IND vs AUS 1st Test: ఆస్ట్రేలియా అరంగేట్ర ఆఫ్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఈ యువ బౌలర్ 5 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రంలోనే 5 వికెట్లు తీసిన నాలుగో ఆఫ్ స్పిన్నర్ గా నిలిచాడు. మర్ఫీ కన్నా ముందు పీటర్ టేలర్, జాసన్ క్రెజా, నాథన్ లియాన్ ఉన్నారు.
భారత్ తో జరుగుతున్నతొలి టెస్టులో ఆస్ట్రేలియా యువ బౌలర్ టాడ్ మర్ఫీ అదరగొట్టాడు. సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్ వికెట్లు తీయడానికి ఇబ్బందిపడిన వేళ ఈ అరంగేట్ర బౌలర్ 5 వికెట్లతో చెలరేగిపోయాడు. కేఎల్ రాహుల్, అశ్విన్, పుజారా, కోహ్లీ, శ్రీకర్ భరత్ లను పెవిలియన్ పంపించాడు. టీమిండియా ఇన్నింగ్స్ లో తొలి 4 వికెట్లు మర్ఫీ ఖాతాలోనే చేరాయి. ఈ క్రమంలోనే అరంగేట్రంలోనే 5 వికెట్లు పడగొట్టిన ఆస్ట్రేలియా నాలుగో ఆఫ్ స్పిన్నర్ గా రికార్డు సృష్టించాడు.
అరంగేట్రంలో 5 వికెట్ల ఫీట్ సాధించిన ఆస్ట్రేలియన్ ఆఫ్ స్పిన్నర్లు
పీటర్ టేలర్
ఈ జాబితాలో మొదటి పేరు పీటర్ టేలర్. టేలర్ 1986-87 లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఇంగ్లండ్ పై అరంగేట్రం చేశాడు. 78 పరుగులిచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు.
జాసన్ క్రూజా
ఈ జాబితాలో ఆస్ట్రేలియా రెండో ఆఫ్ స్పిన్నర్ పేరు జాసన్ క్రూజా. ఈ ఆటగాడు 2008-09లో నాగ్‌పూర్‌లో భారత్ పై అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో క్రెజా 215 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు.
నాథన్ లియోన్
ఈ జాబితాలో నాథన్ లియాన్ మూడో స్థానంలో నిలిచాడు. నాథన్ లియాన్ 2011లో శ్రీలంకపై గాలెలో అరంగేట్రం చేశాడు. ఆ తొలి మ్యాచ్‌లో లియాన్ కేవలం 34 పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు.
రోహిత్ సెంచరీ
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ శతకం బాదాడు. 171 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు. టెస్టుల్లో హిట్ మ్యాన్ కు ఇది 9వ సెంచరీ. కఠినమైన పిచ్ పై సహచరులు తడబడుతున్నా కూల్ గా ఆడి రోహిత్ చేసిన ఈ శతకం ప్రత్యేకమైనదే. రోహిత్ సెంచరీతో టీమిండియా ఆధిక్యంలోకి వచ్చింది. ప్రస్తుతం రోహిత్ తో పాటు (103 నాటౌట్), రవీంద్ర జడేజా (12 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
తొలి రోజు నుంచే పూర్తి ఆధిపత్యంతో బ్యాటింగ్ చేసిన రోహిత్ ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. పేసర్లను, స్పిన్నర్లను స్వేచ్ఛగా ఆడాడు. కఠినమైన బంతులను డిఫెన్స్ చేస్తూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును నడిపించాడు. ఈ క్రమంలోనే సుదీర్ఘ ఫార్మాట్లో తన 9వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అలాగే కెప్టెన్ గా అన్ని ఫార్మాట్లలో శతకం బాదిన నాలుగో క్రికెటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ కన్నా ముందు తిలకరత్నే దిల్షాన్, ఫాఫ్ డుప్లెసిస్, బాబర్ అజాం ఉన్నారు. అలాగే వన్డేలు, టీ20లు, టెస్టుల్లో కెప్టెన్ గా సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు