Ishant Sharma On Dhoni: ఇషాంత్ శర్మ.. కొన్నేళ్లపాటు భారత జట్టు ఫాస్ట్ బౌలింగ్ ను ముందుండి నడిపించాడు. తన బౌలింగ్ తో ఎన్నో మ్యాచుల్లో జట్టుకు విజయాలు అందించాడు. టెస్ట్ మ్యాచుల్లో నమ్మదగ్గ బౌలర్ గా మారాడు. అయితే ప్రతి క్రికెటర్ కు ఉన్నట్లే ఇషాంత్ కు తన కెరీర్ లో గడ్డుకాలం ఎదురైంది. అలాంటి ఒక స్థితిలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తనకు అండగా నిలబడిన విధానాన్ని ఇషాంత్ గుర్తుచేసుకున్నాడు.
నెలరోజులపాటు ఏడ్చాను
2013లో ఆస్ట్రేలియా జట్టు భారత్ లో పర్యటించింది. ఇరు జట్ల మధ్య మొహాలీలో వన్డే మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది. ఇషాంత్ శర్మ తన కోటా ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. జట్టు ఓటమికి ప్రధాన కారణంగా మారాడు. ఆ సమయంలో తానెంతో బాధపడ్డానని ఇషాంత్ తెలిపాడు. ఆ సందర్భం గురించి మాట్లాడుతూ.. 'అది నా కెరీర్ లోనే అత్యంత బాధాకరమైన సమయం. నేను ఆ వన్డేలో భారీగా పరుగులిచ్చాను. నా వల్లే మ్యాచ్ ఓడిపోయాం. అది నన్ను చాలా బాధించింది. ఆ టైంలో నేను నా భార్యతో డేటింగ్ చేస్తున్నాను. రోజూ ఆమెకు ఫోన్ చేసి దాదాపు నెలరోజుల పాటు ఏడ్చాను' అని ఇషాంత్ తెలిపాడు.
ఆ సమయంలో కెప్టెన్ అయిన ధోనీ, సహచర క్రికెటర్ శిఖర్ ధావన్ తనను ప్రోత్సహించారని ఇషాంత్ తెలిపాడు. ఆ సమయంలో మహీ భాయ్, శిఖర్ లు నా గదికి వచ్చారు. నువ్వు బాగా ఆడుతున్నావు అని ధోనీ అన్నాడు. అని ఇషాంత్ చెప్పాడు. ఆ ఒక్క మ్యాచ్ తో తాను వన్డేలకు సరిపడనేమో అని అనిపించిందని ఇషాంత్ శర్మ పేర్కొన్నాడు.
ప్రస్తుతం ఇషాంత్ భారత జట్టులో ఆడడంలేదు. చివరిసారిగా 2021లో టీమిండియా తరఫున ఆడాడు. అప్పట్నుంచి ఏ ఫార్మాట్ లోనూ ఇషాంత్ కు అవకాశాలు రావడంలేదు.