India vs West Indies 1st Test Day 2 Highlights: భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న డొమినికా టెస్టులో రెండో రోజు కూడా భారత ఆధిపత్యం కొనసాగింది. తొలి రోజు 150 పరుగులకే ఆలౌటైన విండీస్ జట్టుపై భారత్ భారీ స్కోర్ నమోదు చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో రోజు కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ సెంచరీలతో విరుచుకుపడ్డారు. తొలి ఇన్నింగ్స్ ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్143 పరుగులతో, విరాట్ కోహ్లీ 36 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
తొలి సెషన్‌లో ఆచితూచి ఆడిన యశస్వి, రోహిత్
రెండో రోజు తొలి సెషన్‌లో భారత జట్టులోని ఓపెనింగ్ బ్యాటర్లు ఇద్దరూ జాగ్రత్తగా ముందుకు సాగుతూ తమ స్టైల్‌లో బౌండరీలు సాధించారు. వీరిద్దరూ జట్టు స్కోరును 100 పరుగులు దాటించారు. యశస్వి జైశ్వాల్ టెస్టు క్రికెట్‌లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల్లో తన 15వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. లంచ్ సమయానికి భారత జట్టు స్కోరు వికెట్ నష్టపోకుండా 146 పరుగులు చేసింది.
రెండో సెషన్‌లో రోహిత్, యశస్వి సెంచరీలు
లంచ్ తర్వాత రెండో సెషన్ ఆట ప్రారంభం కాగానే రోహిత్, యశస్వి స్కోరు జోరు పెంచారు. ఈ క్రమంలోనే యశస్వి జైశ్వాల్ అరంగేట్ర టెస్టులోనే సెంచరీ చేసి ప్రత్యేక క్లబ్‌లో చేరాడు. కెప్టెన్ రోహిత్, యశస్వి తొలి వికెట్కు 200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
రోహిత్ శర్మ కూడా తన 10వ టెస్టు సెంచరీ పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. అయితే 103 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో 229 పరుగుల వద్ద భారత జట్టు తన తొలి వికెట్ కోల్పోయింది. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శుబ్‌మన్ గిల్ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. రెండో సెషన్ ముగిసేసరికి టీమిండియా 2వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది.
చివరి సెషన్‌లో యశస్వి, కోహ్లీ ఆచితూచి
చివరి సెషన్‌లో యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ విండీస్ బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోజు ఆట ముగిసే సమయానికి స్కోరు 312 పరుగులకు చేరింది. దీంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 162 పరుగుల ఆధిక్యం లభించింది. యశస్వి 143, విరాట్ 36 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. విండీస్ బౌలర్లలో రెండో రోజు ఆథనేజ్, వారికాన్ చెరో వికెట్ పడగొట్టారు.
రోహిత్-యశస్వి జోడీ చరిత్ర సృష్టించింది
ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ రికార్డు సృష్టించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య వెస్టిండీస్ 150 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత టెస్టు క్రికెట్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన యశస్వి జైశ్వాల్ కెప్టెన్ రోహిత్‌తో కలిసి తొలి వికెట్కు 229 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
దీంతో టెస్టు చరిత్రలో తొలిసారి వికెట్ నష్టపోకుండా భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించింది. గతంలో 1979లో ఇంగ్లండ్‌పై 213 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన చేతన్ చౌహాన్- గవాస్కర్ జోడీ రికార్డును జైశ్వాల్- రోహిత్ జోడీ తుడిచేసింది. అదే సమయంలో 2006 తర్వాత వెస్టిండీస్ గడ్డపై భారత్ తొలి వికెట్‌కు ఇదే అతిపెద్ద భాగస్వామ్యం కావడం విశేషం. అంతకుముందు 2006లో వసీం జాఫర్, వీరేంద్ర సెహ్వాగ్ జోడీ 159 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
టెస్టు క్రికెట్లో భారత్ నుంచి వెస్టిండీస్‌పై తొలి వికెట్‌కు ఇదే అతిపెద్ద భాగస్వామ్యం. అంతకుముందు 2002లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో వీరేంద్ర సెహ్వాగ్, సంజయ్ బంగర్ జోడీ 201 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది.
ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఇద్దరూ సెంచరీ సాధించడం భారత జట్టుకు టెస్టు క్రికెట్‌లో ఇది ఆరోసారి. భారత్ తరఫున మురళీ విజయ్, శిఖర్ ధావన్ చివరిసారిగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఫతుల్లా టెస్టు మ్యాచ్‌లో ఈ ఘనత సాధించారు.
టెస్టుల్లో 10వ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ
టెస్టుల్లో 10వ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ 103 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో అతను టెస్ట్ క్రికెట్‌లో 3500 పరుగులు పూర్తి చేయగలిగాడు. టెస్టు క్రికెట్లో భారత్ వెలుపల రోహిత్‌కు ఇది రెండో సెంచరీ. తొలి విదేశీ టెస్టు సెంచరీని ఇంగ్లాండ్‌లో చేశాడు రోహిత్.