World Boxing C'ships: న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ప్రపంచ సీనియర్ మహిళల  బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్   జోరు కొనసాగుతోంది.  50 కేజీల విభాగంలో పోటీ పడుతున్న ఈ ఇందూరు (నిజామాబాద్) బాక్సర్..   గురువారం ముగిసిన సెమీఫైనల్స్ లో 5-0 తేడాతో 2016 లో జరిగిన రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఇన్‌గ్రిత్  వలెన్సియాను చిత్తుగా ఓడించి మరో పసిడి పతకానికి అడుగుదూరంలో నిలిచింది. 


కొలంబియాకు చెందిన  ఇన్‌గ్రిత్  వలెన్సియా.. టోక్యో ఒలింపిక్స్ లో  భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ ను  ఓడించింది.  ఆమె ఆట గురించి అవగాహన ఉన్న  నిఖత్..  వలెన్సియాను తక్కువగా అంచనా వేయకుండా జాగ్రత్తగా ఆడింది. ఆమె తనపై ఆధిపత్యం ప్రదర్శించకుండా  చూసుకుంటూ  విజయం సాధించింది.  కాగా  ఈ విజయంతో నిఖత్.. ఆదివారం జరుగబోయే ఫైనల్స్ లో వియాత్నాం బాక్సర్ .. ఎన్గుయోన్ థి టామ్ తో  తలపడనుంది. 


నీతూ, లవ్లీనాలూ  ఫైనల్స్‌కు.. 


నిఖత్ తో పాటు టోక్యో ఒలింపిక్స్ లో పతకం సాధించిన  లవ్లీనా బోర్గోహెయిన్, యువ బాక్సర్  నీతూ ఘంగాస్, స్వీటీ బూరా  కూడా ఫైనల్స్ కు అర్హత సాధించారు.   75 కేజీల విభాగంలో పోటీ పడుతున్న  లవ్లీనా.. 4-1 తేడాతో  చైనా బాక్సర్   లీ కియాన్ ను ఓడించింది.   48 కేజీల విభాగంలో ఉన్న నీతూ.. 5-2 తేడాతో  కజకిస్తాన్ కు చెందిన  అలువా బల్కిబెకోవాపై గెలిచింది. ఇక  81 కిలోల విభాగంలో  ఆడుతున్న స్వీటి..  4-3 తేడాతో  ఆస్ట్రేలియా బాక్సర్   స్యు ఎమ్మా గ్రీన్‌‌ట్రీ పై గెలుపొందింది. నలుగురు బాక్సర్లు ఫైనల్స్ కు  చేరడంతో  భారత్ కు స్వర్ణాల సంఖ్య పెరిగే అవకాశముంది.  ఫైనల్స్ లో నీతూ.. చైనాకు  చెందిన లీనా వాంగ్ తో, ఆస్ట్రేలియా బాక్సర్  కైట్లిన్ పార్కర్ తో  లవ్లీనా, మంగోలియా  క్రీడాకారిణి  అల్టాం ట్‌సెట్‌సెగ్ తో తలపడనున్నారు. 


నిఖత్.. వరుసగా రెండోసారి.. 


గతేడాది ఇస్తాంబుల్ (టర్కీ) వేదికగా జరిగిన  వరల్డ్ సీనియర్ ఉమెన్స్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో ఆడిన నిఖత్ జరీన్ వరుసగా   రెండోసారి తుది పోరుకు అర్హత సాధించడం గమనార్హం. మేరీ కోమ్ తర్వాత  ఈ ఘనత సాధించిన తొలి మహిళా బాక్సర్ మన తెలంగాణ అమ్మాయే. మేరీ కోమ్ వరుసగా ఆరుసార్లు ఫైనల్స్ కు వెళ్లింది. మొత్తంగా ఏడుసార్లు ఫైనల్స్ కు అర్హత సాధించి ఆరు స్వర్ణాలు సాధించింది.  గతేడాది నిఖత్..  5-0 తేడాతో థాయ్‌లాండ్ కు చెందిన  జిట్పాంగ్ ను ఓడించి  పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.  ఈ క్రమంలో ఆమె వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ గెలిచిన తొలి తెలుగు, తెలంగాణ అమ్మాయిగా   చరిత్ర సృష్టించింది. దీంతో పాటు  నిఖత్ జరీన్.. గతేడాది కామన్వెల్త్ గేమ్స్ లో కూడా స్వర్ణం సాధించిన విషయం  తెలిసిందే. వరుస పోటీలలో  స్వర్ణాలు నెగ్గుతున్న జరీన్..  వచ్చే ఏడాది  జరుగబోయే పారిస్ ఒలింపిక్స్ లో కూడా  స్వర్ణం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది.