Kane Williamson: న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ఓ రికార్డును నెలకొల్పాడు. కివీస్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా నిలిచాడు. వెల్లింగ్టన్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో కేన్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ లో సెంచరీ (132) చేసిన విలియమ్సన్ మొత్తం 7,684 టెస్ట్ పరుగులతో ఉన్నాడు. అంతకుముందు ఈ రికార్డు రాస్ టేలర్ (7683) పేరిట ఉండేది.
ఇంగ్లండ్ తో రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో వెనుకబడ్డ న్యూజిలాండ్ అద్భుతంగా పుంజుకుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్లకు 435 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. బదులుగా కివీస్ 209 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు కెప్టెన్ టిమ్ సౌథీ (49 బంతుల్లో 73) మినహా ఎవరూ రాణించలేదు. దీంతో ఇంగ్లండ్ న్యూజిలాండ్ ను ఫాలో ఆన్ ఆడించింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో కివీస్ పుంజుకుంది. విలియమ్సన్ (132) శతకంతో అదరగొట్టాడు. టామ్ లాథమ్ (83), డెవాన్ కాన్వే (61), టామ్ బ్లండెల్ (90), డారిల్ మిచెల్ (54) రాణించారు. దీంతో ఆ జట్టు 483 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ముందు 258 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.
గౌరవంగా భావిస్తున్నాను
కేన్ విలియమ్సన్ ఇప్పటివరకు మొత్తం 161 టెస్ట్ ఇన్నింగ్సుల్లో 7684 పరుగులు చేశాడు. మ్యాచ్ అనంతరం కేన్ దీని గురించి మాట్లాడాడు. 'బ్యాటింగ్ చేసేటప్పుడు నేను ఈ రికార్డు గురించి ఆలోచించలేదు. అయితే అత్యధిక పరుగులు చేసిన వారి లిస్టులో నా పేరుండడం నాకు దక్కిన గౌరవంగా అనిపిస్తోంది. ఆ జాబితాలో ఉన్నవారిని చూస్తూ నేను పెరిగాను. కొందరితో కలిసి ఆడాను. వారి పక్కన నా పేరుండడం బాగుంది.' అని విలియమ్సన్ చెప్పాడు.
ఈ జాబితాలో కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ తర్వాత స్టీఫెన్ ఫ్లెమింగ్ 1,172 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. కివీస్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన కేన్ ను ఫ్లెమింగ్ అభినందించాడు. 'అభినందనలు, కేన్. ఈ రికార్డు టెస్ట్ క్రికెట్ పై మీకున్న కృషి, అంకితభావానికి నిదర్శనం' అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.