ప్రపంచకప్‌లో టీమిండియా అప్రతిహాత విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకూ ఆడిన అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టింది. రోహిత్ శర్మ సారధ్యంలో ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ ఒక్క మ్యాచులోనూ టీమిండియా ఓటమి పాలుకాలేదు. భారత ఊపు చూస్తుంటే ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా ప్రపంచకప్‌ను కైవసం చేసుకునేలా కనిపిస్తోంది. ప్రపంచకప్‌లో ఇంతకుముందు ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా కప్‌ కైవసం చేసుకున్న జట్లే ఏమైనా ఉన్నాయా పదండి తెలుసుకుందాం..



విండీస్‌ శకం...
 1975 నుంచి కేవలం రెండు జట్లు మాత్రమే ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా కప్‌ను కైవసం చేసుకున్నాయి. అవి వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా.  ఈ రెండు జట్లే మెగా టోర్నమెంట్ అంతటా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ప్రపంచ కప్‌ను గెలుచుకోగలిగాయి. 1975లో ఇంగ్లాండ్‌లో జరిగిన తొలి ప్రపంచకప్‌ జరిగింది. ఈ విశ్వ సమరంలో క్లైవ్ లాయిడ్ నేతృత్వంలోని వెస్టిండీస్ మొట్టమొదటి వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్‌ను గెలుచుకుంది. ఈ టోర్నీలో వెస్టిండీస్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. 1975 ప్రపంచకప్‌లో కరేబియన్లు శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియాపై విజయం సాధించారు. 1979 ప్రపంచకప్‌లోనూ ఒక్క మ్యాచ్‌ ఓడిపోకుండా టైటిల్‌ను కాపాడుకున్నారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా బంతి కూడా వేయకుండానే రద్దుకాగా మిగిలిన అన్ని మ్యాచుల్లో వెస్టిండీస్ అజేయమైన విజయ పరంపర కొనసాగింది. 



ఆస్ట్రేలియా జైత్రయాత్ర...
 ఈ మెగా టోర్నీలో ఎలాంటి మ్యాచ్‌లు ఓడిపోకుండా 2003 వన్డే ప్రపంచకప్‌ను చేజిక్కించుకున్న రెండో జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. దక్షిణాఫ్రికాలో జరిగిన టోర్నీలో ఆస్ట్రేలియా ఆడిన 11 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. వెస్టిండీస్ మాదిరిగానే, ఆసిస్‌ కూడా ఓడిపోకుండా ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ను గెలుచుకుంది. టోర్నీలో మొత్తం 11 మ్యాచ్‌లు గెలిచిన ఆసీస్... వెస్టిండీస్‌ సరసన నిలిచింది. 



ఇక టీమిండియా వంతు...
 2023 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని మెన్ ఇన్ బ్లూ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. ODI ప్రపంచ కప్ 2023లో ఏడు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉంది. గురువారం వన్ సైడెడ్‌గా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై ఏకంగా 302 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ వరుసగా ఏడో మ్యాచ్‌లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో తిరిగి మొదటి స్థానానికి చేరుకుంది. ఈ విజయంతో సెమీ ఫైనల్స్‌కు అధికారికంగా అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలిచింది. నెట్ రన్‌రేట్‌ను భారీగా మెరుగుపరుచుకుంది కానీ దక్షిణాఫ్రికా కంటే కాస్త తక్కువగానే ఉంది. ఐదు వికెట్లు పడగొట్టిన మహ్మద్ షమీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇన్నింగ్స్ మొదటి బంతి నుంచే శ్రీలంక పతనం ప్రారంభం అయింది. పతుం నిశ్శంకను (0: 1 బంతి) జస్‌ప్రీత్ బుమ్రా అద్భుత బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. బుమ్రా చేసిన పుండుపై హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ మహ్మద్ సిరాజ్ మసాలా కారం చల్లాడు. రెండో ఓవర్లో దిముత్ కరుణ రత్నే (0: 1 బంతి), సదీర సమరవిక్రమ (0: 4 బంతుల్లో), మూడో ఓవర్లో కుశాల్ మెండిస్‌లను (1: 10 బంతుల్లో) అవుట్ చేశాడు. దీంతో శ్రీలంక మూడు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.