2023 వరల్డ్ కప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. గురువారం వన్ సైడెడ్‌గా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై ఏకంగా 302 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక  19.4 ఓవర్లలో 55 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ వరుసగా ఏడో మ్యాచ్‌లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో తిరిగి మొదటి స్థానానికి చేరుకుంది. ఈ విజయంతో సెమీ ఫైనల్స్‌కు అధికారికంగా అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలిచింది. నెట్ రన్‌రేట్‌ను భారీగా మెరుగుపరుచుకుంది కానీ దక్షిణాఫ్రికా కంటే కాస్త తక్కువగానే ఉంది. ఐదు వికెట్లు పడగొట్టిన మహ్మద్ షమీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.


భారత బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (92: 92 బంతుల్లో, 11 ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ (88: 94 బంతుల్లో, 11 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (82: 56 బంతుల్లో, మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు) కూడా రాణించారు. కానీ ఈ ముగ్గురూ సెంచరీలు చేజార్చుకున్నారు. శ్రీలంక బౌలర్లలో పేసర్ దిల్షాన్ మధుశంక ఐదు వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక బ్యాటర్లలో పదో నంబర్ బ్యాటర్ కసున్ రజత (14: 17 బంతుల్లో, రెండు ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు తీసుకున్నాడు.


ఇదెక్కడి ఆటయ్యా బాబూ...
ఇన్నింగ్స్ మొదటి బంతి నుంచే శ్రీలంక పతనం ప్రారంభం అయింది. పతుం నిశ్శంకను (0: 1 బంతి) జస్‌ప్రీత్ బుమ్రా అద్భుత బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. బుమ్రా చేసిన పుండుపై హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ మహ్మద్ సిరాజ్ మసాలా కారం చల్లాడు. రెండో ఓవర్లో దిముత్ కరుణ రత్నే (0: 1 బంతి), సదీర సమరవిక్రమ (0: 4 బంతుల్లో), మూడో ఓవర్లో కుశాల్ మెండిస్‌లను (1: 10 బంతుల్లో) అవుట్ చేశాడు. దీంతో శ్రీలంక మూడు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.


ఆ తర్వాత వచ్చిన షమీ కూడా శ్రీలంకను గట్టి దెబ్బ కొట్టాడు. తన మొదటి ఓవర్లోనే చరిత్ అసలంక (1: 24 బంతుల్లో), దుషాన్ హేమంతలను (0: 1 బంతి) పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో శ్రీలంక మొదటి 10 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి 14 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత ఏంజెలో మాథ్యూస్ (12: 25 బంతుల్లో, ఒక ఫోర్), మహీష్ తీక్షణ (12: 23 బంతుల్లో, రెండు ఫోర్లు), కసున్ రజిత (14: 17 బంతుల్లో, రెండు ఫోర్లు) కాస్త ప్రతిఘటించడంతో శ్రీలంక 50 పరుగుల మార్కును దాటింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఐదు వికెట్లు పడగొట్టారు. మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీసుకున్నారు.


అదరగొట్టిన భారత బ్యాటర్లు
అంతకు ముందు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక మొదట బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టుకు మొదటి ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మను (2: 4 బంతుల్లో) దిల్షాన్ మధుశంక రెండో బంతికే అద్భుతమైన యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో భారత్ నాలుగు పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయింది. అక్కడ నుంచి శుభ్‌మన్ గిల్ (92: 92 బంతుల్లో, 11 ఫోర్లు, రెండు సిక్సర్లు), వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లీ (88: 94 బంతుల్లో, 11 ఫోర్లు) ఇన్నింగ్స్ నిలబెట్టే బాధ్యతను తీసుకున్నారు. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో మొదటగా విరాట్ కోహ్లీ 50 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే ఇన్నింగ్స్ 19వ ఓవర్లో శుభ్‌మన్ గిల్ కూడా 55 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసుకున్నాడు.


వీరిద్దరూ సెంచరీ పూర్తి చేసుకుంటారు అన్న తరుణంలో మధుశంక బౌలింగ్‌లో అప్పర్ కట్‌కు ప్రయత్నించిన శుభ్‌మన్ గిల్ వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ చేతికి చిక్కాడు. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 189 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. కాసేపటికే మధుశంక స్లో బాల్‌తో కోహ్లీని కూడా బోల్తా కొట్టించాడు. భారత్ మూడు పరుగుల వ్యవధిలోనే క్రీజులో కుదురుకున్న ఇద్దరు బ్యాటర్ల వికెట్లు కోల్పోయింది.


ఈ దశలో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ (82: 56 బంతుల్లో, మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు), కేఎల్ రాహుల్ (21: 19 బంతుల్లో, రెండు ఫోర్లు) స్కోరు వేగాన్ని పెంచారు. కేవలం 7.5 ఓవర్లలోనే నాలుగో వికెట్‌కు 60 పరుగుల కీలక భాగస్వామ్యం అందించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (12: 9 బంతుల్లో, రెండు ఫోర్లు) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. చివరి ఓవర్లలో శ్రేయస్ అయ్యర్ చాలా వేగంగా ఆడాడు. మధుశంక వేసిన 48వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన శ్రేయస్ మూడో బంతికి అవుటయ్యాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా (35: 24 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) కూడా వేగంగా ఆడటంతో భారత్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోరు కొట్టింది.