Ireland vs India, 3rd T20I : 


ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ను టీమ్‌ఇండియా కైవసం చేసుకుంది. మూడు మ్యాచుల సిరీసులో 2-0తో విజయ దుందుభి మోగించింది. వరుణుడు అంతరాయం కలిగించడంతో ఆఖరి మ్యాచ్‌ జరగలేదు. డబ్లిన్‌ నగరంలో ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో టాస్‌, బంతి పడకుండానే ఆట రద్దైంది. మ్యాచ్‌ పెట్టేందుకు ఆఖరి వరకు నిర్వాహకులు ప్రయత్నించారు. కానీ వారి ఆశలు అడియాసలే అయ్యాయి. దాంతో అభిమానులు నిరాశగా స్టేడియం వీడారు.


ఐర్లాండ్‌లో వారం రోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. మూడో మ్యాచ్‌ ఆరంభానికి ముందే డబ్లిన్‌లో జల్లులు మొదలయ్యాయి. సమయం గడిచే కొద్దీ మోస్తరు వర్షం కాస్త కుండపోతగా మారింది. రెండు గంటల పాటు నిర్విరామంగా వాన కురిసింది. వరుణుడు మధ్యలో ఎక్కడా తెరపినివ్వలేదు. అభిమానులు అప్పటికీ స్టేడియంలోనే ఉండటంతో ఐదు ఓవర్ల మ్యాచ్‌ సాధ్యమవుతుందేమోనని నిర్వాహకులు ఎదురు చూశారు. కానీ వారి ఆశలు అడియాసలే అయ్యాయి.


భారత కాలమానం ప్రకారం రాత్రి 9:10 గంటలకు ఓవర్ల కోత మొదలైంది. పది గంటల వరకు వర్షం అస్సలు ఆగలేదు. 10:30 గంటలకు వర్షం ఆగినట్టు సమాచారం తెలిసిందే. మరికాసేపట్లో అంపైర్లు మైదానాన్ని పరిశీలిస్తారని తెలిసింది. కానీ అంతలోనే మ్యాచును రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.


ఈ సిరీసులో మొదటి మ్యాచుకూ వరుణుడు అంతరాయం కలిగించాడు. మొదట ఐర్లాండ్‌ బ్యాటింగ్‌ చేసింది. టీమ్‌ఇండియా ఛేదనకు దిగాక వర్షం మొదలైంది. దాంతో డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం ఆధిక్యంలో ఉన్న బుమ్రా సేనను విజయం వరించింది. ఇక రెండో మ్యాచులో కుర్రాళ్లు అదరగొట్టారు. రుతురాజ్‌ గైక్వాడ్‌ అర్ధశతకం బాదేశాడు. సంజూ శాంసన్‌, రింకూ సింగ్‌, శివమ్‌ దూబె బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు.


గాయాల నుంచి కోలుకొని తిరిగొచ్చిన జస్ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ సైతం ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పేసుగుర్రం బుమ్రా తన మునుపటి ఫామ్‌ను కొనసాగుతున్నాడు. మంచి లయతో బౌలింగ్‌ చేస్తున్నాడు. చురకత్తుల్లాంటి బంతులు విసురుతున్నాడు. అలాగే పాదాలు చిట్లేలా యార్కర్లు సంధిస్తున్నాడు.


ఇక ఇస్రో సాధించిన విజయాన్ని టీమ్‌ఇండియా సెలబ్రేట్‌ చేసుకుంది. విక్రమ్‌ ల్యాండర్ చంద్రుడి మీదకు దిగుతున్న అపురూప సన్నివేశాలను వీక్షించింది. ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన విజయానికి గాను ఆటగాళ్లు అభినందనలు తెలియజేశారు. కుర్రాళ్లంతా టీవీ దిగ్గరే నిలబడి ల్యాండింగ్‌ వీడియోను చూశారు. మిషన్‌ సక్సెస్‌ఫుల్‌ అని చెప్పగానే ఎగిరి గంతులు వేశారు. చప్పట్లు చరిచారు. ఆ తర్వాత మిఠాయిలు పంచారు.