Yashasvi Jaiswal: దేశవాళీ, ఐపీఎల్‌లలో నిలకడగా రాణించి జాతీయ జట్టులో ఎంట్రీతోనే డ్రీమ్ డెబ్యూ చేసిన యశస్వి జైస్వాల్ మరో అరుదైన రికార్డుపై కన్నేశాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీతో కదం తొక్కిన జైస్వాల్.. మరో 45 పరుగులు చేస్తే భారత్ తరఫున ఆడిన తొలి టెస్టులోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడు. ఆట రెండో రోజు 215 బంతుల్లో సెంచరీ చేసిన జైస్వాల్.. ఆట ముగిసే సమయానికి 350 బంతులు ఎదుర్కుని 143 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.
టీమిండియా తరఫున అరంగేట్ర టెస్టులోనే అత్యధిక పరుగులు చేసిన రికార్డు వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ పేరిట ఉంది. 2013లో ధావన్.. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో ఎంట్రీ ఇచ్చి ఆ మ్యాచ్‌లో 187 పరుగులు చేశాడు. ఇప్పటివరకూ టీమిండియా తరఫున డెబ్యూ మ్యాచ్‌లో ఓ ఆటగాడికి ఇదే హయ్యస్ట్ స్కోరు.
ధావన్‌తో పాటు భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మ.. 2017లో తన అరంగేట్ర టెస్టులో 177 పరుగులు చేశాడు. ఆ ఏడాది వెస్టిండీస్‌తో కోల్‌కతా వేదికగా ముగిసిన ఆ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్.. 301 బంతులు ఆడి 177 పరుగులు సాధించాడు. ధావన్ తర్వాత రెండో స్థానంలో హిట్‌మ్యాన్ ఉన్నాడు. ఈ ఇద్దరి తర్వాత స్థానం జైస్వాల్‌దే కావడం గమనార్హం.
ఇక వెస్టిండీస్‌తో నేడు మూడో రోజు ఆటలో మరో 35 పరుగులు చేస్తే రోహిత్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉన్న యశస్వికి 45 పరుగులు చేస్తే ధావన్ రికార్డును కూడా బద్దలుకొడతాడు. ఆడుతున్నది తొలి టెస్టే అయినా బెదురులేకుండా ఆడుతున్న జైస్వాల్.. నేటి ఆటలో ఏం చేస్తాడో మరి...
ప్రపంచ క్రికెట్‌లో చూసుకుంటే డెబ్యూ మ్యాచ్‌లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఇంగ్లాండ్‌కు చెందిన దివంగత ఆటగాడు టిప్ ఫోస్టర్ పేరిట రికార్డు ఉంది. ఫోస్టర్.. 1903లో ఆస్ట్రేలియాతో టెస్టులో ఎంట్రీ ఇచ్చి ఏకంగా 287 పరుగులు చేశాడు. 13 పరుగుల తేడాతో ట్రిపుల్ సెంచరీ మిస్ అయినా ఫోస్టర్ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఆడిన తొలి టెస్టులోనే డబుల్ సెంచరీ చేసిన బ్యాటర్లలో ఫోస్టర్, జాక్వస్ రుడాల్ఫ్ (సౌతాఫ్రికా), లారెన్స్ రోవ్ (వెస్టిండీస్), మాథ్యూ సింక్లేయర్ (న్యూజిలాండ్), కైల్ మేయర్స్ (వెస్టిండీస్), బ్రెండన్ కురుప్పు (శ్రీలంక), డెవాన్ కాన్వే (న్యూజిలాండ్) లు ఉన్నారు. వెస్టిండీస్‌తో మూడో రోజు ఆటలో జైస్వాల్‌కు డబుల్ సెంచరీ చేసే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం 143 పరుగులతో ఉన్న అతడు.. మరో 57 పరుగులు చేస్తే డబుల్ సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలుస్తాడు.
ఇక తొలి టెస్టులో భాగంగా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 150 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 113 ఓవర్లకు 312 పరుగులు చేసింది. జైస్వాల్ (143), విరాట్ కోహ్లీ (36 నాటౌట్) క్రీజులో ఉన్నారు. భారత్ ఇప్పటికే 162 పరుగుల ఆధిక్యంలో ఉంది.