LPL 2023: పాకిస్తాన్  క్రికెట్ జట్టు సారథి బాబర్ ఆజమ్ ప్రస్తుతం  లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్)లో    కొలంబో స్ట్రైకర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.  నిన్న   పల్లెకెలె వేదికగా  గాలె టైటాన్స్ తో జరిగిన మ్యాచ్‌లో బాబర్.. సెంచరీ చేసి  తన జట్టును గెలిపించాడు. అయితే సెంచరీ చేసి మ్యాచ్‌ను గెలిచిపిన తర్వాత బాబర్.. విలేకరులతో మాట్లాడుతూ  తనకు నమాజ్ చేసేందుకు సమయం దగ్గరపడుతుందని, త్వరగా  ప్రశ్నలు అడగాలని  అభ్యర్థించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. 


పాకిస్తాన్‌కు చెందిన ఓ క్రీడా జర్నలిస్టు షేర్ చేసిన వీడియో ప్రకారం..   మ్యాచ్ ముగిసిన తర్వాత  బాబర్ విలేకరులతో మాట్లాడేందుకు వచ్చాడు. అదే సమయంలో నమాజ్ చేసే టైమ్ కూడా కావడంతో  ‘భయ్యా..  నమాజ్ టైమ్ దగ్గరపడుతోంది.  నేను నమాజ్ చేసుకోవాలి. త్వరగా  కానీయండి’ అంటూ వ్యాఖ్యానించాడు. ఈ వీడియో  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


బాబర్‌కు దైవ భక్తి ఎక్కువే. ఇటీవలే అతడు  మక్కాను సందర్శించి అక్కడ  సామాన్య భక్తుల వలే  కటిక నేల మీద పడుకోవడం, నిష్టతో ఉపవాసాలు ఉండటం వంటివి చేశాడు.  గతంలో కూడా మ్యాచ్‌లు జరుగుతుండగా నమాజ్ చేసిన వీడియోలు, ఫోటోలు  వైరల్ అయ్యాయి. 


 






ఇక మ్యాచ్ విషయానికొస్తే..  తొలుత బ్యాటింగ్ చేసిన గాలె టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో  3 వికెట్ల నష్టానికి  188 పరుగులు చేసింది.   టిమ్ సీఫర్ట్ (54), శెవోన్ డానియల్ (49), భానుక రాజపక్స  (30)లు రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కొలంబో..  19.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. పతుమ్ నిస్సంక (54) తో  పాటు బాబర్ ఆజమ్ రాణించారు. బాబర్.. 59 బంతుల్లోనే  8 బౌండరీలు, ఐదు సిక్సర్ల  సాయంతో  104 పరుగులు చేశాడు. సెంచరీ తర్వాత బాబర్ నిష్క్రమించినా  మహ్మద్ నవాజ్ ఆఖర్లో నాలుగు బంతుల్లోనే ఓ ఫోర్, ఓ సిక్స్‌తో  మ్యాచ్‌ను గెలిపించాడు. 


 






బాబర్ స్పెషల్ రికార్డు.. 


ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా బాబర్ ఆజమ్ ఓ ప్రత్యేక రికార్డును అందుకున్నాడు.  టీ20లలో బాబర్‌కు ఇది పదో సెంచరీ. టీ20లలో అత్యధిక సెంచరీలు సాధించినవారిలో బాబర్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ అగ్రస్థానం (22 సెంచరీలు) లో ఉన్నాడు. లంక ప్రీమియర్ లీగ్‌లో ఇది నాలుగో సెంచరీ కావడం గమనార్హం. 


టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు.. 


క్రిస్ గేల్ : 455 ఇన్నింగ్స్‌లలో 22 సెంచరీలు 
బాబర్ ఆజమ్ : 254 ఇన్నింగ్స్‌లలో 10
మైకెల్ క్లింగర్ : 198 ఇన్నింగ్స్‌లలో 8 
డేవిడ్ వార్నర్ : 355 ఇన్నింగ్స్‌లలో 8 
విరాట్ కోహ్లీ : 357 ఇన్నింగ్స్‌లలో 8























ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial