Jasprit Bumrah Rule OUT: టీమిండియా అభిమానులకు చేదు వార్త. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్- గవాస్కర్ టెస్ట్ సిరీస్ మొత్తానికి భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే అవకాశం ఉంది. మొదట 2 టెస్టులకు ప్రకటించిన స్క్వాడ్ లో బుమ్రా లేడు. తర్వాత 2 టెస్టులకు అందుబాటులో ఉంటాడని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు టోర్నీ మొత్తానికి దూరమైనట్లు సమాచారం.
29 ఏళ్ల బుమ్రా సెప్టెంబర్ 2022 నుంచి అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడలేదు. వెన్నుగాయం కారణంగా అతను జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత ఎన్ సీఏ లో పునరావాసం పొందిన బుమ్రా కోలుకున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు కూడా మీడియాలో కథనాలు వినిపించాయి. మీడియా నివేదికల ప్రకారం.. 'బుమ్రా గాయం నుంచి కోలుకున్నాడు. నెట్స్ లో బౌలింగ్ చేయడం కూడా ప్రారంభించాడు. అయితే భారత జట్టు మేనేజ్ మెంట్ అతనితో రిస్క్ చేయడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే అక్టోబర్ లో స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరగనుంది. అప్పటికి బుమ్రా అందుబాటులో ఉండాలని యాజమాన్యం కోరుకుంటోంది. అందుకే ఆసీస్ తో టెస్ట్ సిరీస్ కు జస్ప్రీత్ ను ఎంపిక చేయడంలేదు' అని కథనాలు పేర్కొన్నాయి.
అప్పటినుంచి జట్టుకు దూరంగా
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు ముందు నుంచీ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. వెన్నెముక గాయమే ఇందుకు కారణం. తీవ్రత ఎక్కువగా ఉండటంతో అత్యంత కీలకమైన ప్రపంచకప్ ఆడలేదు. శ్రీలంక సిరీసుకు ముందు అతడు ఫిట్‌నెస్ సాధించాడని ఎన్‌సీఏ తెలిపింది. సిరీస్‌కు ఎంపిక చేసింది. అయితే ముంబయిలో నెట్స్‌లో బౌలింగ్ చేస్తుండగా అసౌకర్యంగా ఉన్నట్టు బుమ్రా ఫిర్యాదు చేశాడు. దాంతో ముందు జాగ్రత్త చర్యగా సిరీస్ నుంచి తప్పించారు. న్యూజిలాండ్ సిరీసులకూ ఎంపిక చేయలేదు.
ఆస్ట్రేలియాతో సిరీస్ కు ముందు బుమ్రా గురించి రోహితే చేసిన వ్యాఖ్యలు
'బుమ్రా పునరాగమనం గురించి చెప్పలేను. ఆస్ట్రేలియాతో చివరి రెండు మ్యాచులు ఆడతాడని నా నమ్మకం. వెన్నెముక గాయాలు సంక్లిష్టంగా ఉంటాయి. అందుకే అతడి విషయంలో తొందరపడం. రిస్క్ తీసుకోం. ఆసీస్ సిరీస్ తర్వాతా మేం చాలా క్రికెట్ ఆడాల్సి ఉంది. ఎన్‌సీఏ వైద్యులు, ఫిజియోలను మేం నిరంతరం సంప్రదిస్తుంటాం. వైద్యబృందం బుమ్రాకు అవసరమైనంత సమయం ఇస్తుంది' అని భారత కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు.