IND vs WI Test: డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ సంచలనం  యశస్వి జైస్వాల్  (350 బంతుల్లో 143 నాటౌట్, 14 ఫోర్లు)రికార్డుల మోత మోగించాడు. అరంగేట్ర టెస్టులోనే శతకం బాదిన  జైస్వాల్..  ఈ క్రమంలో అతడు పలు పాత రికార్డులను బ్రేక్ చేశాడు. విండ్సోర్ పార్క్ (డొమినికా) వేదికగా  జరుగుతున్న తొలి టెస్టులో 215 బంతుల్లో  సెంచరీ చేశాడు. టీమిండియా సారథి రోహిత్ శర్మతో కలిసి  తొలి వికెట్‌కు 229 పరుగులు జతకూర్చాడు. ఈ మ్యాచ్‌లో జైస్వాల్ సృష్టించిన, బ్రేక్ చేసిన రికార్డుల జాబితాను ఇక్కడ చూద్దాం. 


ఆడుతున్న తొలి టెస్టులోనే సెంచరీ.. 


భారత్ తరఫున  అరంగేట్ర టెస్టులోనే సెంచరీ చేసిన  17వ బ్యాటర్  యశస్వి జైస్వాల్. ఈ జాబితాలో లాలా అమర్‌నాథ్, దీపక్ శోధన్, ఏజీ కృపాల్ సింగ్, అబ్బాస్ అలీ బేగ్, హనుమంత్ సింగ్, గుండప్ప విశ్వనాథ్, సురీందర్ అమర్‌నాథ్, మహ్మద్ అజారుద్దీన్, ప్రవీణ్ ఆమ్రే, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనా, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, పృథ్వీ షా, శ్రేయాస్ అయ్యర్‌లు జైస్వాల్ కంటే ముందున్నారు. 


విదేశాలలో ఏడో బ్యాటర్.. 


పైన పేర్కొన్న వారిలో పలువురు ఆటగాళ్లు స్వదేశంలో సెంచరీలు చేయగా మరికొంతమంది విదేశాలలో ఈ ఘనతను  అందుకున్నారు. అలా విదేశాలలో సెంచరీ చేసిన వారి జాబితాలో  జైస్వాల్ ఏడో బ్యాటర్. జైస్వాల్ కంటే ముందు.. సురేశ్ రైనా (శ్రీలంక), వీరేంద్ర సెహ్వాగ్ (దక్షిణాఫ్రికా), సౌరవ్ గంగూలీ (ఇంగ్లాండ్ ), ప్రవీణ్ ఆమ్రే (దక్షిణాఫ్రికా), సురీందర్ అమర్‌నాథ్ (న్యూజిలాండ్), అబ్బాస్ అలీ బేగ్ (ఇంగ్లాండ్)లు జాబితాలో ఉన్నారు. 


 






మరికొన్ని.. 


- అరంగేట్ర టెస్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా (విదేశాలలో)  జైస్వాల్ తొలి స్థానంలో ఉన్నాడు.  టీమిండియా మాజీ సారథి   సౌరవ్ గంగూలీ (131, లార్డ్స్, ఇంగ్లాండ్) ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్నాడు. 


- తొలి టెస్టులోనే ఓపెనర్‌గా సెంచరీ చేసిన మూడో ఓపెనర్ జైస్వాల్.  అతడికంటే ముందు శిఖర్ ధావన్ (187, ఆస్ట్రేలియాపై), పృథ్వీ షా (134, వెస్టిండీస్ పై) ముందున్నారు.  


-  వెస్టిండీస్‌పై ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ చేసిన మూడో బ్యాటర్ జైస్వాల్. గతంలో ఈ రికార్డు రోహిత్ శర్మ (177), పృథ్వీ షాల పేరిట ఉంది. 


- అతి పిన్న వయసులో సెంచరీ చేసిన బ్యాటర్లలో జైస్వాల్ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతడి కంటే ముందు పృథ్వీ షా (18ఏండ్ల 329 రోజులు), అబ్బాస్ అలీ బేగ్ (20 ఏండ్ల 126 రోజులు), గుండప్ప విశ్వనాథ్ (20 ఏండ్ల 276 రోజులు) తొలి మూడు స్థానాల్లో నిలిచారు. జైస్వాల్ వయసు 21 ఏండ్ల 197 రోజులు. 


- డొమినికా టెస్టులో రోహిత్‌తో కలిసి 229 పరుగుల భాగస్వామ్యం జోడించాడు జైస్వాల్. ఈ క్రమంలో ఈ  జోడీ .. 44 ఏండ్ల క్రితం  సునీల్ గవాస్కర్ - చేతన్ చౌహన్  ఇంగ్లాండ్‌పై నెలకొల్పిన అత్యధిక భాగస్వామ్యం (212) రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ఆసియా అవతల భారత్‌కు ఇదే (212) బెస్ట్ ఓపెనింగ్ రికార్డుగా ఉండేది. టెస్టులలో వెస్టిండీస్‌పై తొలి వికెట్‌కు భారత్‌కు ఇదే అతిపెద్ద భాగస్వామ్యం. అంతకుముందు 2002లో వాంఖడే స్టేడియంలో వీరేంద్ర సెహ్వాగ్, సంజయ్ బంగర్‌లు 201 పరుగుల భాగస్వామ్యం నమోదుచేసింది. 




























Join Us on Telegram: https://t.me/abpdesamofficial