MLC 2023: బేస్ బాల్, హ్యాండ్ బాల్, ఎన్‌బీఎ వంటి గేమ్స్ చూసిన అగ్రరాజ్యం అమెరికాలో టీ20 క్రికెట్ ఎంట్రీ ఘనంగా జరిగింది. డల్లాస్ వేదికగా నిన్న (గురువారం) రాత్రి మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) ప్రారంభమైంది. మినీ ఐపీఎల్ అయిన ఈ లీగ్‌లో తొలి మ్యాచ్ టెక్సాస్ సూపర్ కింగ్స్ (సీఎస్కే టీమ్) - లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ (కేకేఆర్ టీమ్) మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో టెక్సాస్.. 69 పరుగుల తేడాతో లాస్ ఏంజెల్స్‌ను ఓడించింది. సూపర్ కింగ్స్ తరఫున డేవిడ్ మిల్లర్ (42 బంతుల్లో 61, 2 ఫోర్లు, 4 సిక్సర్లు), డెవాన్ కాన్వే (37 బంతుల్లో 55, 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన టెక్సాస్ జట్టు.. రెండో ఓవర్లోనే కెప్టెన్ డుప్లెసిస్ (0) వికెట్‌ను కోల్పోయింది. వన్ డౌన్‌లో వచ్చిన లాహిరు మిలంత (17) కూడా ఎక్కువసేపు నిలువలేదు. కానీ మిల్లర్ జతకలిశాక.. కాన్వే రెచ్చిపోయాడు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. అర్థ సెంచరీల తర్వాత ఈ ఇద్దరూ నిష్క్రమించినా.. చివర్లో మిచెల్ సాంట్నర్ (14 బంతుల్లో 21, 2 సిక్సర్లు), డ్వేన్ బ్రావో (6 బంతుల్లో 16, 2 సిక్సర్లు) ధాటిగా ఆడారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో టెక్సాస్.. 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
రసెల్ పోరాడినా..
182 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో లాస్ ఏంజెల్స్ తడబడింది. స్కోరు బోర్డుపై 10 పరుగులు కూడా చేరకుండానే ఆ జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. మార్టిన్ గప్తిల్ (0) డకౌట్ అవగా ఉన్ముక్త్ చంద్ (4), రిలీ రూసో (4)లు ఔట్ అయ్యారు. 7 పరుగులకే ఆ జట్టు మూడు వికెట్లు చేజార్చుకుంది. నితీశ్ కుమార్ (0) కూడా డకౌట్ అవగా జస్కరన్ మల్హోత్రా (11 బంతుల్లో 22, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడినా ఎక్కువసేపు నిలువలేదు. 20 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆండ్రూ రసెల్ (34 బంతుల్లో 55, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరవిహారం చేశాడు. 29 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసిన రసెల్.. కెప్టెన్ సునీల్ నరైన్ (13 బంతుల్లో 15, 1 సిక్స్) తో కలిసి ఆరో వికెట్‌కు 47 పరుగులు జోడించాడు.
ఒక దశలో నైట్ రైడర్స్.. 11.1 ఓవర్లలో 103-6 గా ఉండటం.. రసెల్, నరైన్‌లు క్రీజులో ఉండటంతో ఆ జట్టు విజయం దిశగా దూసుకుపోతుందనిపించింది. కానీ మహ్మద్ మోహ్సిన్.. నైట్ రైడర్స్‌కు ఆ అవకాశమివ్వలేదు. నరైన్‌ను అతడు ఔట్ చేయడంతో ఆ తర్వాత మిగతా బ్యాటర్లు కుప్పకూలారు. రసెల్‌ను కూడా బ్రావో ఔట్ చేశాడు. దీంతో 14 ఓవర్లలోనే ఆ జట్టు 112 పరుగులకే కుప్పకూలింది. లాస్ ఏంజెల్స్ టీమ్‌లో మల్హోత్రా, రసెల్, నరైన్ తప్ప మిగిలిన ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. టెక్సాస్ బౌలర్లలో మోహ్సిన్ నాలుగు వికెట్లు తీశాడు.
ఈ టోర్నీలో నేడు సియాటెల్ ఆర్కాస్ వర్సెస్ వాషింగ్టన్ ఫ్రీడమ్, ఎంఐ న్యూయార్క్ వర్సెస్ సాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ మధ్య మ్యాచ్‌లు జరుగనున్నాయి.