Virat Kohli Record: రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టులలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో భారత్ తరఫున టాప్ - 5లో చేరాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 36 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్న కోహ్లీ.. టెస్టులలో 8,500 పరుగుల మైలురాయిని దాటాడు. ఈ క్రమంలో కోహ్లీ.. మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేయగానే వీరూ రికార్డును బ్రేక్ చేసి భారత్ తరఫున టాప్ -5లోకి దూసుకొచ్చాడు.
టెస్టులలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..
భారత్ తరఫున టెస్టులలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ అందరికంటే ముందున్నాడు. సచిన్.. 200 టెస్టులలో 15,921 పరుగులు (ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే బెస్ట్) చేశాడు. ఆ తర్వాత జాబితాలో ప్రస్తుత టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్ (163 మ్యాచ్‌లలో 13,265) ఉండగా మూడో స్థానంలో లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ (125 మ్యాచ్‌లలో 10,122) ఉన్నాడు. హైదరాబాద్ సొగసరి బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ (134 మ్యాచ్‌లలో 8,781) ఉండగా విరాట్ కోహ్లీ.. 110 మ్యాచ్‌లలో 8,515 పరుగులు చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్.. 103 టెస్టులలో 8,503 రన్స్ సాధించాడు. ఈ టెస్టులో ఇంకా ఆడేందుకు ఆస్కారం ఉండటం, రెండో టెస్టులో కూడా కోహ్లీ రాణిస్తే అతడు వీవీఎస్ లక్ష్మణ్ రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి గాను కోహ్లీకి మరో 266 పరుగులు కావాలి. మరి నేటి టెస్టులో కోహ్లీ ఏం చేస్తాడో..!
వన్డేలలో..
టెస్టులలోనే కాదు.. మిగిలిన ఫార్మాట్లన్నింటిలోనూ కోహ్లీ భారత్ తరఫున టాప్ -5లోనే ఉన్నాడు. వన్డే ఫార్మాట్‌లో కోహ్లీ.. సచిన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. సచిన్.. తన సుదీర్ఘ కెరీర్‌లో 463 మ్యాచ్‌లలో 452 ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 18,426 పరుగులు చేశాడు. కోహ్లీ.. ఇప్పటివరకూ 274 మ్యాచ్‌లు ఆడి 265 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి 12,898 రన్స్ సాధించాడు. ఈ జాబితాలో గంగూలీ (11,221), ద్రావిడ్ (10,768), ధోని (10,599) టాప్ - 5లో ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో చూస్తే.. సచిన్ తర్వాత కుమార సంగక్కర (14,234), రికీ పాంటింగ్ (13,704), సనత్ జయసూర్య (13,430) తర్వాత కోహ్లీ ఐదో స్థానంలో ఉన్నాడు.
టీ20లో అగ్రస్థానం..
అంతర్జాతీయ టీ20లలో ఇప్పటివరకూ భారత్ తరఫునే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా కోహ్లీదే నెంబర్ వన్ పొజిషన్. 115 టీ20 మ్యాచ్‌లలో కోహ్లీ.. 4,008 పరుగులు చేశాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో రోహిత్ శర్మ (3,853), న్యూజిలాండ్ వెటరన్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (3,531), బాబర్ ఆజమ్ (3,485), ఐర్లాండ్ బ్యాటర్ పీఆర్ స్టిర్లింగ్ (3,275) టాప్ - 5 లో నిలిచారు.