ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత్ భారీ స్కోరు సాధించింది. మొదట బ్యాటింగ్ చేస్తూ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ (58: 43 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సంజు శామ్సన్ (40: 26 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్), రింకూ సింగ్ (38: 21 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో బ్యారీ మెకార్తీకి రెండు వికెట్లు దక్కాయి. ఐర్లాండ్ విజయానికి 120 బంతుల్లో 186 పరుగులు కావాలి.


ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. వేగంగా ఆడే క్రమంలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (18: 11 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), తిలక్ వర్మ (1: 2 బంతుల్లో) పెవిలియన్ బాట పట్టారు. దీంతో భారత్ 34 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శామ్సన్ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. మొదట మెల్లగా ఆడిన వీరు తర్వాత గేర్లు మార్చారు. రుతురాజ్ గైక్వాడ్, సంజు శామ్సన్ ఇద్దరూ అడపాదడపా బౌండరీలు కొడుతూ రన్‌రేట్ పడిపోకుండా చూశారు.


మూడో వికెట్‌కు వీరిద్దరూ 69 పరుగుల భాగస్వామ్యం అందించారు. వీరి జోడీ బలపడుతున్న దశలో సంజు శామ్సన్‌ను అవుట్ చేసి బెంజమిన్ వైట్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. కాసేపటికే రుతురాజ్ గైక్వాడ్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 39 బంతుల్లో రుతురాజ్ అర్థ సెంచరీ సాధించాడు. ఆ తర్వాతి ఓవర్లోనే బ్యారీ మెకార్తీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ బాట పట్టాడు.


అక్కడి నుంచి ఐపీఎల్ హీరోలు రింకూ సింగ్, శివం దూబే (22 నాటౌట్: 16 బంతుల్లో, రెండు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకువెళ్లారు. సిక్సర్లతో చెలరేగారు. కేవలం 28 బంతుల్లోనే ఐదో వికెట్‌కు 55 పరుగుల కీలకమైన, వేగవంతమైన భాగస్వామ్యాన్ని అందించారు. దీంతో భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో బ్యారీ మెకార్తీ రెండు వికెట్లు పడగొట్టాడు. మార్క్ అడెయిర్, క్రెయిగ్ యంగ్, బెంజమిన్ వైట్‌లకు తలో వికెట్ దక్కింది.


ఐర్లాండ్ తుది జట్టు
పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్


భారత్ తుది జట్టు
రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా (వికెట్ కీపర్), రవి బిష్ణోయ్


Also Read: విరాట్‌ కోహ్లీ @ 15 ఏళ్లు! వికెట్ల మధ్యే 510 కి.మీ పరుగెత్తిన ఏకైక వీరుడు!



Also Read: నేను రిలాక్స్‌డ్‌గా ఉన్నా! ఎంజాయ్‌ చేసేందుకే వస్తున్నా - బుమ్రా!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial