Jasprit Bumrah: వర్షం కారణంగా భారత్, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్ రద్దయింది. అయినా భారత జట్టు మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత జట్టు కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. మూడో టీ20 మ్యాచ్ తర్వాత భారత కెప్టెన్ బుమ్రా తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు.
జస్‌ప్రీత్ బుమ్రా ఏమన్నాడు?
మళ్లీ మైదానంలోకి రావడం సంతోషంగా ఉందని జస్‌ప్రీత్ బుమ్రా అన్నాడు. కానీ మ్యాచ్ కోసం ఎక్కువసేపు నిరీక్షించడం విసుగు తెప్పిస్తోందన్నాడు. ఈ ఉదయం వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉందని, కానీ ఆ తర్వాత వర్షం కారణంగా ఆట ఆడలేకపోయామని భారత కెప్టెన్ చెప్పాడు.
భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడంపై జస్‌ప్రీత్ బుమ్రా తన అభిప్రాయాన్ని తెలిపాడు. భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం గర్వకారణమని జస్‌ప్రీత్ బుమ్రా అన్నాడు. తమ జట్టులోని ఆటగాళ్లందరూ ఉత్సాహంగా ఉన్నారని పేర్కొన్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా మంచి ప్రదర్శనలు ఇవ్వాలన్నాడు. క్రికెటర్లు ఎల్లప్పుడూ తమ బాధ్యత నిర్వర్తించాలని అభిప్రాయపడ్డాడు.
ఈ సిరీస్‌లో బుమ్రా రెండు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ యావరేజ్ కేవలం 9.75 మాత్రమే. ఈ సిరీస్‌లో ఎనిమిది ఓవర్లు బౌల్ చేసిన బుమ్రా కేవలం 39 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంటే అతని ఎకానమీ ఐదు లోపే ఉందన్న మాట.
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో ఆఖరి మ్యాచ్ జరగలేదు. డబ్లిన్ నగరంలో ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో టాస్, బంతి పడకుండానే ఆట రద్దు అయింది. మ్యాచ్ నిర్వహించేందుకు ఆఖరి వరకు నిర్వాహకులు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించలేదు. దీంతో అభిమానులు కూడా నిరాశగా స్టేడియం వీడారు.
ఐర్లాండ్‌లో గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. మూడో మ్యాచ్ ఆరంభానికి ముందే డబ్లిన్‌లో చిరు జల్లులు మొదలయ్యాయి. సమయం గడిచే కొద్దీ యావరేజ్‌గా పడుతున్న వర్షం కాస్త కుండపోతగా మారింది. ఏకంగా రెండు గంటల పాటు నిర్విరామంగా వాన కురిసింది. వరుణుడు మధ్యలో ఒక్కసారి కూడా గ్యాప్ ఇవ్వలేదు. అయినా సరే అభిమానులు స్టేడియంలోనే ఉండటంతో ఐదు ఓవర్ల మ్యాచ్ సాధ్యం అవుతుందేమోనని నిర్వాహకులు ప్రయత్నించారు. కానీ వారి ఆశలు మాత్రం అడియాసలే అయ్యాయి.
భారత కాలమానం ప్రకారం రాత్రి 9:10 గంటలకు మ్యాచ్‌లో ఓవర్ల కోత మొదలైంది. పది గంటల వరకు కూడా వర్షం అస్సలు ఆగలేదు. 10:30 గంటలకు వర్షం ఆగినట్టు సమాచారం వచ్చింది. మరి కాసేపట్లో అంపైర్లు మైదానాన్ని పరిశీలిస్తారని కూడా వార్తలు వచ్చాయి. కానీ అంతలోనే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.
ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌కు కూడా వరుణుడు అంతరాయం కలిగించాడు. ఈ మ్యాచ్‌లో మొదట ఐర్లాండ్ బ్యాటింగ్ చేసింది. అనంతరం టీమ్‌ఇండియా ఛేదనకు దిగాక వర్షం మొదలైంది. ఈ కారణంగా డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఆధిక్యంలో ఉన్న బుమ్రా సేనను విజయం వరించింది. రెండో మ్యాచ్‌లో మాత్రం కుర్రాళ్లు అదరగొట్టారు. రుతురాజ్ గైక్వాడ్ అర్ధశతకం చేశాడు. సంజూ శాంసన్, రింకూ సింగ్, శివమ్ దూబే వేగంగా ఆడి బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial