Jasprit Bumrah Fitness: టీమిండియా పేస్ గుర్రం జస్ప్రిత్ బుమ్రా ఏడాది కాలం తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడని, ఆ మేరకు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో అతడు ఫిట్‌నెస్‌ను పెంచుకుంటున్నాడని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అన్నీ కుదిరితే వచ్చే నెలలో భారత జట్టు.. ఐర్లాండ్‌తో ఆడే మూడు టీ20ల సిరీస్‌లో అతడు ఆడే అవకాశాలున్నాయని కూడా బీసీసీఐ వర్గాలు చెప్పాయి. కానీ ఎన్సీఏ ఫిజియోలు మాత్రం బుమ్రా మరికొంతకాలం ఆడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
రెండ్రోజుల క్రితం బుమ్రా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎన్సీఏలో బౌలింగ్ చేస్తున్న వీడియోను పంచుకుంటూ ‘ఐయామ్ కమింగ్ హోమ్’ అనే పాటను దానికి జతచేసి ‘నేను టీమిండియాలోకి వస్తున్నా’అని చెప్పకనే చెప్పాడు. గత నెలలో ఎన్సీఏలో రోజుకు ఆగకుండా 7-8 ఓవర్లు వేసిన బుమ్రా.. ప్రస్తుతం 10 వరకు వేయగలుగుతున్నాడని తెలుస్తున్నది. ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ వంటి కీలక టోర్నీలు ముందున్న నేపథ్యంలో నేరుగా వాటిలో ఆడించకుండా బుమ్రాను ఐర్లాండ్‌తో ఆడించాలని పలువురు వాదిస్తున్నారు. కానీ బీసీసీఐ, సెలక్టర్లకు ఎన్సీఏ షాకిచ్చింది.
ఎన్సీఏ స్పోర్ట్స్ సైన్స్, మెడిసిన్ టీమ్ మాత్రం బుమ్రా.. ఐర్లాండ్ టూర్‌లో పాల్గొనేందుకు పూర్తి ఫిట్నెస్ సాధించలేదని, అతడిని మరికొన్ని రోజులు గడువిస్తేనే బెటర్ అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నది. ఒకవేళ ఐర్లాండ్ టూర్‌కు ఆడించాలని చూస్తే అంతకంటే ముందే దేశవాళీలో ఆడించి చూడాలన్న వాదనను తీసుకొస్తున్నారు. వాస్తవానికి రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడయ్యాక.. గాయపడ్డ క్రికెటర్లు తిరిగి జట్టులోకి రావాలంటే దేశవాళీలో ఒకటి, రెండు మ్యాచ్‌లు ఆడి పూర్తి ఫిట్నెస్ సాధించుకున్న తర్వాతే రావాలని అనధికారిక నిబంధన అమల్లో ఉంది. ఈ లెక్కన చూస్తే.. బుమ్రా ఐర్లాండ్ టూర్‌కు ముందు భారత్‌లో జరుగబోయే దేవదార్ ట్రోఫీలో ఆడించాలని బీసీసీఐ భావిస్తోంది.
ఐర్లాండ్ టూర్ కంటే ముందు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. ఎన్సీఏ ఫిజియోలతో సమావేశమయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది.. వాళ్లు ఇచ్చే నివేదిక ఆధారంగానే బుమ్రాను ఆడించాలా..? లేదా..? అన్నది తేలాల్సి ఉంది. బుమ్రాతో పాటు శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్‌ల ప్రోగ్రెస్ ఏమేరకు ఉంది..? అన్న విషయాన్ని కూడా అగార్కర్ చర్చించనున్నాడు.
ప్రస్తుతం నిరాటంకంగా 10 ఓవర్ల వరకూ బౌలింగ్ చేస్తున్న బుమ్రా.. ఐర్లాండ్ సిరీస్‌లో ఆడితే నాలుగు ఓవర్ల కోటాతో పాటు 16 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేయాలి. ఒకవేళ ఆసియా కప్ ఆడాల్సి వస్తే 10 ఓవర్లు బౌలింగ్ చేసి 40 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంత ఫిట్నెస్ బుమ్రాకు ఉందా..? అన్నది కూడా స్పష్టత లేదు. ప్రస్తుతానికైతే.. బుమ్రా విషయంలో ఎన్సీఏ నుంచి బీసీసీఐకి గ్రీన్ లైట్ రాలేదని, త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial