కతా నైట్ రైడర్స్ రాత మార్చిన  ఆ జట్టు మాజీ సారథి  గౌతం గంభీర్ మళ్లీ ఆ జట్టుతో  చేతులు కలపబోతున్నాడా..?   వచ్చే సీజన్ నుంచి  గంభీర్.. ఆ జట్టుకు హెడ్‌కోచ్‌గా లేదా మెంటార్‌గా రానున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.  ఐపీఎల్ -2024 లో గంభీర్‌ను కేకేఆర్‌లోకి తీసుకొచ్చేందుకు  ఆ జట్టు మేనేజ్‌మెంట్  ప్రయత్నాలు ముమ్మరం చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 


గత రెండు సీజన్లుగా లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా  సేవలందిస్తున్న గంభీర్.. కేకేఆర్ టీమ్ మేనేజ్‌మెంట్‌తో చర్చలు  జరుపుతున్నాడని దైనిక్ జాగరన్ నివేదిక పేర్కొంది.  లక్నో  జట్టు వచ్చే ఏడాది  ప్రస్తుత హెడ్‌కోచ్ ఆండీ ఫ్లవర్‌ను మార్చనుందని  వార్తలు వస్తున్నాయి.  వాస్తవానికి  లక్నోకు హెడ్‌కోచ్ ఆండీ ఫ్లవర్ అయినా   పెత్తనం మొత్తం గంభీర్‌దే అన్న విషయం  అందరికీ తెలిసిందే. ఆండీ ఫ్లవర్‌ను తప్పించనున్న లక్నో యాజమాన్యం గంభీర్‌ను కూడా వదులుకుంటుందా..? అన్నది తేలాల్సి ఉంది. 


 






ఇక కోల్‌కతా టీమ్‌తో పాటు ఇక్కడి ప్రజలతో గంభీర్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. చెన్నైకి ధోని, బెంగళూరుకు కోహ్లీ,  ముంబైకి రోహిత్ మాదిరిగా  కోల్‌కతాకు గంభీర్ వ్యవహరించాడు. 2011 నుంచి 2017 వరకూ గంభీర్.. కేకేఆర్‌తో కొనసాగాడు.  2011 వరకూ ఒక్కసారి కూడా ఫైనల్ చేరని జట్టును విజయవంతంగా నడిపించడమే గాక  రెండు ట్రోఫీలను కూడా అందించాడు. గంభీర్ సారథ్యంలోనే కేకేఆర్.. 2012, 2014లలో  ట్రోఫీలను గెలుచుకుంది.  అయితే 2017 తర్వాత  గంభీర్.. కేకేఆర్‌ను వీడాడు. అప్పట్నుంచి ఆ జట్టు మళ్లీ 2021లో మాత్రమే ఫైనల్‌కు చేరింది.   దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్, శ్రేయాస్ అయ్యర్.. ఇలా సారథులు మారుతున్నా ఆ జట్టు తలరాత మారడం లేదు. 


 






 






కేకేఆర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. గంభీర్‌ ఒప్పుకుంటే అతడిని హెడ్‌కోచ్ లేదా మెంటార్ గా నియమించి ఆ జట్టు మాజీ సారథి, ఇంగ్లాండ్‌కు తొలి వన్డే వరల్డ్ కప్ అందించిన ఇయాన్ మోర్గాన్‌కు బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు అప్పజెప్పనున్నారని తెలుస్తున్నది. 20‌22 వరకూ  కేకేఆర్‌కు  కివీస్ మాజీ సారథి బ్రెండన్ మెక్‌కల్లమ్  హెడ్‌కోచ్‌గా ఉన్నాడు. గత సీజన్‌లో అతడి స్థానంలో   చంద్రకాంత్ పాటిల్  వచ్చాడు.  గంభీర్‌ను కోచ్‌గా నియమిస్తే అతడు తప్పుకోవాల్సి ఉంటుంది.   దీనిపై పూర్తి వివరాలు వెల్లడవడానికి ఇంకా చాలా సమయమే ఉంది.   వచ్చే మార్చిలో మొదలుకాబోయే ఐపీఎల్ - 17 సీజన్ వరకూ పరిణామాలు, పరిస్థితులు ఎలా మారుతాయో మరి..! సోషల్ మీడియాలో అయితే దీని గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయి. 































Join Us on Telegram: https://t.me/abpdesamofficial