IND vs SA Schedule: ఈ ఏడాది భారత క్రికెట్ జట్టు స్వదేశంలో జరుగబోయే వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత మొదటి టూర్ ఖరారైంది. నవంబర్ 19 తర్వాత (భారత్ క్వాలిఫై అయితే) ఫైనల్ ముగిశాక టీమిండియా కొన్ని రోజుల అనంతరం సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లనుంది. డిసెంబర్ 10 నుంచి జనవరి 7 దాకా దక్షిణాఫ్రికాలోనే పర్యటించనుంది. నెల్సన్ మండేలా - మహాత్మ గాంధీల గౌరవార్థం ఫ్రీడమ్ సిరీస్‌గా పిలుచుకునే ఈ సిరీస్ షెడ్యూల్ తాజాగా విడుదలైంది.
ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షెడ్యూల్‌ను విడుదల చేసింది. మూడు ఫార్మాట్ల సిరీస్‌గా ఉన్న ఈ టూర్‌లో భారత జట్టు.. సఫారీలతో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఆరు వేదికలలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి.
డర్బన్, గ్వెబెర్తా, జోహన్నస్‌బర్గ్, పార్ల్, సెంచూరియన్, కేప్ టౌన్ వేదికగా ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. టెస్టు సిరీస్ అత్యంత కీలకమైన బాక్సింగ్ డే నాడు మొదలుకానుంది.
డిసెంబర్ 10న దక్షిణాఫ్రికాతో తొలి టీ20 ఆడే భారత జట్టు.. డిసెంబర్ 12న గ్వెబెర్తాలో రెండో మ్యాచ్ ఆడనుంది. మూడో టీ20 జోహన్నస్‌బర్గ్ వేదికగా జరుగనుంది. తొలి వన్డే కూడా జోహన్నస్‌బర్గ్ లోనే జరుగనుంది. రెండో వన్డే గ్వెబెర్తాలో, మూడో వన్డే పార్ల్‌లో జరుగుతుంది. డిసెంబర్ 26 నుంచి 30 (బాక్సింగ్ డే టెస్టు) వరకూ సెంచూరియన్‌లో తొలి టెస్టు జరగాల్సి ఉండగా.. జనవరి 3 నుంచి 7 దాకా కేప్ టౌన్‌లో రెండో టెస్టు జరుగుతుంది.
సిరీస్ పూర్తి షెడ్యూల్ :
డిసెంబర్ 10 : తొలి టీ20 - డర్బన్
డిసెంబర్ 12 : రెండో టీ20 - గ్వెబెర్తా
డిసెంబర్ 14 : మూడో టీ20 - జోహన్నస్‌బర్గ్
డిసెంబర్ 17 : తొలి వన్డే - జోహన్నస్‌బర్గ్
డిసెంబర్ 19 : రెండో వన్డే - గ్వెబెర్తా
డిసెంబర్ 21 : మూడో వన్డే - పార్ల్
డిసెంబర్ 26 - 30 : ఫస్ట్ టెస్ట్ - సెంచూరియన్
జనవరి 3 - 7 : రెండో టెస్ట్ - కేప్ టౌన్
ఈ సిరీస్ ప్రకటనపై బీసీసీఐ సెక్రటరీ జై షా మాట్లాడుతూ.. ‘ఈ సిరీస్ రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య పోరు మాత్రమే కాదు ఇద్దరు గొప్ప నాయకులు మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలాల మహానాయకులను తలుచుకునేందుకు ఈ సిరీస్‌లు గొప్ప వేదికలవుతాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ క్యాలెండర్‌లో బాక్సింగ్ డే టెస్టు, న్యూఈయర్ టెస్టులు చాలా ప్రధానమైనవి. దక్షిణాఫ్రికాలో భారత్ ఆడే మ్యాచ్‌లకు ఎప్పుడూ మంచి మద్దతు ఉంటుంది. ఈసారి కూడా అదే విధమైన మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాం..’ అని పేర్కొన్నాడు. క్రికెట్ సౌతాఫ్రికా ఛైర్ పర్సన్ లాసన్ నైడో కూడా అతిథులకు ఘనస్వాగతం పలుకుతున్నామని, ఈ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపాడు. బీసీసీఐతో తమకు మంచి అనుబంధముందని, భవిష్యత్‌లో అది మరింత బలపడాలని ఆశిస్తున్నట్టు వెల్లడించాడు.