ప్రపంచకప్‌లో అప్రతిహాత విజయాలతో టీమిండియా దూసుకుపోతోంది. భారత వేదికగా జరుగుతున్న రోహిత్‌ సేన కప్పు కలను సాకారం చేసుకునేందుకు........ రెండే అడుగుల దూరంలో నిలిచింది. భారత బ్యాటర్లు అదరగొడుతుండగా... బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లను బెదరగొడుతున్నారు. టీమిండియా తురుపుముక్క బుమ్రా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా  ఒకే వికెట్ పడగొట్టినా ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించాడు. వరల్డ్ కప్‌లో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన మొదటి భారత బౌలర్‌గా బుమ్రా రికార్డుల్లోకెక్కాడు. శ్రీలంక బ్యాటర్ పాథుమ్ నిశాంకను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపి అతడు ఈ ఘనత అందుకున్నాడు.

 

ఈ మ్యాచ్‌లో బుమ్రా శ్రీలంక వికెట్ల పతనాన్ని ప్రారంభించగా... షమీ ముగించాడు. ఈ ప్రపంచకప్‌లో బుమ్రా, షమీ, సిరాజ్‌తో కూడిన టీమిండియా పేస్‌ త్రయం.. అంచనాలను మించి రాణిస్తోంది. భారత పేస్‌ దళం ప్రత్యర్థి జట్లను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగిస్తోంది. బ్యాటింగ్‌కు, స్పిన్‌కు అనుకూలంగా ఉండే భారత పిచ్‌లపై భారత పేస్‌ దళం అద్భుతాలు సృష్టిస్తోంది.  భారత పేస్ త్రయంతో సృష్టిస్తున్న సునామీలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లు కొట్టుకుపోతున్నారు. బుల్లెట్లలా దూసుకుస్తున్న బంతులకు బ్యాటర్లు చిత్తు అవుతున్నారు. ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో పోరు మొదలు శ్రీలంకతో మ్యాచ్‌ వరకూ భారత పేసర్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. భారత పిచ్‌లపై స్పిన్నర్లను తోసిరాజని భారత పేసర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రపంచకప్‌లో ప్రస్తుతం అత్యుత్తమ పేస్‌ త్రయం మనదే అనడంలో సందేహం లేదు. జస్‌ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమి, మహమ్మద్‌ సిరాజ్‌ కలిసి ప్రత్యర్థి పని పడుతున్నారు. ఈ పేస్ త్రయం మొదట బ్యాటింగ్‌లోనైనా, ఛేదనలోనైనా ప్రత్యర్థి వెన్ను విరుస్తున్నారు. తొలి 15 ఓవర్లలోనే ప్రత్యర్థిని దెబ్బకొట్టి ఈ పేసర్లు మ్యాచ్‌ను మనవైపు తిప్పేస్తున్నారు.

ఈ ప్రపంచకప్‌లోఏడు మ్యాచ్‌ల్లో భారత్‌ మొత్తం 64 వికెట్లు పడగొట్టగా.. అందులో పేసర్లే 45 వికెట్లు పడగొట్టారంటే మన పేసర్ల ఆధిపత్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 7 మ్యాచ్‌ల్లో బుమ్రా 15, సిరాజ్‌ 9 వికెట్లు సాధించగా.. షమి మూడు మ్యాచుల్లోనే 14 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. హార్దిక్‌, శార్దూల్‌ కలిసి 7 వికెట్లు తీశారు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రా, షమీ వరుసగా అయిదు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నారు. మన పేసర్లు ఇదే ఫామ్‌ కొనసాగిస్తే కప్పు దక్కడం ఖాయం.

 

ఇక శ్రీలంకతో వన్ సైడెడ్‌గా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై ఏకంగా 302 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ వరుసగా ఏడో మ్యాచ్‌లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో తిరిగి మొదటి స్థానానికి చేరుకుంది. ఈ విజయంతో సెమీ ఫైనల్స్‌కు అధికారికంగా అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలిచింది. నెట్ రన్‌రేట్‌ను భారీగా మెరుగుపరుచుకుంది కానీ దక్షిణాఫ్రికా కంటే కాస్త తక్కువగానే ఉంది. ఐదు వికెట్లు పడగొట్టిన మహ్మద్ షమీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇన్నింగ్స్ మొదటి బంతి నుంచే శ్రీలంక పతనం ప్రారంభం అయింది. పతుం నిశ్శంకను బుమ్రా అద్భుత బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. బుమ్రా చేసిన పుండుపై హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ మహ్మద్ సిరాజ్ మసాలా కారం చల్లాడు. రెండో ఓవర్లో దిముత్ కరుణ రత్నే, సదీర సమరవిక్రమ, కుశాల్ మెండిస్‌లను అవుట్ చేశాడు. దీంతో శ్రీలంక మూడు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.