Shubman Gill: ఐపీఎల్ లోకి గతేడాది ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. ఎవరూ ఊహించని విధంగా ఏకంగా  టైటిల్ గెలిచి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.  టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని  గుజరాత్..  లీగ్ దశలో అదరగొట్టి  ప్లేఆఫ్స్ లో రాజస్తాన్ రాయల్స్ ను రెండుసార్లు ఓడించి  కప్ కొట్టింది. ‘అసలు వీళ్లు లీగ్ దశలో టాప్ - 5లో ఉంటేనే గొప్ప’ అనుకున్నవాళ్లకు పాండ్యా తన సారథ్యంతోనే సమాధానం చెప్పాడు.  తనను మరిచిపోతున్న టీమిండియాకు కూడా  ‘నాలో ఆల్ రౌండరే కాదు, కెప్టెన్ కూడా ఉన్నాడు’ అని చాటి చెప్పాడు.  హార్ధిక్ లో కెప్టెన్సీ స్కిల్స్ ను పసిగట్టిన  బీసీసీఐ.. రోహిత్ వారసుడు అతడేనని చెప్పకనే  చెబుతున్నది. మరి అలాంటి హార్ధిక్  కు గుజరాత్ షాకివ్వబోతుందా..? కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్ ను నియమించనుందా..?  


తాజాగా ఇదే విషయంపై  గుజరాత్ టైటాన్స్ టీమ్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి చేసిన వ్యాఖ్యలతో  క్రికెట్ వర్గాలలో  గుజరాత్ కెప్టెన్సీ మార్పు చర్చకు దారితీసింది.  సోలంకి మాట్లాడుతూ... గిల్ లో కెప్టెన్సీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని,  సమీప భవిష్యత్ లో అతడే తమ సారథిగా ఎదుగుతాడని  చెప్పాడు. తాము  టీమ్ మీటింగ్స్ లో గిల్ ను ఆహ్వానించడమే గాక  అతడి అభిప్రాయాలకు విలువిస్తున్నామని  చెప్పాడు.  దీంతో హార్ధిక్ పాండ్యాకు గుజరాత్ టీమ్ లో  ప్రాధాన్యం తగ్గిందా..? అన్న అనుమానాలు మొదలయ్యాయి.  సోషల్ మీడియాలో కూడా  దీనిపై  జోరుగా చర్చ నడుస్తున్నది. 


సోలంకి చెప్పిందిది.. 


వాస్తవానికి  పాండ్యాను కెప్టెన్సీ నుంచి తొలగిస్తానని సోలంకి చెప్పలేదు.  రాబోయే ఐపీఎల్ సీజన్  కు ముందు విలేకరులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సోలంకి మాట్లాడతూ.. ‘గిల్ లో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.   తొలి సీజన్ లో కూడా అతడు పలు బాధ్యతలు తీసుకున్నాడు.   వృత్తి పట్ల అతడికున్న నిబద్ధత  కూడా  గిల్ ను సారథిగా తీర్చిదిద్దుతోంది. భవిష్యత్ లో  గిల్  మా టీమ్ కు సారథి కాగలడా..? అంటే మాత్రం  నేను కచ్చితంగా అవుననే సమాధానం చెబుతా..  అయితే  ఇంతవరకూ  ఈ విషయంలో మేం  ఏ నిర్ణయమూ తీసుకోలేదు.   గిల్ చాలా  ప్రతిభావంతుడైన క్రికెటర్. జట్టుకు సంబంధించిన కీలక విషయాల్లో మేం అతడి అభిప్రాయాలకు గౌరవిస్తాం..’అని చెప్పాడు.  


ఇక గత సీజన్ లో  గుజరాత్ ఓపెనర్ గా బరిలోకి దిగిన  గిల్.. 16  మ్యాచ్ లలో 432 రన్స్ చేశాడు. రాజస్తాన్ రాయల్స్ తో ఫైనల్ మ్యాచ్ లో భాగంగా హాఫ్ సెంచరీ చేశాడు.  ఏడాదికాలంగా నిలకడగా ఆడుతున్న గిల్.. ఈ ఏడాది  వన్డే జట్టులో కూడా చోటు ఖాయం చేసుకున్నాడు.  2023 జనవరిలో శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్ లలో అదరగొట్టాడు. న్యూజిలాండ్ పై  డబుల్ సెంచరీ, సెంచరీ బాదాడు.   ఈ ప్రదర్శనలతో ఆస్ట్రేలియాతో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో  కూడా అతడికి చోటు దక్కింది. అహ్మదాబాద్ టెస్టులో సెంచరీ చేసిన గిల్.. వన్డే సిరీస్ లో మాత్రం  ఆకట్టుకోలేకపోయాడు.