R Ashwin : 


ఆసియాకప్‌ 2023కి ఎంపిక చేసిన భారత జట్టు బాగుందని టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. బయట నాలుగో స్థానంపై విపరీతమైన చర్చ జరుగుతోందని తెలిపాడు. శ్రేయస్‌ అయ్యర్‌ అందుకు సరైన వాడని పేర్కొన్నాడు. ఐదో స్థానంలో కేఎల్‌ రాహుల్‌ను ఆడించాలని సూచించాడు. చీఫ్ సెలక్టర్‌ అజిత్ అగార్కర్‌ దృక్పథం బాగుందని ప్రశంసించాడు. టీమ్‌ఇండియాపై యాష్‌ తన అభిప్రాయాన్ని యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా వివరించాడు.


'నాలుగో స్థానంపై విపరీతమైన చర్చ జరుగుతోంది. శ్రేయస్‌ అయ్యర్‌కు టీమ్‌ఇండియాకు చాలా ముఖ్యం. భారత బ్యాటింగ్‌ లైనప్‌లో అతడెంతో కీలకమైన ఆటగాడు. స్పిన్‌ను అద్భుతంగా ఆడతాడు. పైగా నాలుగో స్థానంలో జట్టుకు నిలకడగా విజయాలు అందించాడు. ఆడిన ప్రతిసారీ జట్టకు మేలు చేశాడు. అతడు పూర్తిగా ఫిట్‌నెస్‌ సాధించాడు. అలాంటప్పుడు నాలుగో స్థానంపై చర్చలు అనవసరం' అని రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు.


టీమ్‌ఇండియా మిస్టర్‌ 360 సూర్యకుమార్‌ యాదవ్‌పై అశ్విన్‌ ప్రశంసలు కురిపించాడు. టీ20ల్లో అతడో అద్భుతమైన మ్యాచ్‌ విన్నర్‌ అని పేర్కొన్నాడు. కొన్నిసార్లు జనాలు అతడికెన్నిసార్లు అవకాశాలు ఇస్తారని పదేపదే ప్రశ్నిస్తుంటారని వెల్లడించాడు. కాగా కొందరు ఆటగాళ్ల విషయం వచ్చినప్పుడు యాష్‌ 'ఐపీఎల్‌ వార్‌ఫేర్‌' గురించి మాట్లాడాడు. అవకాశాలు ఇవ్వడం, ఇవ్వకపోవడంపై స్పందించాడు.


టీమ్‌ఇండియా దశా దిశపై చీఫ్ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ దృష్టి పెట్టారని అశ్విన్‌ అన్నాడు. ఆసియాకప్‌లో రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ ఓపెనింగ్‌ చేస్తారని తెలిపాడు. విరాట్‌ కోహ్లీ ఎప్పట్లాగే మూడో స్థానంలో వస్తాడని పేర్కొన్నాడు. విరాట్‌ నాలుగో స్థానంలో ఆడాలన్న రవిశాస్త్రి, గంగూలీ వాదనలతో అతడు అంగీకరించలేదు. అంత అవసరం లేదన్నాడు. ఆస్ట్రేలియాతో జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.


'ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా గట్టి పోటీదారని మాథ్యూ హెడేన్‌ అన్నాడు. ఆ జట్టు అత్యంత నిలకడగా ఉందన్నాడు. అతడు వాడిన స్థిరత్వం అనే పదంపై జాగ్రత్త వహించాలి' అని యాష్‌ పేర్కొన్నాడు. టీమ్‌ఇండియాలో ఐదో స్థానం గురించి అస్సలు మాట్లాడొద్దని, ఆ ప్లేస్‌లో కేఎల్‌ రాహుల్‌ ఎప్పుడో నిరూపించుకున్నాడని స్పష్టం చేశాడు. ఐర్లాండ్‌ సిరీసులో జస్ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ ప్రదర్శన ఆశలు రేపుతోందని తెలిపాడు.


ఆసియాకప్‌ 2023కి టీమ్‌ఇండియాను ఎంపిక చేశారు. శ్రీలంకలో మ్యాచులు జరుగుతున్నప్పటికీ సెలక్షన్‌ కమిటీ ఒక్క ఆఫ్‌ స్పిన్నర్‌నూ తీసుకోలేదు. యాష్‌కు చోటివ్వలేదు. దాంతో అతడు ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు పరిగణనలో లేడనే అర్థం. ఇక ఆసియా కప్‌కు రిజర్వు ఆటగాడితో కలిపి 18 మంది పేర్లను ప్రకటించారు. గాయాలతో సుదీర్ఘ కాలం దూరమైన కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ మెగా టోర్నీలో పునరాగమనం చేస్తున్నారు. హైదరాబాదీ యువకెరటం, టీ20 క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తున్న తిలక్‌ వర్మకు చోటు దక్కింది. అతడు వన్డేల్లో ఇప్పటి వరకు అరంగేట్రం చేయకపోవడం గమనార్హం. ఫాస్టు బౌలర్లు జస్ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ టోర్నీకి ఎంపికయ్యారు.


భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య (వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమి, ఇషాన్‌ కిషన్‌, శార్దూల్ ఠాకూర్‌, అక్షర్‌ పటేల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, ప్రసిద్ధ్‌ కృష్ణ


రిజర్వు ఆటగాడు: సంజూ శాంసన్‌